- దేవుడే మన ఉనికికి, సృష్టికి కారణభూతుడుగా గుర్తించి ఆయనను మాత్రమే ఆరాధించాలి, పూజించాలి
- సృష్టిలో ఉన్న ప్రాణులను, పరిస్థితులను మనము గమనించినప్పుడు దేవునియొక్క జ్ఞానము, శక్తి, తెలివి ఎలాంటివి అనేది మనకు అర్థము అవుతుంది కాబట్టి సమస్త జ్ఞానముకొరకు ఆయనమీదనే ఆధారపడాలి
- దేవుడు చేసిన సృష్టి పరిమాణముతో పోల్చుకుంటే మనం ఎదుర్కొనే సమస్యలు ఎంతో చిన్నవి అని గ్రహించి ఆయన వాటిని తీర్చగల సమర్థత కలిగినవాడు అని విశ్వాసము ఉంచాలి
- ఆయన పోలిక, స్వరూపము మనకు ఇవ్వటము గమనించి ఆయన మనలను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థము చేసుకోవాలి
- సమస్త జీవరాశులను ఏలమని చెప్పినందున వాటి సంరక్షణ బాధ్యతకూడా మనదే అని గుర్తించి, వాటిని మనము కాపాడి రక్షించాలి. వాటి నాశనమునకు మనము కారకులము కాకూడదు. వాటి అభివృద్ధి బాధ్యతకూడా మనదే
- స్త్రీ కూడా దేవుని పోలికలో చేయబడినది కాబట్టి ఆమెను కూడా సమాన భాగస్వామిగా గుర్తించాలి. వారిని తక్కువస్థాయి వారుగా చిన్నచూపు చూడకూడదు
- దేవుడు సహకారిగా, భాగస్వామిగా పురుషునికి స్త్రీని, స్త్రీకి పురుషుడిని ఇచ్చారు అని గ్రహించి స్వలింగ వివాహాలు నిషేదించాలి. అది దేవుని సృష్టికి విరుద్ధమైనది.
- మనిషి దేవునిచేత పరిపాలించబడాలి, కానీ మరొక మనిషిచేత కాదు అని గుర్తించి అందరము సహోదర ప్రేమ కలిగి జీవించాలి.
- సృష్టించబడినది సృష్టికర్త కన్నా ఎప్పుడూ గొప్పకాదు అని గుర్తించి, మన సృష్టికర్త అయిన దేవుని మాత్రమే ఆరాధించాలి సృష్టమును పూజింపకూడదు
- దేవుడు మనకు అవసరమైనవి ముందుచేసి తరువాత మనలను సృజించుటను బట్టి ఆయన మనకు దయచేసిన ఆహారమును బట్టి, ఆయన మన యెడల ఎంతో శ్రద్ధకలిగి ఉన్నారు అనేది గ్రహించాలి. మన అవసరతలు ఆయనకు తెలుసు అని, ఆయన వాటిని అనుగ్రహిస్తారు అని నమ్మకంతో ఉండాలి.
