అధ్యాయము యొక్క సారాంశము
దేవుడు నోవహును అతనితో పాటు ఓడలో ఉన్న జీవరాసులను జ్ఞాపకము చేసికొని భూమిమీద మరలా నివాసయోగ్యమైన పరిస్థితులు కలుగులాగున, నీరు భూమిమీద నుండి ఇంకిపోయేలా వాయువు విసరునట్లు చేసారు. ఓడ ప్రయాణము చేయుచు వచ్చి అరారాతు పర్వతముల మీద నిలిచినది. నీరు క్రమ క్రమముగా భూమిమీద నుండి తగ్గుతూ వచ్చినది. కొన్ని దినములైన తరువాత నోవహు భూమిమీద నీరు పూర్తిగా తగ్గినదో లేదో చూచుటకు కాకిని బయటికి పోవిడిచెను. కానీ అది అతని దగ్గరకు తిరిగిరాలేదు. కొద్దిదినములైన తరువాత నోవహు ఒక పావురమును వెలుపలికి పంపగా అది అతని దగ్గరకు తృంచబడిన ఒలీవ ఆకు ఒకటి తీసికొనివచ్చినది. దానితో నోవహునకు భూమిమీద నుండి నీరు తగ్గిపోయేనని అర్దము అయినది. అయినా అతను దేవుడు పిలిచేంతవరకు కూడా ఓడలో నుండి బయటికి రాలేదు. చివరకు భూమిమీద నివాసయోగ్యమైన పరిస్థితులు నెలకొన్నపుడు, దేవుడు ఒకరోజు తనను బయటికి రమ్మని పిలవటముతో తన కుటుంబము, తనతోపాటుగా ఉన్న జంతువులతో సహా నోవహు ఓడ నుండి బయటికి రావటము జరిగినది. నోవహు దేవునికి బలిపీటము కట్టి పవిత్ర జంతువులలోను, పక్షులలోను కొన్నితీసికొని బలిగా అర్పించాడు. దేవుడు ఆ ఇంపైన సువాసన ఆఘ్రాణించి ఇక ఎన్నడూ భూమిని నీటి ద్వారా నాశనము చేయను అని, భూమిమీద సకల కాలములు వాటి వాటి క్రమములో సక్రమముగా సాగునని అనుకొనెను.