దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించువాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను (1:20-23).

ఈ విధముగా చేపలు నీటిలో లోతునకు ప్రయాణము చేస్తున్నప్పుడు అవి లోపలికి వెళ్లేకొద్దీ నీటినుంచి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కుంటూ ఉంటాయి. అలానే మనము కూడా వాక్యములో లోతునకు వెళ్లేకొద్దీ మన ప్రవర్తన, అలవాట్ల విషయములో ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. దేవుని వాక్యము కేవలము చదివి విజ్ఞానము సంపాదించేది కాదు కానీ దాని ప్రకారము జీవించవలసినదై ఉన్నది. ఎక్కువ శాతము మనము వాక్యానుసారము జీవించవలసిన పద్ధతులు, లోకము యొక్క పద్ధతులుకు వ్యతిరేకముగా ఉంటాయి. అందువలన అవి అనుదినము మన జీవితములో అవలంబించి, పాటించి చూపించటానికి అనేకమైన సవాళ్లను ఎదుర్కోనవలసి వస్తుంది. అయినా సరే వాటి అన్నింటికీ తట్టుకుని చేప నిలబడుతుంది. అక్కడ ఉన్న చేపను పట్టుకోవటానికి కూడా శత్రువు అంతే రీతిగా శ్రమించవలసి వస్తుంది. అందువలన ఇది మనము దేవుని వలన కలుగుతున్న ఇబ్బందిగా భావించకూడదు. మన రక్షణ కవచము అని అర్థము చేసుకోవాలి. లోకములో తయారుచేయబడిన ప్రతి కవచము బరువుగానే ఉంటుంది. దానియొక్క బరువుని బట్టే అది అందించే సురక్షిత స్థాయి పెరుగుతుంది. తన చుట్టూ ఉన్న ఒత్తిడిని తట్టుకుని నిలబడ బట్టే నోవహు అతని కుటుంబము మాత్రమే రక్షించబడినది అనే విషయము మర్చిపోవద్దు. మరి నీవు వాక్యము ద్వారా ఏదైనా సవాలు ఎదురైనప్పుడు పారిపోతున్నావా? లేక నిన్ను నీవు సరిదిద్దుకొని ఆయన రెక్కల క్రింద సురక్షితముగా ఉంటున్నావా? పారిపోతే శత్రువుకు దొరికిపోయేది నీవే అని విషయము మరిచిపోవద్దు.

ఈ విధమైన ఒత్తిడులను తట్టుకుని నిలబడటానికి చేపల శరీరములో చల్లని రక్తము ఉంటుంది. తన శరీరము చుట్టూ వున్న వాతావరణములోని మార్పులను బట్టి దాని శరీరము ఏ విధమైన మార్పునకు లోనుకాకుండా చేపకు సహాయము చేస్తుంది. మనము కూడా అలానే ఎదురవుతున్న సవాళ్లనుబట్టి మన జీవితములో ఏ విధమైన emotions కు గురికాకుండా ముందుకు సాగిపోవాలి. వాక్యములో లోతైన అనుభవములోనికి నడవాలి అని మన ఆలోచనకు, ప్రయత్నమునకు అవి ఆటంకములుగా మారకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా భయము అనిపిస్తే ఏ సమయములో అయినా సహాయము చేయటానికి తన రెక్కలమాటున నీకు ఆశ్రయము, ఆదరణ కలిగించడానికి ఆయన ఉన్నాడు అనే విషయము మరిచిపోవద్దు. మనము ఒత్తిడికి లొంగిపోయి ప్రయాణము అనేది ఆపివేస్తే ఇబ్బందులలో పడతాము. ప్రవాహ జలములు తనను చుట్టుముట్టినపుడు, తనకు కలిగిన ఆపదలలోను, యిరుకులోను దేవునికి దావీదు మొరపెట్టినప్పుడు, ఆయన వాటిని అన్నింటినుంచి తనను విడిపించారు అని లేఖనము తెలియజేస్తుంది. దావీదును రక్షించిన దేవుడు మనలనుకూడా తప్పక రక్షిస్తాడు. ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండుము. ముందుకు వెళ్ళటానికి భయపడి సంకోచించవద్దు. ఆయన ఎవరినీ చేయి విడిచిపెట్టటము కానీ రక్షించలేక విఫలము చెందినట్లు కానీ చరిత్రలో, పరిశుద్ధ గ్రంథములో ఎక్కడా ఆధారము లేదు. ఈరోజు నుంచే నీ adventure ప్రారంబించు.

చేపలు ప్రవాహ జలములకు ఎదురీదుతాయి. కేవలము చచ్చిన చేపలు మాత్రమే ప్రవాహము యొక్క ఒరవడిని అనుసరించి కొట్టుకుపోతాయి. వాటి తోకలకు ఉన్న నిర్మాణమును బట్టి అటువెళ్లాలా, ఇటువెళ్ళాలా అని తమ దిశను చుక్కాని వలే మార్చుకుంటాయి. మనము కూడా వాటిని అనుసరించి లోకమునుంచి శరీరమునుంచి మన ఆత్మకు వ్యతిరేకముగా పోరాడువాటిని మనము సమర్థవంతముగా ఎదుర్కోవాలి. మనము అపవాదిని ఎదిరించాలి అని వాక్యము చెప్తుంది తప్ప మనము తప్పించుకొని పారిపోవాలని చెప్పటము లేదు. మనము సరిగా దిశానిర్దేశము చేసుకోవడానికి అవసరమైన ప్రతి సంగతి మనకు లేఖనములో అందుబాటులో ఉన్నది. అవి మన ఆత్మకు లంగరువలె కూడా పనిచేస్తాయి. మనలో జీవము ఉన్నంతవరకు మనము పోరాడుతూనే ఉండాలి. అందుకే భూమిమీద నరులకాలము యుద్దకాలము అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. మనకు కలుగుతున్న ప్రతి పోరాటమును ఆయనదిగా భావించి మనలను ప్రతిసారీ విజయముతో ఊరేగిస్తున్న దేవునికి కృతజ్ఞతా స్తుతులు. నేను ఒంటరి కదా ఎలా పోరాడగలను అని భయపడవద్దు. మనలో ఒకడు వెయ్యిమందిని ఇద్దరు పదివేలమందిని తరమగలము అని లేఖనము సెలవిస్తుంది. మన పితరులు కూడా ఒంటరిగానే దేవునితో జతకలిసి పోరాడి ప్రపంచమును జయించారు. నీవు కూడా ఆటుపోటులను సమర్థవంతముగా ఎదుర్కొ? ప్రవాహములో పడి కొట్టుకుపోకు.