దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను (1:14-19).

రెండవ దినమున ఆకాశమును సృజించిన దేవుడు నాలుగవ దినమున ఆ ఆకాశమును అందముగా తీర్చిదిద్దటము మనము గమనిస్తాము. ముందుగా భూమిని, వృక్షములు, జలరాసుల ద్వారా అందముగా తీర్చిదిద్దిన తరువాత ఆకాశమును అందముగా చేయటము జరిగినది. ఆకాశము ఆరిన నేల అయిన భూమి కన్నా ఒకరోజు ముందే చేయబడినప్పటికీ ఆయన భూమి నిమిత్తము దానిని ఒకరోజు ఆలస్యము చేశారు. దీనిని బట్టి ఆయనకు భూమి విషయమై ఉన్న శ్రద్ధ అర్థము అవుతుంది. అంతలా ప్రేమించి మన నివాస స్థానమునకు, అది విశ్వములో మిగతా వాటితో పోల్చుకుంటే ఎంత చిన్నది, లెక్కలోనికి రానిది అయినప్పటికీ కూడా దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటము అనేది జరిగినది. అందుకే దావీదు నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏపాటివాడు అని చెప్పటము జరిగినది. ఆయన ఆకాశములో చేసి ఉంచిన జ్యోతులను మనము పరిశీలన చేసినప్పుడు ఆయన చేతిపనికి ఉన్న creativ­ity ఏమిటి అనేది మనకు అర్థము అవుతుంది. గ్రహముల, నక్షత్రముల పరిమాణములు ఆయన శక్తిని మనకు తెలియజేస్తున్నాయి. వెలుగు యొక్క ఆశ్చర్యక్రియలను మానము ఆకాశమందే కనుగొనగలము. మరి మనము మన ఇంటిలో అలంకరించే పనిలో ఎంత ఉన్నాము. ఆయన ఇల్లు అయిన మన హృదయమును ఎంత అలంకరించే పనిలో ఉన్నాము అనేది ప్రశ్నించుకోవాలి?

పగటిని, రాత్రిని మొదటి దినమున వేరుపరచిన దేవుడు వాటిని ఏలుటకు అవసరమైనవాటిని నాలుగవ దినమున చేయటము జరిగినది. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు అనే పేర్లు పెట్టబడలేదు. దేవుడు వాటిని పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి అని మాత్రమే అబివర్నించటం జరిగినది. పెద్ద జ్యోతి ద్వారా పగలు అంతా కూడా వెలుగు దయచేసిన దేవుడు, రాత్రి సమయమునందు గాఢాంధకారము అనేది లేకుండా భూమిమీద వెలుగిచ్చుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసినట్లు వాక్యము సెలవిస్తుంది. మొదటి దినము తరువాత మరల భూమి సంపూర్ణ అంధకార స్థితిలోనికి వెళ్ళటానికి దేవుడు ఎక్కడా అవకాశము ఇవ్వలేదు. మన శరీరములకు తగిన విశ్రాంతి దొరికే విధముగా వాటిని తక్కువ వెలుగుతో చేసి ఆకాశములో ఉంచారు. మనలను అంధకారము చుట్టుముట్టినప్పుడు తన నివాసము వైపు చూడమని ఆ వెలుగుద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. మనము ఎక్కడా భయపడకుండా ఆయన సకల జాగ్రత్తలు తీసుకోవటము జరిగినది. ఆయన దగ్గర చీకటి ఉండదు అని చెప్పటము ద్వారా తన దగ్గరకు వచ్చినవారి జీవితములు ఎలా మారతాయి అనేది కూడా దేవుడు వీటిద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఆ చీకటి తరువాత మరల వెలుగుతో నింపుతున్న దేవునికి కృతజ్ఞతలు. ఆయన మనలను ఎప్పుడు విడిచిపెట్టరు. చీకటికి భయపడకు

ఈ యొక్క వచనముల ద్వారా ఆకాశము అందులోని సమూహము అంతా దేవుని సృష్టి, అయన చేతిపని అని, లోకము భావించిన విధముగా అవి దైవములు కాదు అని అర్ధము అవుతూ ఉంది. మనము వాటిని పూజింపకూడదు, సాగిలపడకూడదు. సృష్టికర్త అయిన దేవుని ద్వారా మాత్రమే అవి ఉనికి కలిగి ఉన్నాయి కాబట్టి దేవుడినినే మనము ఆరాధించాలి, పూజించాలి. రాశిఫలములు అనే దానిని పరిశుద్ధ గ్రంథము పూర్తిగా ఖండిస్తుంది . సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఏవీ కూడా వాటంతట అవి ఏ విధమైన శక్తిని మహత్యమును కలిగిలేవు. కేవలము భూమిమీద వెలుగు ఇవ్వటము కొరకే అవి చేయబడినాయి తప్ప ఇంక ఏ విధమైన గుర్తింపు వాటికి లేదు. ఒకానొక దినమున ప్రభువు రాకడ సమయమందు అవి తమ వెలుగును కోల్పోవుటను బట్టి అవి దేవుని అధీనములో ఉన్నవి అని అర్థము అవుతుంది. యెహోషువ దేవునికి ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు నిలిచి ఉండటము, హిజ్కయా ప్రార్థన ఆలకించి దేవుడు యెషయా ద్వారా సూర్యుని నీడ పది మెట్లు వెనక్కి ఎక్కేలా చేయటము అందుకు ఉదాహరణలు. దేవుడు ఇచ్చిన ఘనత తప్ప మరి ఏ విధమైన మహిమ వాటికి లేవు. అందుకే వాటిని మనము దైవములుగా భావించకూడదు. దేవుడు వాటిని మనకొరకు ఉంచినందుకు వాటి నిమిత్తము ఆయనకు స్తుతి, కృతజ్ఞత చెల్లించడమే మనము చేయవలసిన పని.