దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను (1:9-10).

దేవుడు మూడవ దినమున రెండు కార్యములు చేయుటము జరిగినది. అందులో మొదటి కార్యము గురించి 9, 10 వచనములు మనకు వివరిస్తాయి. రెండవ దినమున ఆకాశములోని జలముల విషయమై పనిచేసిన దేవుడు, మూడవ దినమున ఆకాశము క్రింద ఉన్నటువంటి జలములతో పనిచేస్తున్నారు. మనము ఆయన కోసము బ్రతకటానికి, ఆయన కోసము ప్రతిష్టించుకోవటానికి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో పనిచేస్తున్నప్పుడు మనము ప్రతిస్పందించి నిర్ణయము అనేది తీసుకున్నప్పుడు ఏమి జరుగుతుంది అనే విషయము గురించి ఇక్కడ మనకు వ్రాయబడినది. ముందుగా దేవుడు జలములు అన్నీ ఒకచోటకి చేర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలికారు. దీనిని బట్టి మన జీవితములో నూతన సృష్టిగా మనలను మలచే ప్రయత్నములో ఆయన చేసే మొట్టమొదటి క్రియ లోకము యొక్క ఆచారములు, పద్ధతులు, నమ్మకములు, పోకడలు అన్నీ ఒక మూలకు చేరేలా చేయటము. లోకము మనలో ఉన్నంతవరకు మనము దేవుని సంపూర్ణత రుచి చూడలేము అనే విషయము ఇప్పటికే మనకు అర్థము అయింది.

దేవుడు పాతవి అన్నీ గతించిపోవాలి, సమస్తము నూతన పరచబడాలి అని చెప్పిన రీతిగా నిజమైన మారుమనస్సు అనుభవములోనికి దేవుడు మనలను నడిపిస్తున్నారు. మనము తిరిగి జన్మించాలి అని ఆయన చెప్పినప్పుడు, ఇప్పుడు ప్రస్తుతము ఉన్న పరిస్థితులకు మరణించాలి అనే అర్థము కూడా వస్తుంది. ఇదే మాట పౌలు తన పత్రికలో బాప్తిస్మము గురించి వివరించినప్పుడు చెప్పటము జరిగినది. పాతవి మనలో మచ్చుకైనా కనిపించకూడదు అని దేవుడు ఆరిన నేల అని స్పష్టముగా పలకటము జరిగినది. కాబట్టి అంతకు ముందు మనకు లోకము ద్వారా నేర్చుకుని ఉన్నవి అన్నీ కూడా సమూలముగా వేరుతో సహా మన హృదయమునుండి వేరుపరచబడాలి. ఆరిన నేలలో తడిగాని తేమగాని ఏ మాత్రము ఉండవు అనే విషయము మనకందరికీ విధితమే. ఈ ప్రక్రియలో భాగముగా మనకు కొన్ని ఇబ్బందులు, తిరస్కారాలు, అవమానములు ఎదురవుతాయి. జనులు మనలను పిచ్చివారుగా భావించి అవహేళన చేయవచ్చు. ఎందుకంటే సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది. అయితే దేవుని కోసము మనము వీటన్నింటిని సహించి ముందుకు నడవాలి. అప్పుడు మాత్రమే నిజమైన మనిషి హృదయము ఎలా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడో అలాగున మారగలుగుతాము. ఇక్కడ మనము లోకమా, దేవుడా అనే సంక్లిష్టమైన నిర్ణయము తప్పనిసరిగా తీసుకోవలసి వస్తుంది.

ఈ నేల అనేది మూడవ దినమున నూతనముగా సృష్టించబడలేదు. భూమిని దేవుడు గ్రహముగా తయారుచేసినపుడే అది ఉన్నది. అయితే అది నీటిద్వారా కప్పబడి ఉండుటచేత అప్పటివరకు కన్నులకు కనిపించలేదు. అలానే దేవుడు మనలను పుట్టించినప్పుడు స్వచ్ఛమైన శుద్ధహృదయము మనకు కలుగచేస్తారు. అందుకే చిన్నపిల్లలను ప్రభువైన యేసుక్రీస్తువారు పరలోక వారసులకు ఉదాహరణ క్రింద చూపించటము జరిగినది. అప్పుడు మన హృదయములలో ఎలాంటి కల్మషం కూడా లేదు. కానీ లోకములో ఎదిగేకొలదీ మన హృదయము దేవునినుండి తొలగిపోయి స్వార్ధముచేత, పాపముచేత కలుషితము అయ్యింది. లోకము దానిని ఆక్రమించుకుని అది దేవునికి ఉపయోగము లేకుండా చేసింది. నీటిక్రింద ఉన్న భూమి నరులకు ఎలాగైతే నిరుపయోగమో. లోకముతో నిండి ఉన్నంతవరకు మనిషి యొక్క హృదయము కూడా దేవునికి అలానే నిరుపయోగముగా ఉంటుంది. మన అందరి విషయములోను ఈ విధముగా జరగటము నిజముగా దురదృష్టము. అయితే దేవుడు నిరుపయోగమైన దానిని విడిచిపెట్టకుండా దానిని మరల ఉపయోగములోనికి తేవటానికి, సాగుచేయటానికి ప్రయత్నము ప్రారంభించారు. ఆ దేవుని కృపకు, జాలి, దయ, కరుణకు నిండు కృతజ్ఞతలు. ఇది మన జీవితములో దేవునినుండి పొందుకొన్న మరొక గొప్ప ఆశీర్వాదము. లోకముతో నిండిన నిరుపయోగమైన జీవితమునుండి దేవునికి ఉపయోగపడే పాత్రగా ఆయన చేతిలో రాజకీయ మకుటముగా మారదాము.