దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను (1:11-13).
అది మంచిది అని దేవుడు చెప్పటము ద్వారా ఇలాగున మనము ఫలించటము, విత్తనములు చెడిపోకుండా ఫలముల విషయములో జాగ్రత్త వహించటము, సేవ ద్వారా విత్తనములు ఇచ్చే చెట్లుగా ఉండటము అనేది ఆయన చిత్తము అని గ్రహించాలి. కాబట్టి ఆయన చిత్తమును మీరి వేరొక చెట్టు యొక్క ఫలములాగా ఉండాలి అని ప్రయత్నము చేయకూడదు. అది మనకు శ్రేయస్కరము కాదు. దేవుడు ఏదైనా ఒకటి మంచిది అని చెప్పినప్పుడు దానికి వ్యతిరేకముగా జరిగించుట మనకు మంచిదికాదు అనే విషయము కూడా మనము గ్రహించాలి. అది ఆయనకు మాత్రమే మంచి కాకుండా మనకు ఆయనకు ఇరువురికి మంచిది అని అర్థము. పిల్లలు బాగుంటేనే తండ్రి సంతోషముగా ఉంటాడు అనే విషయము లోకములో ఉన్న మనకందరికీ విధితమే. ఆయన చిత్తము నెరవేర్చుటలోనే మన మేలు దాగి ఉన్నది. రక్షణ ప్రణాళికలో 4వ అడుగు మనము ఫలించటము అనేది ఈ వచనముల ద్వారా మనము గ్రహించాలి. ఈ యొక్క క్రమములో అంటే ఎదుగుదలలో వచ్చే ప్రతి ఒడుదుడుకులను కూడా ప్రభువు ద్వారా ఆయన సహాయముతో మనము జయించాలి. మరి నీవు ఫలించే చెట్టుగా ఉంటావా నరకబడే చెట్టుగా ఉంటావా అనే నిర్ణ యము నీదే
మన మధురమైన ఫలముల ద్వారా లోకము యొక్క ఆత్మీయ ఆకలి తీర్చాలి అని దేవుడు ఉద్దేశ్యము. ఆయా సీజన్లలో వచ్చే ఫలముల ద్వారా మన శరీరమునకు ఎలాగైతే ఆరోగ్యము కలుగుతుందో అలానే మనలో ఉన్న ఆత్మీయ ఫలములద్వారా సమాజమునకు ఆరోగ్యము కలిగించాలి అనేది దేవుని ఉద్దేశ్యమై ఉన్నది. మనలో ఉన్న ఆత్మ ఫలములను వారు రుచి చూసినప్పుడు వారు కూడా అలాంటి జీవితమును కోరుకుని దేవుని తట్టునకు ఆకర్షింపబడతారు. మన ఫలములు సరిగా లేకపోతే వారు మనలను చూసి దేవుని అపార్థము చేసుకుని ఆయనకు దూరము అయ్యే ప్రమాదము కలదు. అందుకే మనము మన ఫలముల విషయమై బహు జాగ్రత్త వహించాలి. అది కేవలము మన మేలునకే కాకుండా సమాజము యొక్క మేలుకొరకు కూడా అని గ్రహించాలి. ఆయన బిడ్డలుగా ఆయన నామమునకు అవమానము తెచ్చే విధముగా మన జీవితములు ఉండకూడదు. సమాజము యొక్క అవసరతను బట్టి ఆ యా సీజన్లలో దేవుడు మనలో అవసరమైన వారిని ఉపయోగించుకుంటారు. అందుకే మనము ఒకటే రకము కాకుండా వివిధ రకముల ఫలములతో నింపబడి ఉన్నాము. మన ప్రతి అవసరత కొరకు మనలను తీర్చిదిద్దుతున్న దేవునికి కృతజ్ఞతా స్తుతులు. నీ ద్వారా సమాజము దేవుని గుర్తించగలుగుతుందా?
దేవుడు మూడవ దినమునుంచి భూమిమీద వృక్షములను, జీవరాసులను చేయటము మొదలు పెట్టినప్పుటినుంచి దాని దాని లేదా వాటి వాటి జాతి ప్రకారము అనే మాట పదే పదే ఉపయోగించటము గమనిస్తాము. ఈలాగున చేయుట ద్వారా భవిష్యత్తులో ఆయన సృష్టికి విరుద్ధముగా లేచు ప్రతి సిద్ధాంతమును ఖండించటము కలదు. పండు ముందా లేక విత్తనము ముందా అని తర్కపు ప్రశ్నలు వేసి తన ప్రజలను తప్పుదోవ పట్టించటానికి, confusion చేయటానికి రాబోయే తరములలో తయారు అయ్యే వారినుంచి మనలను కాపాడటానికి, అందరికీ సత్యమును గ్రహింపు కావటము కోసము కూడా దేవుడు కొన్ని విషయములను స్పష్టముగా వ్రాయించటము జరిగినది. సూర్యుడు, వర్షము లేకుండా మొక్కలు పెరగవు ఎదగవు అనేది మాత్రమే మానవుడు కనిపెట్టాడు కాని, వాటి అవసరము లేకుండానే సమస్తమును ఒకరోజు ముందే సృష్టించటము ద్వారా, ఆయన ద్వారానే ఇవి అన్నీ సాధ్యము అని నిరూపించారు. దేవుని వాక్యము చాలామంది భావించినట్లు వైరాగ్యము కోసము కాదు. అది మన ఉనికిని గురించి అర్థము చేసుకోవటానికి సమస్తమును వివరించే technical document లేదా encyclopedia అయి ఉన్నది. అది ప్రతి ఒక్కరికీ కూడా అవసరమే. scienceకు దేవుని వాక్యము ఆధారము తప్ప science దేవుని వాక్యమునకు ఆధారము కాదు. దేవుని వాక్యము విజ్ఞానపు నిధి.