1. దేవుడు సృష్టికర్త. ఆయనే ఈ సమస్త విశ్వమును శూన్యము నుంచి సృజించారు. మనుష్యులవలే దేవునికి ఏదైనా తయారుచేయటానికి ముడిపదార్థము అవసరము లేదు. ఆయన దేనిని అయినా సృజించగలరు (1:1)
 2. దేవుడు ఆదినుంచి ఉన్నవాడు. ఆయన కాలమునకు అతీతుడు. ఆయనకు ఆది, అంతము లేదు (1:1)
 3. దేవుడు సర్వ శక్తిమంతుడు (1:1)
 4. దేవుడే సమస్త జ్ఞానమునకు, తెలివికి ఆధారము (1:1)
 5. దేవుడు సమస్తమును ఒక నిర్దిష్ట ప్రణాళికను అనుసరించి తయారుచేశారు (1వ అధ్యాయము)
 6. తన సృష్టిలోని జీవులు ఉపయోగించుకొను సమస్తమును ఆయన వాటిని తయారుచేయటానికి ముందుగానే సిద్దపరిచారు (1వ అధ్యాయము)
 7. దేవుడు తను చేసిన పనిని పరీక్షిస్తారు (1వ అధ్యాయము)
 8. దేవుడు వెలుగును, చీకటిని, పర సంబంధమైన వాటిని, భూసంబంధమైన వాటిని వేరు పరిచారు (1:4, 7)
 9. దేవుడు చేసిన ప్రతిది కూడా ఒక ఉద్దేశ్యము ప్రకారము, దానికొరకు ఒక పని యోచించి తయారుచేశారు (1వ అధ్యాయము)
 10. దేవుడు చేసిన సమస్తము మీద ఆయన వెలుగును ప్రసరింపచేసారు. ఒక్క నరకము తప్ప మరి ఏ ప్రదేశమును ఆయన వెలుగు లేకుండా విడిచిపెట్టలేదు (1వ అధ్యాయము)
 11. దేవుడు ప్రతి పనిని మంచిగాను సమస్తమును కలిపి చాలామంచిగా చేసారు (1వ అధ్యాయము)
 12. ఆయన ఎప్పటికీ చెడు చేయరు. ఆయన ఆలోచనలలో, క్రియలలో, ప్రణాళికలో చెడుకు స్థానము లేదు (1వ అధ్యాయము)
 13. దేవుడే సమస్త జీవమునకు ఆధారము (1:20)
 14. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. దేవుడు = తండ్రి + కుమారుడు + పరిశుద్దాత్ముడు (1:1)
 15. దేవుడు జీవమును ఆశీర్వదించువాడు (1:22, 28)
 16. దేవుడు భూమ్యాకాశములను సృజించినపుడు అన్నింటిని అత్యుత్తమముగా రూపొందించారు (1వ అధ్యాయము)
 17. దేవుడు తన స్వరూపము, పోలికెలో నరులను సృజించారు. సృష్టిలో మరిదేనికిని ఈ అదృష్టము లేదు (1:26, 27)
 18. దేవుడు సమస్తమును కూడా తన నోటి మాట ద్వారా చేసారు. ఆయన వాక్కునకు అంత శక్తి ఉంది (1వ అధ్యాయము)
 19. దేవుడు తన పనులను అస్తమయము కన్నా(చీకటి) ఉదయముతోనే (వెలుగుతో) ముగించారు (1:5, 8, 13, 19, 23, 31)
 20. దేవుడు నరులను మాత్రమే తన స్వహస్తములతో చేశారు (2:7)
 21. దేవుడు నరులను స్త్రీ మరియు పురుషులుగా తయారుచేశారు (1:27)
 22. దేవుడు నరులకు తన చేతిపనులు అన్నింటిమీద అధికారము ఇచ్చారు (1:26, 28)
 23. దేవుడు జీవాత్మను నరులకు దయచేశారు (2:7)
 24. దేవుడు తన సృష్టిలోని జీవులకు ఆహారము దయచేశారు (1:29, 30)
 25. దేవుడు చేసిన పనులు అన్నీ నిత్యత్వ పర్యంతము నిలిచి ఉంటాయి. అవి కాలముతో తరిగిపోయేవి కావు (1వ అధ్యాయము)
 26. దేవుడే ఆదాము, హవ్వకు పేరెంట్ గా ఉన్నారు
 27. దేవుడే భూమిమీద వర్షమును నియంత్రించును (2:5)
