మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను (1:6-8).

మనుష్యుడు ఈ లోకములో తాను కనిపెట్టిన వాటి గురించి ఎప్పుడు అతిశయము చెందుతూ ఉంటాడు. తాను కనిపెట్టిన గొప్ప, గొప్ప వస్తువులను బట్టి తాను చాలాఎదిగిపోయాను అనే అభిప్రాయములో ఉంటాడు. మనము ఆకాశము, దాని పరిధి దాటి ప్రయాణము చేయగలిగిన వాటిని కనిపెట్టాము. అవి భూమిమీద భారీ పరిమాణము కలిగి గొప్పవిగా కంటికి కనబడవచ్చు గానీ, ఆకాశమునకు చేరేసరికి అవి చాలా చిన్నవిగాను, చిన్నపిల్లలు ఆడుకునే ఆటవస్తువులుగా కనిపిస్తాయి. దీనినిబట్టి మనము చూసినప్పుడు దేవుని ముందు మనము ఎన్నిచేసినా అవి చిన్నగానే ఉంటాయి అని గమనించాలి. దేవుడు మనలను హెచ్చిస్తే తప్ప పరలోకము స్థాయికి తగినట్లుగా మనము చేయలేము. ఆయన ముందు మనవి అన్నీకూడా పిల్లచేష్టలే. ఒకవేళ మనము అక్కడికి చేరగలిగే సామర్ధ్యము ఉంటే ఆయన క్రిందకు దిగివచ్చి మార్గము ఏర్పాటుచేసి చూపించవలసిన అవసరము ఉండేది కాదు. దేవునికి గొప్పవిగా కనిపించేవి ఏవి అని మనము లేఖనములు జాగ్రత్తగా పరిశీలన చేస్తే అవి మనలోక జ్ఞానమునకు విరుద్ధముగా ఉంటాయి అని ఇట్టే అర్థము అవుతుంది. అందుకే దేవుడే ఆ విశాలము కలుగజేసి మనలను వేరుపరచవలసి వచ్చినది. మన క్రియలు ఆయన ఆశించిన స్థాయికి, పరలోకము range కి తగినవి కాదు. అందుకే నేను హెచ్చించేవరకు దీనమనస్సు కలిగి ఉండమని ఆయన సెలవిచ్చారు.

పైన ఆకాశములో దేవుడు చేసిన సృష్టిని గురించి తెలుసుకోవటానికి మానవుడు అహర్నిశలు శ్రమిస్తూ ఎంతో ధనము వ్యయము చేస్తూనే ఉన్నారు. ఎవరైనా శాస్త్రవేత్త ఏదైనా విషయము కనిపెట్టినప్పుడు అతని ఇంటర్వ్యూ చేసి దానిని గురించిన విషయము కూలంకషముగా తెలుసుకునేలా చేస్తాము. ఆయనను టీచరుగాను, mentor గాను పెట్టుకుని మరికొంతమంది విద్యార్థులు నేర్చుకుంటారు. తాను కనిపెట్టిన విషయమును పుస్తకముల క్రింద ముద్రించి అందరికీ అందుబాటులోనికి తేవటము జరుగుతుంది. కానీ దేవుని విషయములో మాత్రము అందరూ అందుకు విరుద్ధముగా ప్రవర్తిస్తారు. తయారుచేసిన ఆయనను గురువుగా గుర్తించరు. వాటికి సంబంధించిన వివరములు అడుగరు. ఆయన వ్రాయించిన పరిశుద్ధ గ్రంథమును చదవరు. ఆయన చెప్పను అని ఎప్పుడూ అనలేదు. చివరకు కొండను త్రవ్వి ఎలుకను పట్టినరీతిగా ఆయన వ్రాయించిన విషయములనే కనిపెట్టాము అంటారు. దానికన్నా ఆయన దగ్గర కూర్చుని ప్రభువా నీవు 2వ దినమున ఆకాశమును ఎలాచేశావు అంటే ఆయన చెప్పరా?? దానివలన ఎంత సమయము, ధనము ఆదా అవుతుంది. పైనున్న వారిని గౌరవించే సాంప్రదాయము కలిగిన లోకములో పైనున్న దేవుని మనము గౌరవించాలి. ఆయన జ్ఞానమును ఆయన ద్వారా మాత్రమే తెలుసుకొనగలము. మన finite minds కి అది అర్థము అవ్వదు.

ఆకాశములో ఆయన ఏర్పాటు చేసిన రక్షణ కవచము ద్వారా మనము విశ్వములోని కొన్ని ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా మనుగడ సాగించ గలుగుతున్నాము. ozone, electro magnetic fields ద్వారా ఇది సాధ్యము ఆవుతుంది. మానవుడు ఇతర గ్రహముల మీద జీవనము కొనసాగించటానికి చేస్తున్న ప్రయత్నములు వాటిని నివాసయోగ్యముగా మలచటానికి పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. దీనినిబట్టి మనకు సమస్తము అనుకూలముగా మలచబడి ఇవ్వబడిన భూమి యొక్క, ఆకాశము యొక్క విలువ మనకు అర్థము అవుతుంది. అయినా కానీ మనకు ఇది అంతా దానంతట అదే కలిగితే మనము కూడా దీనిని వేరేచోట చేయగలగాలి కదా. కానీ ఆలాగున సాధ్యము కావటము లేదు అంటే దీనిని ఎవరో మనకు ఈ విధముగా మలచి, అమర్చి ఇచ్చారు అని మనము ఒప్పుకోక, వృథా ప్రయాస కొనసాగించటము అనేది నిజముగా బుద్ధిహీనత, గర్వము అవుతుంది. దేవుడు ఆకాశమును చేసినప్పుడు మనకు అవసరము అయిన రక్షణ కల్పించటము జరిగినది. మిగతా గ్రహములకు ఈ విధమైన రక్షణ ఏర్పాటులు లేకపోవటము కూడా మనము గమనించాలి. మిగతాచోట జనము ఉంటే మనము ఇంత విసిగించినా మనతో ఎందుకు ఉండటము. వారి దగ్గరకు వెళ్ళవచ్చు కద. మనము మాత్రమే ఆయన పిల్లలము. అంతా మనకోసమే.