దేవుడు తన స్వహస్తములతో పురుషుని, స్త్రీని నిర్మించటము ఈ అధ్యాయములోని ప్రాముఖ్యమైన విషయము. దేవుడు ఏదేను తోటను వేసి దాని తడుపుటకు 4 నదులను ఏర్పాటు చేసారు. ఆ తోటలో సకలజాతి ఫలవృక్షములను, జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును దేవుడు నేలనుండి మొలిపించటము జరిగినది. దేవుడు నరుని ఈ తోటలో ఉంచి దాని సేద్యము చేయుటకు, కాపు కాయుటకు భాద్యతలు అప్పగించారు. దేవుడు నరునికి ఇచ్చిన మొదటి ఆజ్ఞ, నరునితో చేసిన మొదటి నిబంధన ఈ అధ్యాయమునందు కలవు. అవి ఏమిటి అంటే నరుడు ఆ తోటలోని ఏ వృక్షఫలము అయినా నిరభ్యంతరముగా తినవచ్చును కాని మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలవృక్షమును మాత్రము తినకూడదు. దేవుడే మనిషి యొక్క అవసరతను గమనించి, తాను ఒంటరిగా ఉండటము మంచిదికాదని తలంచి తనకొరకు సహకారిని చేయటము దేవుని యొక్క శ్రద్ధకు, సంరక్షణకు నిదర్శనము. దేవుడు స్త్రీ, పురుషుల మద్య వివాహము ద్వారా కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయటము కూడా ఈ అధ్యాయములో ప్రాముఖ్యమైన విషయములలో ఒకటి. వారిద్దరూ కలిసి సృష్టిపై కాపలాదారులుగా ఉండాలి. ప్రపంచాన్ని సంరక్షించే ఆ బాధ్యత మనతో సహా వారి వారసులకు అందించబడింది.