1. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను.
  2. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును;
  3. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములనుగూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను.
  4. అందుకు సర్పము మీరు చావనే చావరు;
  5. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచిచెడ్డలను ఎరిగినవారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా
  6. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;
  7. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.
  8. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్లమధ్యను దాగుకొనగా
  9. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను.
  10. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను.
  11. అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను.
  12. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిననెను.
  13. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను.
  14. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్ను తిందువు
  15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను.
  16. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.
  17. ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;
  18. అది ముండ్లతుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు;
  19. నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.
  20. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి.
  21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను.
  22. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచిచెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని
  23. దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను.
  24. అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.