దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను (1:3).

దేవుడు వెలుగై ఉన్నాడు అని బైబిలు మనకు సెలవిస్తుంది. ఆయన సమీపించరాని తేజస్సులో మహిములో నివసిస్తున్నాడు అని కూడా తెలియజేస్తుంది. ఆయన చేసిన వెలుగును మనము చూచినప్పుడు ఆయన కలిగియున్న దానిని ఉత్తమమైన దానిని మనకు దయచేశారు అని అర్థము అవుతుంది. ఆయనకు ఘనత ఇచ్చిన దానిని మనకు ఇవ్వడమును బట్టి ఆయన ఏదీకూడా దాచిపెట్టుకొనకుండా మనకు దయచేయువాడు అని, చాలా పారదర్శకత కలిగినవాడు అని మనకు అర్థము అవుతుంది. కేవలము తల్లిదండ్రులు మాత్రమే అలాగున తమ కుమారులకు ఇవ్వగలరు గాని ఏ ఇతరరకమైన ప్రేమ కూడా ఈలాగున చేయలేదు. ఈయన ఇంకొక అడుగు ముందుకువేసి తన ప్రాణము సైతము మనకోసం ఇచ్చివేశారు. ఆ మహోన్నత ప్రేమను వర్ణించడానికి మానవాళి అంతా శతాబ్దాలుగా భాష కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ఈ భూమి ఉన్నంతవరకు ఎదురుచూచినా కూడా అలాంటి భాష దొరకదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. మొదటిసారిగా మనకు ఆయన అత్యున్నతమైన దానినే ఇవ్వడము జరిగినది.

ఈ యొక్క వెలుగునకు మాత్రమే చీకటిని పారద్రోలే శక్తి ఉన్నది. ఈ వెలుగుద్వారా మనకు భద్రత, రక్షణ కలుగుతుంది. ఏదీకూడా మనకు తెలియకుండా ప్రవేశించకుండా సమస్తము తేటతెల్లగా చూపిస్తుంది. ఈ యొక్క వెలుగు ఉన్నంతవరకు చీకటి మరల ప్రవేశించటము అసాధ్యము. అందుకే ఆయనతో సహవాసము అనేది మన జీవితములకు ఎంతో ఆవశ్యకము. ఈ వెలుగుద్వారా ఆయన చేతి పనులను, క్రియలను గమనించి ఆయన హృదయము ఎలాంటిది అనేది గ్రహించాలి. చీకటిలో సహితము ఆయన మనలను చూడగలడు ఆయన వెలుగు లేకుండా నీవు ఆయనను చూడలేవు.

ఒక ఆత్మ రక్షణలోనికి నడిపించబడే సమయంలో కూడా దేవుడు ఆ వ్యక్తిని వెలిగిస్తారు. అప్పటివరకూ అతను నివసించినది అంధకారము అని తెలిసేలా చేస్తారు. ఆయన వెలుగులో ఆ ఆత్మ తన ఆవశ్యకతను, పుట్టుక వెనుక గల పరమార్ధమును గ్రహిస్తుంది. ఆ వెలుగు లేకపోతే ఆ గ్రహింపు ఎప్పటికి రాదు. మనకు కన్నులు ఉన్నాకూడా ఆయన వెలుగు లేకపోతే ఏదీకూడా చేయలేము ఎక్కడికి వెళ్లలేము ఏ పని కూడా చేయలేము. వెలుగు అనేది మన జీవితమునకు ఎంత అవసరము, దాని ప్రాముఖ్యత ఏమిటి అనేది మన అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆయన ఇచ్చిన ఈ వెలుగుద్వారా మాత్రమే మన అనుదిన జీవితము సక్రమముగా నడిపించుకొని మన గమ్యమునకు చేరుకొనగలము. ఆయన వెలుగులో మాత్రమే మనము నడుస్తున్న త్రోవను స్పష్టంగా చూడగలము. అడ్డంకులను తప్పించుకొనగలము. కన్నులెత్తి దూరముగా చూచి మన మార్గము మనలను ఎక్కడికి చేరుస్తుందో కూడా గుర్తించగలము. ఆయన వాక్యము అయిన ఈ వెలుగు లేకపోతే మన మనుగడ ఊహించడానికే భయము వేస్తుంది. సత్యమైన ఆ వెలుగు మాత్రమే మన శరీరము, ప్రాణము, ఆత్మకు అవసరమైన శాంతిని, సమాధానమును దయచేస్తుంది

