దేవుని కనుదృష్టి నిన్ను చూస్తూ ఉంది
చిన్న గ్రహములు పెద్ద గ్రహముల చుట్టూ తిరగడం అనేది ఈ సృష్టిలో మనము గమనించగలము. అలానే మనకు అన్నింటిలోనూ పెద్ద అయిన మన దేవుని చుట్టూ మనము తిరగాలి. ఆయన చేతి నీడలోనే మనకు పరిపూర్ణ సంరక్షణ కలదు.
సూర్యుడు, చంద్రుని కాంతి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణంచేసి మన ఇంటిలోనికి ప్రసరిస్తుంది. భూమి యొక్క ఆకారములుతో పోల్చుకుంటే మనం నివసించే ప్రదేశం దుమ్ముకణము కన్నా చిన్నది. లెక్కలోనికి రానిది. అలాంటి చోటుకు సహితము ఆయన చేత సృష్టింపబడిన వస్తువులు తమ కాంతిని ప్రసరింప జేయగలిగినప్పుడు, ఆయన కనుదృష్టి మనలను మరింత తేటగా దర్శిస్తుంది. కనుక మనము ఏ విషయములోనూ భయపడి అధైర్యపడవలసిన పనిలేదు
దేవుని యొక్క కనుదృష్టిని మరుగుచేసి ఈ విశ్వంలో మనకు హాని చేయగలిగినది ఒకటి కూడా లేదు.
ఈ విశ్వములో దేవుని యొక్క హస్తము చేరలేని ప్రదేశము లేదు. కాబట్టి నువ్వు ఆయనకు ఎంత దూరముగా జరిగినా, ఎంత లోతులో కూరుకుపోయినా, నువ్వు ఉన్నచోటికి ఆయన హస్తం వచ్చి నిన్ను రక్షించగలదు, పైకి లాగగలదు