 28. దేవుడు మానవులు చెడును గురించిన జ్ఞానము కలిగియుండాలి అని కోరుకోలేదు (2:17)
 29. దేవుడు 7వ దినమును పరిశుద్దపరచి ఆశీర్వదించినట్లు మనము కూడా వారములో ఒకరోజు పూర్తిగా దేవునితో గడపాలి (2:2, 3)
 30. మనము ఆయన ఆజ్ఞలు, కట్టడలు పాటించాలి అని దేవుడు కోరుకుంటారు (2:17)
 31. దేవుడు తను అనుకున్న పని పూర్తి చేసేవరకు విశ్రమించలేదు (2:2)
 32. దేవుడు మానవుని ఆత్మ, ప్రాణము, దేహము కలవానిగా చేశారు (2:7)
 33. మనిషి తనకు అప్పగించిన భాద్యతను నెరవేర్చటానికి అవసరమైన అన్ని వనరులు దేవుడు సమకూర్చారు (2:8-10)
 34. మనిషి అడగకముందే దేవుడు తన అవసరతను ఎరిగి దానిని సంపూర్తి చేశారు (2:18)
 35. దేవుడే మొట్టమొదటి వైద్యపరమైన ఆపరేషన్ చేశారు (2:21)
 36. దేవుడు మనుషులు కుటుంబములుగా జీవించాలి అని కోరుకున్నారు (2:24)
 37. మనుషులు పాపము లేకుండా జీవించాలి అనేది దేవుని అభీష్టము (2:25)
 38. దేవుడే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు (2:24)
 39. దేవుడు పాపమును సహించరు (3, 4, 6, 19 అధ్యాయములు)
 40. దేవుడు పాపమునకు తీర్పు తీర్చి శిక్ష విధిస్తారు (3, 4, 6, 19 అధ్యాయములు)
 41. మానవుడు తను చేసిన పాపము విషయమై పశ్చాత్తాప పడటానికి దేవుడు అవకాశము ఇస్తారు. జంతువులకు అవకాశము లేదు (3:11, 13)
 42. దేవుడు తిరుగుబాటును సహించరు (3:17, 4:11)
 43. దేవుడు క్రమశిక్షణ ద్వారా మనలను రక్షించాలి అని కోరుకుంటారు, మనలను శిక్షించటము ఆయనకు ఇష్టము ఉండదు (3:21, 22; 4:15; 17:1; యాకోబు, అతని కుమారులు)
 44. దేవుడే ఆదాము, హవ్వల తరుపున బాలి అర్పించి వారి పాపమునకు ప్రాయశ్చిత్తము చేశారు (3:21)
 45. దేవుడు మనలో ఉన్న పాప స్వభావమును అసహ్యించుకుంటారు తప్ప మనలను కాదు (3:21, 22)
 46. దేవుడు చాలా దయ కలిగినవాడు. ఆదాము, హవ్వలను వెల్లగోట్టిన తరువాత కూడా వారితో సహవాసములో ఉన్నారు (4, 5 అధ్యాయములు)
 47. మానవులు ఈ లోకములో తమ పనులు చేసుకుని బ్రతకటానికి దేవుడే సహాయము చేస్తున్నారు (ఆదికాండము)
 48. ఆదాము, హవ్వలు తను ఇచ్చిన మాట మీరినా కూడా తాను వారికి ఇచ్చిన ఆశీర్వాదము విషయమై దేవుడు నమ్మకత్వము కలిగి ఉన్నారు (4వ అధ్యాయము)
 49. దేవుడు మనలను కోరుకుంటారు తప్ప మనము ఇచ్చే బహుమానములు కాదు (4:4, 5)
 50. మనము పాపము వలన మరింత ప్రమాదములో పడిపోకుండా దేవుడు మనలను హెచ్చరిస్తారు (4:6, 7)
 51. దేవుడు పాపిని ప్రేమించి అతను మారటానికి దీర్ఘశాంతముతో చాలా అవకాశములు ఇస్తారు (6:3)
 52. దేవుడు జలప్రళయమునకు ముందు మనుషులకు దీర్ఘాయువు దయచేశారు (5వ అధ్యాయము)
 53. దేవుడు నీతిమంతుని తరుపున వాదించును (4:10, 11)
