దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించువాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను (1:20-23).

దేవుడు ఈ వచనములలో మత్స్యములను గురించి మాట్లాడుతూ ఆయన చేసినవాటిలో మహా మత్స్యములు కూడా ఉన్నవి అని తెలియచేయటము జరిగినది. అధ్యాయము 1లో ఈ రకమైన పదము మరి ఏ ఇతర వస్తువునకు గానీ, జీవరాశికి గాని ఉపయోగించినట్లు మనకు కనిపించదు. దీనినిబట్టి వాటియొక్క ఆకారము ఎంత గొప్పది అని ఊహించవచ్చు. చాలామంది అంచనా ప్రకారము అవి తిమింగలములు కావచ్చు. ఆకారములో వాటికన్నా పెద్దవి మనకు సముద్ర జలములలో కనిపించవు. వాటి బరువు సుమారు 150 టన్నుల వరకు ఉంటుంది. వీటిని బట్టి చూసినప్పుడు దేవుడు నిత్యజీవము కలిగినవారు లోకములో ఎలాంటి స్థాయిలో ఉండాలి అని కోరుకుంటున్నారు అనే విషయము అర్థము అవుతుంది. మత్స్యము రక్షణ పొందిన మనుష్యుని ఆత్మకు సూచనగా వున్నది లేదా మనుష్యుల ఆత్మకు సూచనగా ఉన్నది. వాటి ఆకారమును బట్టి అవి ఎంతవరకు ఎదగడానికి అవకాశము ఉన్నది అనే విషయము కూడా అర్థము అవుతుంది. వాటి ఆకారమును బట్టి వాటిని ఎదిరించగల శతృవు మరొకటి ఉండదు. ఇవి హానికరములైన జీవులు కాదు. మరి మనము ఆత్మలో ఎంత బలము కలిగి ఉన్నాము? దేవుని యొక్క కొలమానము ఏమిటో మనకు అర్థము అవుతూనే ఉంది. లోకములో మనము బలముకలిగి ఉంటున్నామా లేదా అనేది ఆలోచించాలి. ఈ బలము పోరాటమునకు సూచన కాక ఎదుగుదలకు ఉన్న అవకాశము/standard గా గుర్తించాలి.

మత్స్యములు నీటిలో ఉన్న ఆక్సిజన్ పీల్చుకుని బ్రతుకుతాయి. నీరు అనేది దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క ఉపదేశమునకు కూడా సాదృశ్యముగా ఉన్నది. వాటిని అనుసరించి మనము కూడా వాక్యములో ఉన్న రేమాను సంగ్రహించి జీవించాలి. నీటిలో నుంచి బయటకు వచ్చిన చేప నేలమీద గాలిలో ఉన్న ఆక్సిజన్ పీల్చుకోలేదు. అది గిలగిలా కొట్టుకుని ప్రాణము విడుస్తుంది. అలానే మనము కూడా వాక్యము బయట జీవించలేము. దేవుని వాక్కునకు, లోకము యొక్క వాక్కునకు చాలా వ్యత్యాసము ఉన్నది. లోకము యొక్క వాక్కు మనలను మరణమునకు నడిపిస్తుంది. అది మనలను బ్రతికించలేదు. దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే మనకు జీవము లభిస్తుంది. అక్షరార్దకమైనట్లుగా లేఖనములను చదవకుండా వాటిని ధ్యానించి సారము గ్రహించాలి. దేవుని వాక్యము లోతైన గని లాంటిది. త్రవ్వేకొద్దీ విలువైన వస్తువులు, బాగా లోతులో వజ్రాలు, రత్నములు లభిస్తాయి. అలా లోతుగా ధ్యానించినప్పుడు అవి మన ఆత్మకు అవసరమైన బలమైన మాంసాహారమును లేదా పౌష్టికాహారము అందిస్తాయి. వాటి ద్వారానే మనము బహు బలముగా ఎదగగలము. అందుకే మనుష్యుడు రొట్టెతో కాకుండా దేవుని నోటినుండి వచ్చు మాటవలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. మరి నీ పరిస్థితి ఎలా ఉంది. లేఖనములలో ఉన్న అక్షయమైన, వాడబారని ఆహారము ద్వారా జీవిస్తున్నామా? లేక క్షయమైన ఆహారము ద్వారా జీవిస్తున్నావా?

చేపలు అనేవి కేవలము ఒడ్డున లోతు తక్కువ ప్రదేశములలోనే కాకుండ సముద్రములోని లోతైన ప్రదేశములలో కూడా నివసిస్తాయి. చేప లోతు తక్కువ నీటిలో ఒడ్డున ఉండే కన్నా లోతైన ప్రదేశములోనే సురక్షితముగా ఉంటుంది. వలలో చిక్కకుండా తప్పించుకోవటానికి అవకాశము ఉంటుంది. అలానే మనము కూడా వాక్యములో లోతునకు వెళ్లి అక్కడ నివసించాలి. అప్పుడు మనము సమస్త శోదనలనుంచి తప్పించబడి సురక్షితముగా ఉంటాము. మనము దేవుని గురించిన, రక్షణను గురించిన మూల పాటముల యెద్ద మాత్రమే ఆగిపోకుండా ఆయనను గురించిన సంపూర్ణ జ్ఞానములోనికి నడవాలి. అప్పుడే మనము దేవుని గురించిన మన శిష్యత్వపు జీవితమును గురించిన పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉంటాము. దాని ద్వారా తప్పుడు బోధలను గుర్తించి జాగ్రత్త పడగలుగుతాము. లేనియెడల గాలివాటమును కొట్టుకొనిపోవు పొట్టు వలె ఉండెదము. Ezekiel 47లో దేవాలయమునుండి పారుచున్న నది సందర్భమును ఇక్కడ మనము అనుసరించి చీలమండలనుంచి ఒక్కో అడుగు వేసుకుంటూ మోకాళ్ళ లోతునకు, మొల లోతునకు, తరువాత దాటలేనంత విస్తారమైన నది కనుగొనటము జరిగినది. అలానే మనము కూడా step by step లోతునకు నడవాలి. పరిశుద్ధ గ్రంథమును ప్రణాళికా బద్ధముగా, బాధ్యతాయుతముగా చదవాలి. నీవు రక్షణ పొంది లేదా దేవుని గురించి తెలుసుకుని ఎన్ని సంవత్సరములు అయినది? నీ జ్ఞానము లేదా నడక ఎంత లోతునకు చేరినది?