నిర్గమకాండము ఆదికాండము యొక్క చరిత్రను కొనసాగిస్తుంది. ఐగుప్తులోనికి వచ్చిన ఒక చిన్న కుటుంబము అయినటువంటి 70 మంది లక్షల కొద్దీ ప్రజలైన ఒక దేశంగా ఎలా ఎదిగారు అని తెలియచేసేదే నిర్గమకాండము.  430 సంవత్సరములు  హెబ్రీయులు ఐగుప్తులో నివాసము చేశారు.  ఇందులో చాలా సమయము  వారు బానిసత్వములోనే గడిపారు.

నిర్గమకాండము  ఈ క్రింది విషయములను తెలియజేస్తుంది

?మోషే యొక్క అభివృద్ధి గురించి

?బానిసత్వము నుంచి  ఇశ్రాయేలీయుల  యొక్క విడుదల

?దేవుని యొక్క ధర్మశాస్త్రము పొందుటకు ఐగుప్తు నుంచి  సీనాయి కొండకు వారు చేసిన ప్రయాణము

?ప్రత్యక్ష గుడారము  నిర్మించుటకు దేవుడు ఇచ్చిన సూచనలు

దేవుని నివాసస్థలముగా  ప్రత్యక్ష గుడారము నిర్మించడముతో నిర్గమకాండము ముగుస్తుంది.   బానిసత్వము నుంచి వారి యొక్క విడుదల వెనువెంటనే జరిగిపోలేదు.  అది ఒక ప్రణాళికాబద్ధమైన ప్రక్రియ ద్వారా జరిగినది.   ఫరో యొక్క గుప్పిట నుండి  హెబ్రీయులను విడిపించడానికి పది తెగుళ్ళు మరియు కొంత నిర్దిష్టమైనటువంటి సమయము పట్టినది.

ఈ  తెగుళ్ళు రెండు ప్రాముఖ్యమైన అంశములను నెరవేర్చాయి

?ఐగుప్తు దేవుళ్ళ కన్నా కూడా  హెబ్రీయుల దేవుడు  ఆధిపత్యము కలిగినవాడు అని

?హెబ్రీయులకు స్వాతంత్ర్యము తెచ్చిపెట్టాయి

దేవుని యొక్క హస్తము తనకు ఇష్టమైన ప్రజల మీద ఉన్నది.  వారు ఆయన సన్నిధిని, ఆయన పనిచేయు మార్గములను, వారి తరపున ఆయన చేసిన క్రియలను ఎరిగి ఉన్నారు కాబట్టి ఆయన ఆశీర్వాదము ఎల్లప్పుడూ పొందుటకు ఆయన మార్గమునకు తగినట్లుగా వారి జీవితములను  మలచుకోవలెను.

ఒక ప్రత్యేకమైన నిబంధన జనముగా ఉంచు ఉద్దేశ్యముతో  దేవుడు వారికి విడుదల కలిగించడము జరిగినది.  ఈ యొక్క నిబంధన పరిధికి బయట జీవించి ఉన్నట్లయితే ఫలితములు ఎలా ఉంటాయి అనేది బంగారు  దూడను చేసిన సందర్భంలో దృష్టాంత పరచబడినది.

హృదయములో ఎంతో బాధ కలిగి విశ్రాంతి కొరకు ఎదురుచూస్తున్నటువంటి  ప్రజలతో నిర్గమకాండము మొదలవుతుంది.  ఐగుప్తు యజమానుల యొక్క కొరడాల క్రింద దుర్భరమైన బాధాకరమైన జీవితమును అనుభవించారు.  అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వారసులైన ఈ ప్రజలు  తమ యొక్క దుర్గతినుంచి ఉపశమనం కోరుకుంటున్నను,  వారు దేవుని చేత  మరువబడిన ప్రజలుగా మనకు కనిపిస్తారు. వారి యొక్క పరిస్థితి ఇంక  తాళలేనటువంటి స్థితికి వచ్చినప్పుడు  తన ప్రజలను విడిపించుటకు దేవుడు మోషేను పంపించాడు.  ఆ విధులను గురించినటువంటి  కధే  ఈ నిర్గమకాండము.  దేవుని యొక్క ప్రజలు ఎన్నడూ  ఊహించనటువంటి విధముగా  ఇది జరిగినది.  ఎంతో బాధతో మొదలైనది దేవుని యొక్క ప్రేమ ద్వారా  అంతమైనది.

నిర్గమకాండము చివరలో దేవుని సంతృప్తిపరిచే విధంగా ప్రజలు ఆరాధించటంతో దేవుని యొక్క మహిమ ప్రత్యక్షగుడారము మీదకు దిగివచ్చి దానిని నింపినది.  సీనాయి కొండ దగ్గర ప్రజలు ఈ విధముగా ఐగుప్తు దాస్యము, పేదరికము నుండి దేవుని యొక్క సన్నిధికి  చేరియున్నారు.  దీని ద్వారా స్పష్టముగా దేవుడు తన ప్రజలను ఎంత  ప్రేమిస్తున్నారు అనేది తెలుస్తుంది.

ఒక సమాజముగా దేవుని ఆరాధించుట అనేది నిర్గమకాండముతోనే మొదలవుతుంది.  ఆదికాండములో వ్యక్తిగతముగానే ప్రజలు దేవుని ఆరాధించారు.  కృతజ్ఞతలు తెలియజేశారు.  నోవహు,  అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు యొక్క  బలి అర్పణలో దీనిని మనము చూడవచ్చు.   నిర్గమకాండములో  పితరులకు చేయబడిన వాగ్దానములు నెరవేర్చబడినాయి.  అంతేకాక దేవుని  గురించినటువంటి అవగాహన విషయములో  నిర్గమకాండము ఒక నూతన  అధ్యాయమునకు తెర తీస్తుంది ఆయన ప్రజలకు, ఆయన శత్రువులకు, ఆయన గొప్పతనము తెలియజేయబడినది. మనుషుల ద్వారా చేయబడిన దేవతలు, దేవుళ్ళు, సైన్యములు ఆయన అధికారమునకు లోబడినాయి

దేవుడు వాగ్దానములను, షరతులతో కూడిన తన నిబంధనను ఇశ్రాయేలీయులకు అందజేశారు. చాలా సందర్భములలో కష్టముతో కూడిన విధముగా దేవుని ఆరాధించటమే నిబంధనకు సరియైనటువంటి స్పందనని ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు.

మోషేను, ఇశ్రాయేలు దేశమును దేవుడు ఎలాగైతే నడిపించాడో అలానే మనలను కూడా నడిపించాలని కోరుకుంటున్నాడు.  ఒకవేళ మోషేలాగా ఒక ప్రత్యేకమైన పనికొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటే కనుక  దేవుడు నీతో పాటుగా ఉంటాడు.  ఆయనకు లోబడి  వెంబడించు.  ఒకవేళ శత్రువు నుంచి శోధన నుంచి నీకు విడుదలనిస్తూ ఉన్నట్లయితే ఆయన యందు విశ్వాసముంచి ఆయన చెప్పినట్లుగా చేయుము.  ఆయన చెప్పిన నీతి సూత్రాలను స్పష్టముగా విని, చదివి, ధ్యానించి, పాటించండి.  నీ జీవితములోను, కుటుంబములోను, సమాజములోను  ఆయనను నిజముగా  ఆరాధించుము.  నిర్గమకాండము దేవుని యొక్క నడిపింపు గురించిన అద్భుతమైన కథయై యున్నది.  ఆయన నిన్ను నడిపించు చోటకు వెంబడించుటకు నిశ్చయించుకొని దీనిని చదువుము.