 54. దేవుడు నీతిమంతుల కొరకు భూమిమీద ఎల్లప్పుడూ చూచును (5:24; 6:8, 9)
 55. దేవుడు నీతిమంతులతో సహవాసము, సంబంధము కలిగియుండును (5:24; 6:9)
 56. దేవుడు నీతిమంతుల సహవాసము నందు ఆనందించును, సంతోషించును (5:24)
 57. మానవులు తనతో సహవాసము, సంబంధము కలిగియుండటానికి దేవుడు ఎల్లప్పుడూ ద్వారము తీసే ఉంచారు (6:3; 7:16)
 58. దేవుడు పాపమును ఎప్పుడూ తేలికగా తీసుకొనరు (7:21, 22; 19:24, 25)
 59. దేవుడు నీతిమంతులను ఎల్లప్పుడూ రక్షించును (7:23; 19:29)
 60. నాశనము తప్పించుకొనుటకు దేవుడే నీతిమంతులకు దారి చూపించును (6:14)
 61. దేవుడు నీతిమంతులకు అప్పగించిన పనిని వారు సంపూర్ణము చేయునట్లు అవసరమైన శక్తి, జ్ఞానము వారికి దయచేయును (6:22; 7:5; 12:4)
 62. దేవుడు జలప్రళయము రాకముందు ఆఖరి నిముషము వరకు కూడా ప్రజలకు అవకాశము ఇచ్చారు (7:16)
 63. నీతిమంతులు పాపములో పడకుండా దేవుడు వారిని రక్షించును
 64. తనకు విధేయత కలిగియున్న మనుషులను దేవుడు కాపాడును (నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు)
 65. దేవుడు నీతిమంతులతో నిబంధన చేయును (నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు)
 66. దేవుడు తన ప్రణాలికలు నెరవేర్చు మనుష్యుని కొరకు ఓపికతో ఎదురుచూచును (12:1-3 అబ్రహాము)
 67. దేవుడు మన నాశనము చూసి ఎప్పుడూ సంతోషించరు (8:21)
 68. దేవుడు తన ప్రజల తరుపున పోరాడును (12:17; 20:3; 35:5)
 69. దేవుడు మన విధేయతను పరీక్షించును (22:2)
 70. తనతో చేసిన నిబంధన నెరవేర్చే దిశగా దేవుడు మనలను నడిపించును. ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేయును (35:1)
 71. మనము విధేయత చూపిన కొలది దేవుడు మనలను ఆశీర్వదించును (అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు)
 72. దేవుడు మన శత్రువులను హెచ్చరించును (31:24)
 73. దేవుడు తన ప్రజలను క్రమశిక్షణ చేసి వారిని రక్షించును (17:1; యాకోబు; యాకోబు కుమారులు)
 74. తన ప్రజలు అయినా సరే దేవుడు పాపమును పరిహరించరు
 75. దేవుడు మాట విని లోబడని ప్రజలు శిక్ష ఎదుర్కొంటారు (19:26)
 76. దేవుడు మన కష్టములను, దుఃఖమును చూసి అర్ధము చేసికొనును (అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు)
 77. దేవుడు తన ప్రజల సంరక్షణ నిమిత్తము తన దూతలను పంపును (32:1)
 78. దేవుడు తాను ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చే విషయమై ఎప్పుడూ విశ్వసనీయత కలిగియుంటారు (నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు)
 79. మనము దేవుని మీద అధారపడినపుడు దేవుడు మనకు తగిన భాగస్వాములను దయచేస్తారు (నోవహు, అతని భార్య, హానోకు, అతని భార్య, ఎలియాజరు, ఇస్సాకు, రిబ్కా, అబ్రహాము, శారా, ఆసెనతు, యోసేపు)
