| ఆదికాండము 15:1 | ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. |
| ఆదికాండము 43:23 | అందుకతడు మీకు క్షేమమగును గాక భయపడకుడి; మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. |
| నిర్గమకాండము 14:13, 14 | అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను. |
| సంఖ్యాకాండము 14:9 | మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదనుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడైయున్నాడు, వారికి భయపడకుడనిరి. |
| యెహోషువ 1:9 | నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. |
| 1దినవృత్తాంతములు 28:20 | మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా నీవు బలముపొంది ధైర్యము తెచ్చుకొని యీ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతోకూడ నుండును; యెహోవా మందిరపు సేవను గూర్చిన పనియంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంతమాత్రమును విడువక యుండును. |
| కీర్తనలు 23:4 | గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును. |
| కీర్తనలు 27:1, 2 | యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీరమాంసము తినుటకై దుష్టులు నామీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నామీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లికూలిరి |
| కీర్తనలు 34:4 | నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. |
| కీర్తనలు 46:1, 2 | దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను |
| యెషయా 35:4 | తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. |
| యెషయా 41:10 | నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. |
| యెషయా 43:1-3 | అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి యున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను. |
| యెషయా 44:8 | మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలమునుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేదియు లేదు, ఉన్నట్టు నేనెరుగను. |
| యెషయా 54:17 | నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవా యొక్క సేవకుల నీతి నావలన కలుగుచున్నది; ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. |
| హగ్గయి 2:5 | మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసికొనుడి; నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. |
| మత్తయి 6:34 | రేపటిని గూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును; ఏనాటి కీడు ఆనాటికి చాలును. |
| లూకా 10:19 | ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి యున్నాను; ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. |
| యోహాను 6:20 | అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను. |
| యోహాను 14:27 | శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుట లేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. |
| రోమీయులకు 8:15 | ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము. |
| 2 తిమోతి 1:7 | దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనము గల ఆత్మ నియ్యలేదు. |
| హెబ్రీయులకు 2:14, 15 | కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను. |
| హెబ్రీయులకు 13:5, 6 | ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము. |
| 1 యోహాను 4:4 | చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు. |