దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను (1:14-19).

నక్షత్రములు తమలో ప్రకాశించేటటువంటి శక్తిని కలిగి ఉంటాయి. ఈ శక్తి వాటికి అపరిమితముగా ఉండదు. ఆ శక్తి కొంతకాలమునకు అయిపోయిన/హరించుకుపోయిన తరువాత అవి మరణించి నూతన నక్షత్రములకు జన్మ ఇస్తాయి. అదే విధముగా నీతిమంతులు కూడా తమలో దేవుని యొక్క జీవమును కలిగి ఉంటారు. మనము భూమిమీద ఎల్లకాలము నివసించుటకు వీలుపడదు. దేవుడు మనకు నిర్దేశించిన దినములు పూర్తికాగానే ఈ లోకము విడిచి మనము ప్రభువు సన్నిధికి వెళ్ళవలసి ఉన్నది. మనలో ఆయుష్షు అనేది ఉన్నంతవరకూ మనము ప్రకాశిస్తూనే ఉండాలి. మనము మరణించిన తరువాత మన జీవిత సాక్ష్యము అనేకులకు స్పూర్తిగా మారి వారు ప్రభువు కొరకు మంటకలిగి జీవించేలా ప్రేరేపించాలి. ఆలాగున మనము నూతన విశ్వాసులకు, నీతిమంతులకు మాదిరిగా మార్గదర్శకముగా ఉండాలి. దీనినిబట్టి జ్ఞాపకార్ధకూడిక అనేది వాడుకలోనికి వచ్చినది తప్ప అన్యజనులు చేసినట్లు దినములు/ఖర్మలకు మాదిరిగా అది ఇవ్వబడలేదు. క్రీస్తునందు నీతిమంతులుగా జీవించి మాదిరికరముగా ఈ లోకముమీద ఆయన వెలుగును ప్రసరింపచేసిన వారికి అది వర్తిస్తుంది తప్ప, క్రైస్తవుడుగా బ్రతికి మరణించిన ప్రతి ఒక్కరికి అది వర్తించదు. మరి నీ జీవితము ఎలాగు ఉన్నది? నీవు మరణించిన తరువాత నీ సాక్ష్యము హెబ్రీ 11లో చేర్చబడే విధముగా ఉన్నదా? లేక నిన్నుచూసి ఇతరులు ప్రభువునకు దూరముగా జరిగేలా ఉన్నదా?

ప్రభువైన యేసుక్రీస్తువారు లోకమునకు వెలుగై ఉన్నారు అని ఆ వెలుగు లోకములోనికి వచ్చుచు దరినీ వెలిగించుచున్నది అని మనకు యోహాను సువార్తలో వ్రాయబడి ఉన్నది. అలానే సూర్యుని వెలుగుకూడా లోకములో ఉన్న ప్రతిదానిని వెలిగిస్తూ వారి చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలుతుంది. తన దగ్గరకు వచ్చువారి విషయములో కూడా దేవుడు అదే విధముగా చేస్తారు. వారిని ఆవరించి ఉన్న చీకటిని పారద్రోలి పూర్తి వెలుగుతో వారి పరిస్థితులను నింపుతారు. మనము గదిలోనికి వెళ్లి న్నీ మూసివేసి కట్టడిచేస్తే తప్ప మనలను ఆ వెలుగు విడిచిపోదు. నీతిగా బ్రతకాలి అనుకునేవారు దేవుని దగ్గరకు వస్తారు, దుర్మార్గులు తమ క్రియలు బయటపడతాయి అనో లేక చీకటి క్రియలను విడిచిపెట్టటము ఇష్టములేకనో దేవుని దగ్గరకు రారు అని వాక్యము సెలవిస్తుంది. దేవుడు ఆయన దగ్గరకు వచ్చినవారి చుట్టూ ఆవరించి ఉన్న చీకటిని లోకమునకు వేడుకగా కనపరచి వారిని అవహేళన చేసినట్లు మనకు ఎక్కడా లేఖనములో కనిపించదు. ఆ చీకటిని దూరము చేసేవారి మార్గములలో తొట్రిల్లకుండా వారికి వెలుగును, వారి దేహములకు ఆరోగ్యమును కలుగజేయటము జరిగినది. దేవుని దగ్గరకు రావటానికి మనము సిగ్గుపడి భయపడవలసిన అవసరము లేదు. తడ్రిగా ఆయన సమస్తమును అర్థము చేసుకొని ఆదరణ కలిగిస్తాడు. నీ జీవితములో ఇంకా చీకటి నిండిన ప్రదేశములు ఉటే ఆయన దగ్గరకు, వెలుగునకు వెళ్లుము

మనము లోకములో దేవుని యొక్క ప్రతినిధులుగా ఆయన వెలుగును మాత్రమే ప్రతిబింబించే వారముగా ఉండాలి. ఆయన మనలను వెలిగించినపుడు, ఆయన ద్వారా మనము పొందుకున్న వెలుగు ఏదైతే ఉన్నదో, దానిని మనము ఇతరులకు చూపించాలి. ఇది కేవలము మాటలద్వారా కాకుండా మన క్రియల ద్వారా, సంభాషణ ద్వారా, జీవిత విధానము ద్వారా ఉండాలి. ఆ వెలుగునకు మన స్వనీతి అనేది ఎక్కడా జోడించకూడదు. మనము ఇతరుల దృష్టిలో గొప్పవారుగా ఉండటానికి అన్నట్లుగా ఆ వెలుగును ఉపయోగించరాదు. పగలు సూర్యుని వెలుగులో చంద్రుడు, నక్షత్రములు ఎలా అయితే మరుగై ఉంటాయో మనము కూడా అదే విధముగా ఆయన శిలువ చాటున మరుగై ఉండాలి. మనము చేస్తున్న క్రియలు మన దేవుని యొక్క లక్షణములను, ప్రేమను ప్రతిబింబించే విధముగా ఉండాలి. వాటి ద్వారా ప్రజలలు నిజమైన దేవుని దగ్గరకు రావడానికి ఆకర్షింపబడి, ఉత్సాహము చూపాలి. వాక్యములో మనకు ఉన్న మాదిరి అనుసరించి ఆ యొక్క క్రియలు ఉండాలి తప్ప, మన ప్రమాణము అనుసరించి ఉండకూడదు. మనకు ఎంత నష్టము కలిగినా కూడా వాటిని ప్రభువు కొరకు అవలంబించి ఆయన సహనమును దీర్ఘశాంతమును ప్రజలకు తెలియజేయాలి. మరి నీ జీవితము అందుకు తగిన విధముగా ఉన్నదా? లేక వెలుగు అని చెప్పి నీ స్వనీతి ప్రజల ముందు కనపరుస్తున్నావా?