మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను (1:6-8).

ఈ వాక్యమును అనుసరించే రక్షణ ద్వారా దేవుని తెలుసుకుని వెలుగులోనికి వచ్చిన మనలను దేవుడు ఉన్నతస్థలముల మీద కూర్చుండబెట్టాలి అని ఆశిస్తున్నాడు. మనము లోకములో పాపము అనే పెంటకుప్పల మీద ఉండిపోకూడదు అని ఆయన అభిలాష/మనోవాంఛ. ఇది మన జీవితములోని అన్ని కోణాములలోను ప్రస్ఫుటముగా కనిపించాలి. మన మాటతీరు, సమాజములో ప్రవర్తన/నడవడిక నీతిని అనుసరించి నడుచుకొనుట, చూపులు, వస్త్రధారణ, ఎదుటివారిని ప్రేమించి వారికి హాని తలపెట్టకుండా ఉండుట ఇలా అన్నివిషయములలోను మనలో కలిగిన మారుమనస్సు లోకములో ఉన్నవారికి కనిపించాలి. ఆలాగున మనలను తీర్చిదిద్ది ఉన్నతముగా అందరి కన్నులకు కనపరచాలి, గౌరవించాలి, తండ్రిగా ఆనందించాలని దేవుడు ఎదురుచూస్తూ ఉన్నాడు. మనము కూడా ఆయన నామమును అంతే ఉన్నతముగా ఘనపరిచేవారముగా ఉండాలి. మన ప్రవర్తన ద్వారా ఆయన నామము దూషణకు గురికాకుండా ఉండాలి. కానీ ఈ రోజున అన్యజనుల వలన కాక క్రైస్తవుల ద్వారానే ఆయన నామము అవమానమునకు గురికావటము అనేది సిగ్గుచేటు. కేవలము మొదటి అడుగులోనే ఆగిపోకుండా రెండో అడుగులోనికి నడుద్దాము. లోకమునకు వేరుగా జీవించి పరలోక వారసత్వానికి సిద్ధపడదాము. మన తండ్రి పేరును ఉన్నత స్థానములో నిలబెడదాము

ఇక్కడ కూడా అస్తమయము, ఉదయము కలుగట మనము గమనించగలము. అయినా సరే దేవుడు విశ్రాంతి పొందినట్లుగా మనకు కనిపించదు. ఆయన తన బిడ్డల కోసం అనుకున్నది, తలంచినది సంపూర్తి చేసేవరకు ఎక్కడా విరామము ఇవ్వలేదు. కొంతపని కొద్దిరోజులు మిగిలిన పని తరువాత కొంతకాలమునకు చేయలేదు. ఒకేసారి ఆయన అనుకున్న పనులు అన్నీకూడా సకాలములో పూర్తిచేయటము జరిగినది. ఈ విధముగా పిల్లల కోసము అలుపెరగకుండా, అవిశ్రాంతముగా పనిచేసే తండ్రిని కలిగిన మనము నిజముగా ధన్యులము. ఇది నిజమైన ఆశీర్వాదము, దీవెన. ఆయన ఈ రెండవ దినమున చేసిన పని మహిమకరముగా ఉన్నను, ఆకాశమువలన మనుషులకు జరగబోతున్న తీర్పును బట్టి ఆయన దానిని మంచిదిగా చెప్పలేదు. మనము కూడా ఆయన చిత్తము నెరవేర్చే క్రమములో ఎక్కడా అలసత్వము ప్రదర్శించకుండా శక్తిలోపము లేకుండా పనిచేద్దాము. దేవుడు మనకు అవసరమైన తన సమస్త కృపను అనుగ్రహించును గాక ఆమెన్.

దేవుడు మిగతా దినములలో అనగా 3, 4, 5, 6 దినములలో చేసిన సృష్టిని గమనించగా ఆయన ఒకటి కన్నాఎక్కువ కార్యములు చేసినట్లుగా మనకు కనిపిస్తోంది. మొదటి 2 దినముల యొక్క సృష్టిని మనము గమనించినప్పుడు కేవలం ఒక కార్యము మనకు కనిపిస్తుంది. మొదటి 2 దినముల సృష్టిలోను వేరుపరచటము మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లు మనకు అర్థము అవుతూ ఉన్నది. దీనినిబట్టి దేవుడు అసలు పాపమును, చీకటిని సహించే స్వభావము లేనివాడు, అసలు రాజీపడే మనస్తత్వము కాదు అని మనకు రుజువగుచున్నది. వెలుగునకు ఆకాశమునకు ప్రత్యేకముగా ఒక దినము కేటాయించి వాటిని మలచినతీరు చూసినప్పుడు అవి దేవుని దృష్టిలో సంతరించుకున్న ప్రాధాన్యత, వాటికి ఉన్న విలువ, వాటి విషయములో దేవుడు కలిగిఉన్న జాగ్రత్త ఎలాంటివి అనేది మనకు అర్థము అవుతూ ఉంది. అందుకే వెలుగు, పరలోకము అనేవి పరిశుద్ధ గ్రంథము ఆపాతము ఎంతో అమూల్యతను సంతరించుకున్నాయి. అలానే మనముకూడా వాటిని అమూల్యముగా భావించి వాటి విషయములో శ్రద్ధ, భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఇవి లేకుండా మనము ప్రభువుని దర్శించలేము అని పరిశుద్ధ గ్రంథము హెచ్చరిస్తూ ఉంది. మనము దృష్టిలో పెట్టుకొనవలసిన మరొక అంశము దేవుని సామర్ధ్యమునకు వాటిని చేయటము చిటికెలో పని. అయినా ఆయన ఒక దినమెల్ల వాటిని చేసారు అంటే వాటి విషయములో ఉన్న శ్రమను, వాటిని perfect గా చేయాలి అని ఆయనకు గల passion కూడా మనము గుర్తించాలి. ఆయన passion మన passion గా మారాలి