అధ్యాయము యొక్క సారాంశము
ఈ అధ్యాయమునందు బాబేలు గోపుర నిర్మాణము, వివిధ భాషల యొక్క ఉద్భవము గురించి వివరించబడినది. ప్రజలందరూ తూర్పుగా ప్రయాణమై వెల్లుచూ ఒక పెద్ద మైదానప్రాంతము చూచి వారి కొరకు ఆకాశమునంటు ఒక గోపురము కట్టుట ప్రారంభించిరి. దేవుని ఆజ్ఞ అయిన భూమిని నింపుడి అనే దానికి వ్యతిరేకముగా ఒకేచోట నివసించుటకు, వారికివారే గొప్ప పేరు సంపాదించుకొనుటకు ఈ గోపుర నిర్మాణము చేపట్టటము జరిగినది. నిమ్రోదు యొక్క నాయకత్వములో వారు అందరూ కూడి ఈ పని మొదలుపెట్టిరి. వారిని భూమియందంతట చెదరగొట్టుటకు దేవుడు దిగివచ్చి వారిలో ఒక బాష ఒకరికి అర్ధము కాకుండా చేయటము జరిగినది. దానితో వారు ఆ పని ఆపివేసి వేరు వేరు ప్రదేశములకు చెదరిపోయినారు. తరువాత భాగములో షేము నుంచి అబ్రహాము వరకు ఉన్న తరముల గురించి వివరించటము జరిగినది. అబ్రహాము యొక్క సహోదరులు, కుటుంబ వివరములు ఇవ్వబడినాయి. దేవుడి యొక్క పిలుపును అందుకుని అబ్రహాము తన తండ్రిని, భార్యను, సహోదరుని కుమారుడైన లోతును వెంటబెట్టుకుని ఉర్ నుండి హారానుకు ప్రయాణము చేయటము అక్కడ అబ్రహాము తండ్రియైన తెరహు మృతి చెందటముతో ఈ అధ్యాయము ముగుస్తుంది. దేవుడు ఉర్ లో ఉన్నపుడు అబ్రహాముతో మాట్లాడిన విషయము ఈ అధ్యాయములో ప్రస్తావించలేదు కాని, దీని గురించి 12వ అధ్యాయములోను, అపోస్తలుల కార్యముల గ్రంధము 7వ అధ్యాయములో చూడగలము.