దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. (1:26-28)
రాజుగా ఉండవలసిన వ్యక్తి అత్యన్నతమైన వ్యక్తిగత ప్రమాణములు కలిగి ఉండాలి. ధైర్యసాహసములు కలిగి ఉండాలి. తను ఎవరిని అయితే పరిపాలన చేస్తున్నాడో వారికి ఏ కష్టము రాకుండా సొంత బిడ్డలవలె చూసుకోవాలి. అయితే భూమిమీద మరొక మనిషిని ఏలటానికి, అధికారము చెలాయించటానికి దేవుడు మనిషిని నియమించలేదు. కేవలము చేపలను, పక్షులను, పశువులను, పురుగులను, సమస్తభూమిని ఏలటానికి మాత్రమే నియమించడము జరిగినది తప్ప వేరొక మనిషిని మాత్రము కాదు. రాజు మరొక రాజును పరిపాలించటము అనేది సాద్యము కాదు. అతను చక్రవర్తి అయి ఉండాలి. మనకు ఒకరే చక్రవర్తి. అది దేవుడు మాత్రమే. మనము చక్రవర్తులుగా మారాలి అంటే యుద్ధములు చేయాలి. అది అనేకమంది మరణమునకు, రక్తపాతమునకు కారణము అవుతుంది. అది దేవుని చిత్తమునకు వ్యతిరేకము, అందుకే ఎవరినీ ఆయన చక్రవర్తిగా నియమించలేదు. మనలను పరిపాలించే అధికారము ఆయన యొద్దనే ఉంచబడినది. రాజు అనగానే చాలామంది లోకము యొక్క ప్రమాణములను అనుసరించి అధికారము, దర్పముగాను భావిస్తారు. అయితే దేవుని రాజ్య ప్రమాణములను అనుసరించి మనము పరిపాలన చేయాలి. అది ఎలా ఉంటుంది అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మాదిరి చూపించటము జరిగినది. మరి మనము ఆ యా లక్షణములను నేర్చుకొన్నపుడు మాత్రమే ఆ post లో ఉంచబడతాము. అర్హత లేకుండా ఎవరము ఎంపిక చేయబడము అనేది మన అందరికీ తెలిసిన ఆ విషయమే .
దేవుడు తన ప్రమాణములను అనుసరించి ప్రేమ ద్వారా మాత్రమే పరిపాలన జరగాలి అని తెలియజేసారు. ఆయన స్వరూపము పొలికె కలిగినవారముగా మనము ఆయన లక్షణములను, ఆలోచనా విధానమును ప్రతిబింబించాలి. ఆయన నియమించిన రాజులుగా ఆయన పరిపాలనా విధానము మాత్రమే మనము అవలంబించాలి, మనకు ఇవ్వబడిన జీవరాసులను కూడా మనము అంతేవిధముగా ప్రేమించి సంరక్షించాలి. వాటి యొక్క నాశనమునకు మనము కారణము కాకూడదు. మనము రాజులుగా వాటి సేవలను వినియోగించుకొనవచ్చును కాని వాటి పోషణ, అభివృద్ధి, క్షేమము చూడవలసిన బాధ్యత కలిగి ఉన్నాము అని గ్రహించాలి. అలాగున చేయకపోయినా కూడా మనము రాజుగా ఉండటానికి, అర్హత కోల్పోతాము. మనము ఎలాగున పరిపాలన చేయాలి అనే విషయమును మనలను అనుదినము పరిపాలించి చూపించుట ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నారు. మనము మన బాధను చెప్పుకోవటానికి కనీసము నోరు ఇవ్వబడినది. అయితే వీటికి అది కూడా లేదు అని గ్రహించి ఆ మూగజీవుల పట్ల , జాలి, ప్రేమతో నడుచుకోవాలి తప్ప, కర్కశముగా ప్రవర్తించకూడదు. మన ప్రవర్తన విషయమై మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసిన అవసరము ఉన్నది అని గ్రహించి జాగ్రత్తగా నడుచుకోవాలి. నీ చుట్టూ ఉన్న ప్రకృతిని, జీవరాసులను ప్రేమిస్తున్నావా? వాటికి అవసరమైన సహాయము అందిస్తున్నామా? వాటికి హాని జరిగి, నాశనము అవుతూ ఉంటే నీ రాజ్యమే నాశనము అవుతుంది అని గ్రహించు.
రాజు తన ప్రజల యొక్క హృదయమును, జీవన పరిస్థితులను అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే సరిగా పరిపాలన చేయగలడు. ఆ దేవుడు కూడా మనలను ఆలాగున అర్థము చేసుకుని పరిపాలన చేయబట్టే మనము ఇలాగున ఉన్నాము లేకపోతే ఎప్పుడో మనము లయపరచబడేవారము. అలానే మానవుడు కూడా చేపలు, పక్షులు, పశువులు, పురుగుల యొక్క జీవన విధానము అర్థము చేసుకోవాలి. అపుడు మాత్రమే వాటితో సరైన సంబంధము కలిగి పరిపాలన చేయటానికి సాధ్యము అవుతుంది. దానివలననే మనము ఈ రోజున వీటిని అధ్యయనము చేయగలుగుతున్నాము, లేనియెడల దేవుని సృష్టిని అర్థము చేసుకోవడము సాధ్యము కాదు. మనము వాటి నివాసస్థలములను సమీపించి వాటిలో రోజుల తరబడి నివాసము చేసి, వాటి ప్రవర్తన గమనించినపుడే అది సాధ్యము అవుతుంది. అలానే దేవుడు కూడా ఎల్లప్పుడూ మనలో ఉండి మనలను అర్ధము చేసుకుని సహాయము చేస్తున్నారు. వీటి ప్రవర్తన లక్షణములు గ్రహించుట ద్వారా వాటి పైని మనము అధికారము చేపట్టాలి. ఇక్కడ దేవుడు అడవి జంతువుల గురించి వ్రాయలేదు. దానికి కారణము వాటి స్వభావము మనము నేర్చుకొనకూడదు అని. తరువాత నోవహుతో నిబంధన చేసినపుడు మాత్రమే మన బెదురు వీటికి ఉంచటము జరిగినది. ఈ వచనములలో వాటిని ఎక్కడా specific గా mention చేయలేదు. వీటి స్వభావములో ఉన్న మంచి లక్షణములను తెలుసుకుని మనము కూడా పాటించాలి. అందుకే దేవుడు మనకు ఆలోచనా శక్తిని, వివేకమును ఇవ్వడము జరిగినది. వీటిలో ఉన్న మంచి లక్షణములను నీవు ఎన్ని గ్రహించావు? నేర్చుకున్నావు?