దేవుడు చేసిన ఈ వెలుగు మనలను ఈ లోకమువరకు మాత్రమే కాకుండా, ఈ లోకము విడిచిన తర్వాత కూడా మనలను నడిపిస్తుంది. వెలుగునకు ఎక్కడా చెడుచేసే లక్షణము లేదు. పరలోకమునకు మనలను నడిపించి ఇప్పుడు ఉన్నదానికన్నా మెరుగైన అత్యుత్తమ స్థానములో ఉంచినట్లు వెలుగు మనలను అంతకంతకు ఉన్నత స్థలములలోనికి నడిపిస్తుంది. ఈ విషయము దేవుడు మొదటి అధ్యాయములో చేసిన సృష్టిని గమనించినప్పుడు మనకు స్పష్టంగా అర్థము అవుతుంది. ఈ వెలుగును మనము దూరం చేసుకొనవలసినదే తప్ప దేవుడు ఎప్పుడు మనకు దూరము చేయరు. ఆయన స్వచిత్తములో ఎప్పుడు మనకు చీకటి కలుగజేయరు. మనము మన పాపములద్వారా ఆయనను ఎంత విసిగించినా కూడా ఇంకా వెలుగును మనకు అందుబాటులో ఉంచటము అందుకు నిదర్శనము. దీనిని ప్రతిసారి సూర్యుని ద్వారా వచ్చే వెలుగు అని భ్రమ పడకూడదు. ఇది ఆత్మలో సత్యము ద్వారా కలిగించే వెలుగైయున్నది. అది మనకు ఎల్లప్పుడు మేలునే అనుగ్రహిస్తుంది. దాని వన్నె తగ్గదు. నశించిపోవటము, కాలముతో క్షీణించిపోవటము దానికి తెలియవు. అది దేనిమీద పడుతుందో దానిని అందముగా కనిపించేలా చేస్తుంది. ఈ వెలుగు ఉన్నంతవరకు మనము వర్ధిల్లుతామే తప్ప నష్టం పొందము. ఆయన ఇచ్చి తీసుకునే దేవుడు కాదు అని దీనినిబట్టి ఆయన ఏది చేసినా మన ఉత్తమమైన మేలుకోసమే అని స్పష్టంగా తెలుస్తుంది

స్తుతి

  • ఆయన ఏదైతే కలిగిఉన్నాడో దానిని మనకు అనుగ్రహించినందుకు
  • చీకటినుండి బయటపడే అవకాశము ఇచ్చి మార్గము చూపినందుకు
  • వెలుగును ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉంచినందుకు.
  • మనకు ఎప్పుడూ మేలు చేయాలి అని మన కష్టంచూసి సహించలేని, ఓర్చుకోలేని ఆయన తండ్రి ప్రేమకొరకు.

ఆరాధన

  • ఆయన ఇచ్చిన వెలుగులో నడుస్తూ, సంతోషముగా ఉంటూ ఆయన హృదయమునకు తద్వారా ఆనందము కలుగజేస్తూ ఆయనను ఆరాధించాలి

హెచ్చరిక

  • మనము ఈ వెలుగును కోల్పోతే ఎల్లప్పుడూ చీకట్లో బ్రతుకవలసి వస్తుంది. ఈ వెలుగు తప్ప మనము విడుదల పొందే మార్గము వేరేది లేదు.

సత్యము

  • దేవుడు మన సంతోషముకొరకు తనకు కలిగిన సమస్తమును ఇస్తారు. అదే ఆయనకు ఆనందము కలుగజేస్తుంది