దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను (1:5).

ఉదయపు వెలుగులోనికి మన జీవితమును నడిపించిన దేవుడు దానిని జాగ్రత్తగా కాపాడుకోవటానికి అవసరమైన అన్ని వనరులు మనము అవలంబించవలసిన పద్ధతులు మనకు సమస్తము అందుబాటులో ఉంచారు. మనంతట మనము దానిని చీకటి చేసుకోవాలే తప్ప దేవుడు పనిచేసినంత కాలము అది వెలుగుమయముగానే ఉంటుంది. ఉదయము అనేది ప్రతి జీవికి ఆహ్లాదము కలిగించే వాతావరణము. దేవుడు మన జీవితములో చేసే ప్రతి పనికూడా అదే విధముగా శాంతి, సమాధానము కలిగిస్తుంది. ఇది ఎలా సంపాదించాలో తెలియక మానవజాతి ఎన్నో పద్ధతులు కనిపెట్టి చాలా వేల సంవత్సరములుగా కష్టపడుతూ ఉన్నది. వారు ఉదయమున మొదలుపెట్టి రాత్రి అంతయు ప్రయత్నము చేసినాకూడా చివరకు అస్తమయమే వారికి మిగులుతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథము అనేకచోట్ల తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు శాంతి, సమాధానము కలుగుతాయి అని సెలవిస్తుంది. పౌలు భక్తుడు తన పత్రికలు అన్నిటినీ ఈ విషయముతో మొదలుపెట్టటము మనము గమనించగలము. ఈ విధమైన సమాధానకర స్థితి గొప్ప ఆశీర్వాదము. అస్తమయములో చీకటితో కొట్టుమిట్టాడుతున్న ఆత్మకు ఒక దినములోనే వెలుగు ప్రసాదించబడుతుంది అనేది ఎంతో ఆనందము కలిగించే వాగ్దానము. దీనిని బట్టి మన రక్షణ క్రమములో జరిగే లేదా మనలను నూతన సృష్టిగా మార్చే ప్రక్రియలో మొదటి దినము జరిగే చర్య అస్తమయము/ చీకటి నుంచి ఉదయము/ వెలుగునకు నడిపించుటము. ఇది తొలి అడుగు.

ఈ విధముగా తన పనిని మనలో ప్రారంభించిన దేవుడు 6వ దినమున సంపూర్ణము చేసేంతవరకు ఎక్కడా విశ్రాంతి తీసుకొనలేదు. ఆయన స్వరూపము, పోలికే మనలో ఏర్పడేంతవరకు, మనము కోల్పోయినది తిరిగి సంపూర్ణముగా పొందుకునేంతవరకు ఆయన నిర్విరామముగా పనిచేస్తూనే ఉన్నారు. మనకు ఆయన దినములో 12 గంటలు విశ్రాంతి అనేది రాత్రి సమయములో కేటాయించారు కానీ, ఆయన మాత్రము ఎక్కడా విశ్రాంతి పొందలేదు. మన జీవితములో ఆయనతో సహకరించకపోవటము వలన ఆ సంపూర్ణత అనేది రావటము లేదు. విపరీతమైన ఆలస్యము జరుగుతుంది. మనవలననే కొంతమంది జీవితములో అది సంపూర్ణముగా నెరవేరకుండా ముగిసిపోతున్నాయి. ఇందులో దేవుని ఎక్కడా శంకించటానికి, తప్పుపట్టటానికి ఆస్కారము లేదు. ఆయన తలుపు దగ్గర నిలవబడి తడుతూ ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నారు. మనమే సిద్ధముగా లేము. ఆయనతో అవిశ్రాంతముగా పనిచేయటము లేదు. ఇక్కడ దేవునికి మనలను సరిదిద్దటములో ఉన్న తాపత్రయము, ప్రేమ, ఆయన పడుతున్న కష్టము గుర్తించాలి. ఉదయము వచ్చేంతవరకు ఆయన పనిచేస్తూనే ఉన్నారు. మధ్యలో ఎక్కడా ఆపలేదు. అస్తమయమునందు మన చేయి పట్టుకుని రాత్రి అంతాకూడా మనకు తోడుగానే ఉన్నారు. ఎక్కడా కునకలేదు నిద్రించలేదు. ఆయన మొదలుపెట్టిన పనులు ఎప్పుడూ అలా మహిమకరముగానే ముగించబడ్డాయి. కాబట్టి ఆయనను విశ్వసించటములోను, మన జీవితమును సంపూర్ణముగా అప్పగించటములోను సంశయము అవసరము లేదు

ఇక్కడ కలిగిన అస్తమయము, ఉదయమునకు సూర్యునితో సంబంధము లేదు. చాలామంది సూర్యుని ద్వారానే అవి కలుగుతాయి అని భావిస్తారు. అయితే దేవుడు 4వ వచనములో వెలుగును చీకటిని వేరుచేసినప్పుడు ఆ నిర్దిష్ట సమయము ఎడము 12 hrs ఉంచటము జరిగినది. ఆ 12 గంటలు నిడివిలో ప్రకాశించే విధముగా భూమిని, సూర్యుని, చంద్రుని, కక్ష్యలు ఆయన tune చేయటము జరిగినది. పగటిని, రాత్రిని ఏలుటకు సూర్యుడు, చంద్రుడు చేయబడ్డారు తప్ప సూర్యుడు, చంద్రుడు కోసము పగలు రాత్రి చేయబడలేదు అని 4వ దినమున దేవుడు చేసిన కార్యముద్వారా మనము గుర్తించాలి.

సూర్యుడు, చంద్రుడు ఏక కాలములో భూమికి చెరొక వైపు ఉంటారు. ఒక్కొక్కరు భూమిని సంపూర్ణముగా కవర్ చేయటము, ఒకరి తర్వాత ఒకరు రావడము జరుగదు. ఒకవేళ భూమి అంతా పగలు ఉండి, మరలా భూమి అంతా రాత్రి ఉన్నట్లయితే 12 గంటల పాటు దేవునితో సహవాసము చేయడానికి మనము ఎవరమూ ఉండము. ఆ ఎడబాటు ఆయన భరించలేక మనలను అనగా భూమిమీద ఉన్న ప్రజలను 2 shifts కింద విభాగించి 12 గంటలు ఒకరితోను మిగతా 12 గంటలు ఇంకొకరితో సహవాసము చేయటము జరుగుతుంది. ఆయన మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. మనమే ఆయనను నిరీక్షించేలా చేస్తాము. ఎప్పుడూ కళ్లముందు ఉంచుకొని కంటికి రెప్పలా కాపాడుకొనే గొప్ప తండ్రి మనస్సు ఆయినది. అవే లక్షణాలు మన పిల్లల విషయములో మనకి కూడా వచ్చాయి. రాత్రి కూడా నిద్రలో ఆయనతో గడపటానికి, సహవాసము కోసమే దర్శనములను, కలలను ఇచ్చారేమో?