మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను  (1:6-8).

ఈ యొక్క విశాలము మనము గమనించినప్పుడు జీవము కలిగి ఉన్న వ్యక్తులకు గల ప్రాధాన్యత ఏమిటి అనేది మనకు అర్థము అవుతుంది. దేవుడు ఇచ్చిన జీవము కలిగిన వ్యక్తులు ప్రాణముతో ఉన్నంతవరకు భూమిమీద ఆయన ద్వారా భద్రము చేయబడి, మరణము తరువాత ఆకాశమునకు ఆయన సన్నిధికి కొనిపోబడతారు. తర్వాత ఆయనతో పాటు భూమిమీదకు వచ్చి1000 సంవత్సరముల పాలనాకాలములో ప్రభువుతో కూడా ఉంటారు. ఆకాశమునకు భూమికిని మధ్య చేరలేనంత దూరము ఉన్నా అక్కడికి చేరటము మనుష్య జ్ఞానమునకు అసాధ్యము అనిపించినా కూడా ప్రార్ధన, సహవాసము ద్వారా ఆయన ఆ దూరాన్నిచెరిపివేశారు. మనము మనస్సులో తలచుకొనగానే ఆ దూరమును ఇట్టే అందుకోగలగటము మనము అయన ద్వారా పొందుకున్న గొప్ప ఆశీర్వాదము. మనకు ఆ మార్గము పాపముద్వారా మూయబడినప్పుడు మనలను వదులుకోవటము ఇష్టము లేక మనమీద ఉన్న ప్రేమను చంపుకోలేక తన కుమారుని బలి ఇచ్చి ఆ మార్గము ఎప్పటికీ తెరిచి ఉంచటము జరిగినది. కానీ జీవములేక మరణించినవారికి ఆ అవకాశము ఎప్పటికీ లేదు. వారు పాతాళమునుండి దాటి రాకుండా మహా అగాధము ఉంచబడినది. ఆకాశమునకు మనకు మధ్య అలాంటి అగాధము లేకుండా చేసిన దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు. Earth to hell is one way. Earth to heaven is two way traffic

ఆయన ఆకాశవిశాలమును పరచినప్పుడు అది మనము భూమిమీద ఎటువైపు సంచరించినా, భూమికి పైన ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మన చుట్టూ, మన పైన ఉన్నట్లుగానే ఉంటుంది. కోడి తన రెక్కల క్రింద పిల్లలను కప్పినట్లుగానే ఆది ఉండటము గమనార్హము. అలానే దేవుడు కూడా మనలను ఎప్పుడూ తన రెక్కల చాటున మనకు ఆశ్రయము కల్పిస్తాడు. తండ్రిని మరచిన కుమారులుగా మనము ఉన్నాము కానీ మనలను మరువని తండ్రిగా ఆయన ఉంటున్నాడు. ఒక దినమున కాకపోతే మరియొక దినమునకు అయినా ఆయనను తెలుసుకుంటాము అని, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న immaturity ద్వారా, సాతాను కుతంత్రములు ద్వారా జరిగినది అని తెలుసుకొని దినమెల్ల చాచిన రెక్కలతో ఆయన మనకోసము ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఏ రోజున తలుపు తడతామో అని పరమునకు మనకు మధ్యన మార్గము ఎల్లప్పుడు తెరిచి ఉంచారు. అందుకే కాబోలు మనము పైన ఎంత ఎత్తుకు చూసినా భయము, కళ్ళు తిరగడము ఉండదు కానీ, కొంచెము పైకి వెళ్లి క్రిందకి చూస్తే మాత్రము భయమువేసి కళ్ళు తిరుగుతాయి. అదే ప్రేమతో అక్కున చేర్చుకునే తండ్రి చేతులకు, ఎప్పుడు మింగుదామా అని నోరు తెరుచుకుని ఉన్న పాతాళమునకు మధ్య ఉన్న తేడా. ఇప్పటికైనా ఆయన సహవాసమును, దీర్ఘశాంతమును, ప్రేమను గుర్తిద్దాము.

జలము అనేది దేవుని దగ్గరనుంచి వచ్చు సందేశమునకు కూడా గుర్తుగా ఉన్నది. దేవుడు ఇచ్చిన జ్ఞానమును మనము పాపము ద్వారా పాడు చేసుకున్నాము. కేవలము మంచి మాత్రమే తెలిసినదానికి చెడును కలిపి కలుషితము చేసుకున్నాము. అందుకే దేవుడు జ్ఞానము మధ్య విభజన చేయటము జరిగినది. పైనుండి వచ్చు పరలోక జ్ఞానము ఉత్తమమైనది. లోకసంబంధమైన జ్ఞానము కలుషితమైనది. అందుకే దేవుడు మనము ఎల్లప్పుడూ కూడా పైనుంచి వచ్చు జ్ఞానమును పొంది ఉండాలి అని చెప్పటము జరిగింది. దేవుని యెరుగక ముందు దయ్యముల జ్ఞానముతో నింపబడిన మనము, అంధకారమునే వెలుగు అనే భ్రమలో బ్రతికాము. ఒక్కసారి దేవునిచేత వెలిగించబడిన తరువాత మరల ఆ లోకజ్ఞానముతో ఉంటే మునుపటి బంధకములలోనికి తిరిగివెళ్లే ప్రమాదము ఉన్నది. అందుకే లోకములో మనము పైనుంచి తయారుచేయబడిన ఆ వాక్యజ్ఞానము అనుసరించి లోకములో జీవించాలి. లోకజ్ఞానము ఎప్పుడూ కూడా దైవ జ్ఞానమునకు వ్యతిరేకముగా ఉంటుంది. మనము దైవజ్ఞానము వెంబడిస్తున్నప్పుడు లోకముచేత హేళన చేయబడి సిగ్గుపరచబడవచ్చు. అయినా సరే ప్రభువు మన కోసము సిలువలో సమస్తమైన హేళన, అనుమానము ఎలాగైతే భరించారో అలానే మనము కూడా ఆయనను మాదిరిగా పెట్టుకుని భరించాలి. ఆయన ప్రేమ అందుకు అర్హమైనది