- దేవుడు సృష్టిగురించి పలికిన మాటలను గ్రహించినపుడు ఆయన ఎల్లప్పుడూ మనకు మంచివి మాత్రమే అనుగ్రహించి చెడును యోచించరు అని తెలుసుకోవాలి
- దేవుడు మనకొరకు చేసినవాటిని గమనించినప్పుడు అవి ఎల్లప్పుడూ నిత్యత్వములో నిలిచి ఉండేవి అనే విషయము మనకు అర్థమవుతుంది
- దేవుని యొక్క ఆశీర్వాదములను మనము గమనించినప్పుడు అవి భూసంబంధమైనవి కావని గ్రహించి ఫలింపు, అభివృద్ధి అనేది నిజమైన ఆశీర్వాదము అని గుర్తించాలి
- దేవుడు మనకు బహుమానంగా ఇచ్చిన భూమిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి దానిని నాశనము చేయకూడదు. ఆ బాధ్యత మనదే
- ఈ భూమిని దేవుడు మలచిన తీరు అందులో ఆయన కనపరిచిన శ్రద్ధ మనము చూచినప్పుడు, ఇది ఆయనకొరకు కాదు మనకొరకే తీర్చిదిద్దారు అనే విషయము మనము అర్థం చేసుకుని ఆయన మనయెడల కలిగి ఉన్న శ్రద్ధను గ్రహించి మనము కూడా ఆయన విషయములో పనిచేసేటప్పుడు అంతే శ్రద్ధగా చేయాలి
- ఈ సృష్టిలో మనకన్నా గొప్పవి ఎన్నో ఉన్నాకూడా దేవుడు భూమికి అందులో నివసిస్తున్న మనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనము కూడా ఆయనకు అన్ని విషయములలో అత్యధిక ప్రాధాన్యత అనేది ఇవ్వాలి.
- దేవుడు వెలుగును చీకటిని వేరుపరచుటము ద్వారా మనము వెలుగు సంబందులుగా ఉండాలి అని, చీకటితో కలుసుకోకుండా దూరంగా జీవించాలి, వేరుకావాలి అని తెలుసుకోవాలి
- మనము ఆయన స్వరూపము, పోలికలో ఉండాలి అని మనయెడల దేవుని అభీష్టము కాబట్టి మనము ఎల్లప్పుడు ఆయన స్థాయికి అందుకోవడానికి ప్రయత్నము చేయాలి
- శూన్యములోనుంచి ఇంత అందమైన సృష్టిని చేసిన దేవుడు మన జీవితములోని శూన్యమును కూడా అందముగా చేయగలడు అని విశ్వసించాలి.
- ఈ సృష్టి దేవునికి లోబడి పనిచేయుచున్న రీతిగా మనముకూడా ఆయనకు పూర్తిగా లోబడి ఉండాలి
- దేవుడు చేసిన సృష్టిలోని వస్తువుల యొక్క పరిమాణము మనము గమనించినప్పుడు ఆయన మనయెడల కలిగి ఉన్న తలంపుల, ప్రణాళికల యొక్క పరిమాణము అర్థమవుతుంది
- పరిశుద్ధ గ్రంథము దేవునిని ముందు పెట్టినట్లుగా మనముకూడా మనము చేసే ప్రతి పనిలోనూ దేవునిని ముందు పెట్టుకోవాలి మనకు ఇబ్బంది ఎదురుపడినప్పుడు మాత్రమే దేవుని జ్ఞాపకము చేసుకొనకూడదు
- చేప బ్రతికే విధానము గమనించి మనము కూడా దేవుని వాక్యములోని జీవమును (RHEMA) ను సంగ్రహించి దానిద్వారా బ్రతకాలి. అక్షరజ్ఞానము చంపవచ్చుగాని వాక్యములోని జీవము మనలను బ్రతికిస్తుంది
- మీ జీవిత విధానం ద్వారా ప్రార్థనలో పైకి ఎగిరే అనుభవము కలిగిఉండాలి. దాని ద్వారా సమస్తము వాటి వాటి స్థానములో ఎలా అమర్చబడి ఉన్నాయి అనేది పైనుంచి చూచినప్పుడు మనము సృష్టముగా, చక్కగా గ్రహించ గలుగుతాము. ప్రతి ఎత్తు, పల్లము ఎందుకు ఉన్నాయి అనేది మనకు అవగాహన వస్తుంది. భూమిమీద నిలబడి చూసినప్పుడు అవి మనకు ప్రతిబంధకములుగా కనిపించవచ్చు
- సాధు జంతువుల జీవితవిధానము గమనించి మనము ఆయన కాడి మోయటము నేర్చుకోవాలి. దేవునియొక్క పని ముందుకు కొనసాగటంలో మనవంతు పాత్రను మనము పోషించాలి