దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను (1:5).

అస్తమయమును, ఉదయమును మధ్యనున్న క్రమము మనము గమనించినప్పుడు వెలుగు, చీకటి మధ్య జరుగుతున్న ఈ యుద్ధములో విజయము అనేది చివరకు వెలుగునదే అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యుద్ధములో చివరకు ఏది అయితే నిలిచి ఉంటుందో అదే విజయము సాధించినట్లు. దీనిద్వారా దేవుడు వెలుగువైపు అనగా, తనలో ఉంటేనే మనకు విజయము దక్కుతుంది, ఇంక వేరే మార్గము ఏదీ కూడా లేదు అని తెలియజేస్తున్నారు. చీకటిలో ఉంటే చివరకు మనకు అపజయమే మిగులుతుంది. యెహోషువ ప్రార్ధించినప్పుడు కూడా చీకటిని తలదన్ని వెలుగు నిలబడింది తప్ప, ఆ వెలుగు తప్పుకునేంత వరకు చీకటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. వెలుగు, చీకటి మధ్య ఉన్న వ్యత్యాసాన్నిమనము గ్రహించి, బలవంతముతో కాకుండా స్వచ్ఛందముగా వెలుగు దగ్గరకు రావాలి. మన మనస్సులను నొప్పించకూడదు అని ఆయన వెలుగును తప్పించటము (రాత్రి పూట) జరుగుతుంది తప్ప, అది చీకటి యొక్క విజయముగా మనము భావించకూడదు. మన ఇంటివారిమీద ఎవరైనా కయ్యానికి వస్తే మనము ఎదుటివారికి సహకరించము కదా. మన ఇంటివారి తరుపునే పోరాడుతాము, ప్రాణహాని ఉందని తెలిసినా కూడా. అలానే దేవునికి, సాతానుకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధములో మనము మన తండ్రి తరపునే నిలబడాలి. నీవు సాతానునకు సహకరిస్తే నిన్నుమోసగాడు అంటారు తప్ప ఎప్పటికీ సైనికునిగా, వీరునిగా గుర్తించరు.

మనము దేనిని వెంబడించాలి అనేటటువంటి వివేచన అంతర్లీనముగా దేవుడు మన శరీరములో మనస్సాక్షి ద్వారా పొందుపరచటము జరిగినది. అందుకే ప్రతి మనిషికూడా చీకటి పడగానే లైట్ వేసుకుంటాడు. ఎవరమూ కనీసము రాత్రి నిద్రపోయే సమయములో కూడా చిమ్మచీకట్లో నిద్రించము. మన కన్నులు కూడా ఎంతోదూరములో ఉన్న వెలుగును చూడగలుగుతాయి తప్ప, చీకటిలో చూడడానికి అవి నిర్మించబడలేదు. మన మనస్సునకు కూడా వెలుగులో ఉన్నంతసేపు ఉండే ధైర్యము, ఆనందము, నిర్భయము చీకటిలో ఉండవు. వీటిని అన్నింటినీ బట్టి చూసినప్పుడు మనము వెలుగు కోసమే చేయబడినవారము తప్ప చీకటి కోసము కాదు అనే విషయము అర్థము ఆవుతుంది.

దేవుడు ఎల్లప్పుడూ మనలను వెన్నంటి ఉండటము కొంతమందికి privacy problem గా అనిపిస్తుంది. వారి స్వేచ్ఛను హరిస్తున్నట్లుగా feel అవుతూ ఉంటారు. అయితే పిల్లలు ఎంత వయస్సు వచ్చిఎదిగినా కూడా తల్లిదండ్రుల కన్నులకు పిల్లలుగానే కనిపిస్తారు. వారు ఎక్కడ తొట్రిల్లకూడదు అని వారి విషయములో చనిపోయేవరకు శ్రద్ధ తీసుకుంటూనే ఉంటారు. అలానే మన పెరట్లో కొండచిలువ ఉంది అని తెలిస్తే మన పిల్లలను ఎలా విడిచిపెట్టమో, దేవుడు కూడా మనము సాతాను చేతిలో పడకూడదు అని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. అది ఆయనలో ఉన్న కన్న ప్రేమ తప్ప స్వేచ్ఛను హరించటము కాదు.