దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను (1:14-19).

ఈ వచనముల గురించి మనము కొంచెము లోతుగా ఆలోచనచేస్తే మరొక సత్యము మనకు అర్థమవుతుంది. ఇది మనము ఏ సమయములో ఎక్కడ ఉన్నాకూడా మనకు కొండంత ధైర్యము ఇచ్చి మనలో ఉన్న భయాన్ని పారద్రోలుతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు మన భూమినుండి కొన్నిలక్షల, కోట్ల కిలోమీటర్ల దూరములో ఉన్నాయి. అయినా కానీ వాటి యొక్క వెలుగు ఎక్కడో వున్న మన భూమియొక్క remote place మారుమూల ప్రాంతములను సహితము తాకి మనకు దారి చూపిస్తున్నాయి. భూమిమీద మారుమూల ఎందుకూ ఎన్నికలేని కొరగాని ప్రదేశములకు తన చేతిపనుల ద్వారా వెలుగును పంపగలిగిన దేవుడు నీ జీవితములోనికి ఎంతటి వెలుగును పంపి నింపపగలరు అనేది ఆలోచించు. ఆ వెలుగే అంత మారుమూల ప్రదేశమును చేరగలిగినప్పుడు ఆయన కనుదృష్టి నీమీద ఖచ్చితముగా ప్రసరిస్తుంది. ఆ కన్ను నువ్వు ఎక్కడ ఉన్నాచూస్తూ ఉంటుంది. మనము చూడటానికి ఆయన వెలుగు కావాలి కానీ నువ్వు కటిక చీకటిలో ఉన్నా దేవుని కన్ను నిన్ను చూడగలదు. అందుకే గాడాంధకారపు లోయలో నేను సంచరించిన నేను దేనికీ భయపడను అని దావీదు చెప్పాడు. ఈ సత్యమును మనము కూడా గ్రహించగలిగితే మనకు భయము అనేది ఉండదు. ఆయన కనుదృష్టి నుంచి ఏది మనలను ఎత్తుకొని పోలేదు. సమీపించలేదు. దేవుని నమ్ముకుని ఇంకా భయపడుతూ ఉంటే అది ఆవిశ్వాసమే అవుతుంది. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు ఎదురు నిలబడగలిగనది ఏది? ఆలోచించు?

చంద్రుడు పౌర్ణ మి రోజున తన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నప్పుడు సముద్ర తరంగములు ఉవ్వెత్తున ఎగసిపడతాయి. ఆలాగున సంఘము తన సంపూర్ణతతో లోకములో ప్రకాశిస్తూ పనిచేస్తూ ఉన్నప్పుడు లోకమును తనవైపునకు ఆకర్షించగలుగుతుంది. సంఘము దేవుని యొక్క ప్రతిరూపము/ప్రతినిధి అని చెప్పుకొని, దేవుని యొక్క శక్తిని తనద్వారా, ఆయన ప్రేమను తన క్రియలద్వారా, వ్యక్తము చేయటములో విఫలము చెందినపుడు లోకము సంఘములోనికి వచ్చినా కూడా మనకు ప్రయోజనము ఏమీ లేదు. మనము ప్రస్తుతము ఆరాధిస్తున్న దైవములతో కలిగి ఉన్న పరిస్థితే సంఘమును ఆశ్రయించిన వారి విషయములో జరుగుతుంది అని భావించినపుడు వారు ఆసక్తి చూపించరు. అందుకే మన ప్రవర్తన, సంపూర్ణత అనేది లోకము యొక్క రక్షణ విషయములో vital role ప్రధానపాత్ర పోషిస్తుంది. అందుకే దేవుడు కేవలము రక్షణతో ఆగిపోకుండా మనలను తన సంపూర్ణత లోనికి, ఐక్యత లోనికి తన కుమారుని యొక్క స్వారూప్యము లోనికి రమ్మని ఆహ్వానిస్తూ తను చేయగలిగిన సహాయము మనకు అన్నివిధాలా అందిస్తున్నారు. దానిని అర్థము చేసుకొని దేవుని ప్రతి మాటవెనుక ఉన్న ఆయన ఉద్దేశ్యమును, దూరదృష్టిని గ్రహించి వాటివెనుక మనము నడవాలి. ఇప్పటివరకు జరిగిన ఆలస్యము చాలు. వృధా అయిన సంవత్సరములు చాలు. ఈ రోజు మన బాధ్యత నెరవేరుద్డాము. ఆయన వెలుగు మనమీద ఉదయించుటకు సిద్ధంగా ఉన్నది. నీదే ఆలస్యము. GOD is always ready.

దేవుడు ఇంత అద్భుతముగాను, ఆశ్చర్యముగాను చేసిన తన చేతిపని గురించి మాట్లాడుతూ ఒక విషయము మనము గుర్తుపెట్టుకోవలసినది చెప్పారు. ఆకాశము, భూమి గతించిపోయినా తన వాక్యమునుండి ఒక సున్న కాని, పొల్లుకాని తప్పిపోదు. ఆయన వాక్యమునకు ఉన్న బలము, విశ్వాస్యత ఏమిటి అనేది దీనినిబట్టి మనకు అర్థము అవుతుంది. ఈ విషయము గ్రహించి దానిని జీర్ణము చేసుకొనుట అనేది మన ఆత్మీయ జీవితమునకు చాలా ప్రాముఖ్యము/ప్రధానము. మనము ఎంతసేపు సూచనలు, అద్భుతములు, feelings, emotions మీద కాకుండా ఆయన వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా విశ్వసించాలి. ఆయన వాక్యము మన జీవితములో నెరవేర్చే విషయములో దేవుడు అవసరమైతే ఆకాశమును, భూమిని కదిలిస్తారు తప్ప, ఆయన నిన్ను మాత్రము ఎప్పుడూ అలక్ష్యము చేయరు. ఈ లోకములో దేవుని తరువాత నమ్మదగినది ఏదైనా ఉంది అంటే అది దేవుని వాక్యము మాత్రమే. ఇప్పుడు అయితే మనకు అది అందుబాటులో వ్రాతపూర్వకముగా లభిస్తుంది. కాని మన పితురుల సమయములో అది కనీసము అందుబాటులో లేదు. కాని వారి విశ్వాసము మన అందరి విశ్వాసముల కన్నా ఎన్నోరెట్లు మెరుగ్గా, ఉన్నతముగా, సవాలుగా ఉన్నాయి. ఐన్ని వసతులు వనరులు కలిగి ఉన్నా వారి విశ్వాసములో 10% అయినా చూపలేకపోతే అది ఎంతో సిగ్గుపడవలసిన విషయము. ఈరోజు నుంచి అయినా సూచనలు కాకుండా ఆయన వాక్యమును as it is గా నమ్ముదాము. నిజమైన విశ్వాసము కనపరచుదాము.