ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను (1:1).
దేవుడు సమస్తమును మనకు అందుబాటులో ఉంచారు
ఈ లోకములో మనము జ్ఞానము అనేది సంపాదించాలి అంటే దానికి వెల చెల్లించవలసి ఉంటుంది. కొన్ని సమయములలో ఒక ప్రత్యేకమైన స్థలమునకు వెళ్లి అక్కడ నేర్చుకోవలసి ఉంటుంది. సమయము కూడా మన అధీనములో ఉండదు. ఎదుటివారు నిర్ణయించిన అంశములు, వారు ఇచ్చిన కాలపరిమితిలో నేర్చుకోవాలి. కానీ దేవుడు ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటారు. ఆయన మనకు కేవలం మాట దూరములో ఉన్నారు. ఏ విధమైన వెల చెల్లించవలసిన అవసరము లేకుండా మనకు అవసరమైన సమస్తమును తెలియజేయడానికి ఏ సమయములో అయినా సిద్ధంగా ఉన్నాడు. మనకు అనుకూలమైన వేగముతో మనము నేర్చుకోవచ్చు. ఏదీ కూడా మరుగు చేసే వ్యక్తికాదు. ఈ లోకములో ఎవరైనా ఒక వస్తువును చేసినప్పుడు దానిని మనము ఉపయోగించాలి అంటే వెల చెల్లించవలసి ఉంటుంది. కానీ దేవుడు అనంతమైన వనరులను మన పరము చేయటము జరిగినది. ఎవరైనా ఒక వస్తువును తయారు చేసినప్పుడు దానిని ఎలాఉపయోగించాలి ఎందునిమిత్తం ఉపయోగించాలి అనే వివరములు మాన్యువల్లో పొందుపరచి ఇస్తారు. దాని ప్రకారము ఆ వస్తువును ఉపయోగించినప్పుడు అది మనకు ఉత్తమమైన సేవను అందిస్తుంది. అలానే దేవుడు సృష్టి గురించిన వివరములు మానవుల పద్ధతుల గురించిన అనేక వివరములు పరిశుద్ధగ్రంథములో పొందుపరిచారు. మనము ఆ సూచనల ప్రకారము నడుచుకుంటే సమాజము, ప్రకృతి అందరికీ గొప్ప ఆశీర్వాదముగా మారతాయి.
సమస్త నిర్వహణ బాధ్యత దేవుడే చూస్తున్నారు
మనము ఏదైనా ఒక వస్తువును ఉపయోగిస్తున్నప్పుడు సమయానుకూలముగా దానికి కొంత నిర్వహణ అవసరమవుతుంది. దానికి కూడా తయారీదారుడు మన దగ్గర డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. అయితే మనము భూమి యొక్క నిర్వహణ బాధ్యతలు ఏమికూడా నిర్వహించవలసిన అవసరము లేకుండా దేవుడు సమస్తము నిత్యత్వ పర్యంతము పనిచేసేలా రూపొందించారు. ప్రకృతి తనంతటతానే నిర్వహణ బాధ్యతలు నెరవేరుస్తుంది. ఆయన చేసినది ఏదీకూడా సమయానుకూలముగా క్షీణించిపోవటము లేదు. ఇలాంటి ఏకైక పరిజ్ఞానము దేవుని దగ్గర మాత్రమే మనకు లభిస్తుంది. మనిషికి ఇలాంటి జ్ఞానము లేదు అని మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మనము దేవుని దగ్గర జ్ఞానము సంపాదించి ఏదైనా తయారు చేయటము అలవాటు చేసుకుని ఉంటే మానవాళి ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టించి ఉండేదో. మనము ఈ భూమిని, ప్రకృతిని ఉపయోగించే విషయంలో సరైన పద్ధతి అవలంబించకుండా వాటిని పాడుచేస్తూ ఉన్నా, దేవుడు దానిని మరలా మరలా బాగుచేస్తూ మన జీవితమునకు అవసరమైన వాటిని అందజేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి ఏ విధమైన రుసుము మన దగ్గర వసూలు చేయడంలేదు. అందునిమిత్తం మనము అందరము కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసినవారమై ఉన్నాము. మనము ప్రకృతిని ఉపయోగించే విషయంలో పశ్చాత్తాపము చెందవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇకముందు అయినా బాధ్యతగా ఉందాము
సమస్తమును మనకోసమే చేయడము జరిగినది
ఈ యొక్క వాక్యమును మనము గమనించినప్పుడు దేవుడు ఆదినుంచి ఉన్నవాడు అని ఆయన ద్వారానే సమస్తము చేయబడినవి అని అర్థమవుతుంది. ఆయన చేతిపనులమీద మనకు ఇచ్చిన అధికారమునుబట్టి ఆయన భూమిని మనకోసం చేశారు అని సృష్టం అవుతూ ఉంది. పరలోక రాజ్యములో మనలను చేర్చుకునే ప్రణాళిక చూచినప్పుడు దానిని కూడా మన కొరకు తీర్చిదిద్దారు అని అర్థం అవుతుంది. ఇవి ఏవీకూడా సృష్టించకమునుపు ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకు కొదవ అయినది ఏమీకూడా లేదు. ఆయన కొరకు వీటిని అన్నింటిని చేయలేదు. మన విషయములో ఆయన కలిగి ఉన్న జాగ్రత్తకు, అనురాగము, ప్రేమకు ఈ భూమి, ఆకాశములు మచ్చుతునకగా నిలుస్తాయి. మనము శరీరము పరముగా జీవించిన కాలం కొరకు భూమి, మరణం తరువాత శరీరం విడిచినప్పుడు ఆత్మ నివాసం కొరకు పరలోకము సిద్ధంచేయడం జరిగినది. ఆయన అంతమును ఆదినుంచి ఎరిగినవాడు కాబట్టి అవసరమైనవి అన్నీ ముందుగానే చేసిపెట్టారు. దేవదూతలను కూడా ఎక్కువగా మన పరిచర్యకొరకు ఉపయోగించినట్లుగా మనకు లేఖనములనుబట్టి అర్థం అవుతూ ఉంది. దేవుడు మన ఆత్మీయ, భౌతిక అవసరాలను తీర్చగల సమర్థుడు.