Skip to content
Genesis Chapter 04 Text Adult
- ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను.
- తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు.
- కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.
- హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టెను;
- కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా
- యెహోవా కయీనుతో నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి?
- నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీయెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.
- కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీదపడి అతనిని చంపెను.
- యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీనునడుగగా అతడు నేనెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను.
- అప్పుడాయన నీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది.
- కావున నీ తమ్ముని రక్తమును నీచేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింపబడినవాడవు;
- నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను.
- అందుకు కయీను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది.
- నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినైయుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను.
- అందుకు యెహోవా అతనితో కాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతిదండన యేడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను
- అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరివెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను.
- కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను.
- హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను.
- లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను; వారిలో ఒకదాని పేరు ఆదా రెండవదాని పేరు సిల్లా.
- ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు.
- అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికందరికిని మూలపురుషుడు.
- మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా.
- లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినుడి లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని
- ఏడంతలు ప్రతిదండన కయీను కోసము, వచ్చినయెడల లెమెకు కోసము డెబ్బది యేడంతలు వచ్చుననెను.
- ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను.
- మరియు షేతునకుకూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.
admin2022-01-10T14:18:15+05:30
Share This Story, Choose Your Platform!
Page load link