 80. దేవుడు మనుషులను వారి పైరూపము చూసి కాక హృదయమును చూసి ఏర్పాటు చేసుకుంటారు (హేబెలు, హానోకు, నోవహు, యాకోబు, యోసేపు)
 81. దేవుడు అధికారుల దగ్గర తన ప్రజలకు అనుకూలత చూపిస్తారు (యోసేపు)
 82. దేవుడు తన ప్రజలను దీవించుటకు అన్యజనులను వాడుకుంటారు (ఫరో)
 83. దేవుడు మనకు ఎప్పుడూ నష్టము కలిగించరు. మనము ఆయన కొరకు పోగొట్టుకొన్న దానికి రెట్టింపు దయచేస్తారు (అబ్రహాము)
 84. దేవుడు తన ప్రజలు దుర్మార్గత, పాపము నుంచి తొలగి రూపాంతరము చెందాలి అని కోరుకుంటారు (యాకోబు, అతని కుమారులు)
 85. మనము పెట్టుకున్న ఒట్టులు నెరవేర్చాలి అని దేవుడు ఆశిస్తారు (యాకోబు)
 86. దేవుడు మన శత్రువులు మన ముందు వంగేలా చేస్తారు (అబీమెలెకు, ఫరో, లాబాను)
 87. దేవుడు తన ప్రజలతో కలలు, దర్శనముల ద్వారా మాట్లాడతారు (అబ్రహాము, యాకోబు, యోసేపు)
 88. తన ప్రజల పట్ల యోచించబడిన, చేయబడిన కీడును దేవుడు వారికి మేలుగా మారుస్తారు (యోసేపు)
 89. దేవుడు తన సొంత కుమారుని దహనబలిగా దయచేశారు (అబ్రహము మోరియా పర్వతము మీద)
 90. దేవుడు మన శత్రువుల మీద మనకు విజయము దయచేస్తారు (అబ్రహాము, 5గురు రాజులు)
 91. పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానము
 92. దేవుడు ఒకసారి మనలను పిలిచిన తరువాత ఆయన వెనుకడుగు వేయరు. మన పిలుపు విషయములో పశ్చాత్తాప పడరు (అబ్రహాము, యాకోబు)
 93. దేవుడు తన నామముల ద్వారా తన వ్యక్తిత్వము గురించి బయలుపరచారు
 94. దేవుడు తను చేయబోవు కార్యముల గురించి తనకు విశ్వాస్యత కలిగిన వారికి తెలియజేస్తారు (అబ్రహాము, సోదోమ, గొమేర్రా గురించి)
 95. దేవుడు తన నిబంధన ప్రజలతో సహవాసము కలిగిన అన్య జనులను కూడా కాపాడతారు, రక్షిస్తారు (ఎలియాజరు, హాగరు)
 96. దేవుడు మన శత్రువులను మనకు మిత్రులుగా చేస్తారు (33:4)
 97. మనము దేవునికి లోబడినపుడు మన శత్రువులను ఆయన గద్దిస్తారు (35:5)
 98. దేవుడు తన విశ్వాసులకు నెమ్మది కలిగిన మరణము దయచేయును (అబ్రహాము, శారా, యాకోబు, యోసేపు, దెబోరా)
 99. వారి యొక్క పిలుపును బట్టి దేవుడు తన ప్రజల పేరులను మారుస్తారు (అబ్రహాము, శారా, యాకోబు)
 100. దేవుడు తన ప్రజలు తన నిబంధనకు సంబందించిన గురుతు కలిగియుండాలి అని కోరుకుంటారు (సున్నతి)
 101. ప్రకృతి పరమైన నియమములను తృణీకరించే విధముగా దేవుని అద్భుతములు ఉంటాయి (శారా బిడ్డకు జన్మ ఇచ్చుట)
 102. దేవుడు తన ప్రజలతో మాట్లాడేటపుడు ఒకోసారి శరీరదారిగా వస్తారు (18:1)
 103. దేవుడు తనను నమ్ముకున్న వారి యొక్క పరపతిని బట్టి కాకుండా వారి స్థితి ఎలా ఉన్నా వారి ప్రార్థన ఆలకిస్తారు (ఎలియాజరు)