దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను (1:14-19).
సూర్యుని యొక్క వెలుగును అనుసరించి వృక్షములు పిండి పదార్థము చేసుకొని తమ ఆహారమును సంగ్రహిస్తాయి. అలానే మనము ఆయన నీతి ద్వారాను, వాక్యము ద్వారాను జీవించాలి. మనము దేవుని యొక్క ఆజ్ఞలను, విధులను అనుసరించి నడుచుకోవటమే నీతి. అలాగున మనము చేసినప్పుడు దీర్ఘాయువు, సుఖజీవముతో గడుచు సంవత్సరములు మనకు లభిస్తాయి అని చెప్పి లేఖనము తెలియజేస్తుంది. మనము మన ఆత్మకు అవసరమైన పోషణ అందించాలి అంటే ఇది ఒక్కటే మార్గము. సూర్యుని వెలుగు సోకని చెట్టు ఎలాగైతే ఎండిపోయి, చచ్చిపోతుందో మనము కూడా ఆయన వెలుగును కలిగి లేకపోతే జీవమును కోల్పోయి మరణిస్తాము. మన శరీరమును బట్టి మనము తీసుకుంటున్న భౌతిక ఆహారమును బట్టి మనము పేరునకు లోకములో బ్రతికి ఉంటామే తప్ప, ఆత్మ పరముగా దేవుని దృష్టిలో మరణించినవారము అవుతాము. కేవలము శరీరము విషయములో బ్రతికి ఉన్నవాడు చివరకు నరకానికి చేరుకుంటాడు. ఆత్మ విషయములో బ్రతికి ఉన్నవాడు మాత్రమే పరలోకమునకు, దేవుని సన్నిధికి చేరుకుంటాడు. మన జీవితములో ఆయన నీతికి, వెలుగునకు ఉన్న స్థానము చాలా ప్రాముఖ్యమైనది, ఎనలేనిది. నీవు ఆయన వెలుగును వెంబడించి నీ ఆత్మను పోషించుకొనుచున్నావా? లేక కేవలం శరీరమునే పోషిస్తున్నావా? నీ జీవము ఎక్కడ ఉన్నది అనేది చూసి సరిచేసుకొనుము
చీకటిగల ప్రదేశములలో వెలుగిచ్చు దీపమువలె వాక్యము ఉన్నది అని పరిశుద్ధ గ్రంథములో సెలవిచ్చిన ప్రకారము, సంఘము దేవుని యొక్క వాక్యమును చేతపట్టుకుని చీకటితో నింపబడిన లోకములో వెలుగిచ్చు దీపమువలె ఉన్నది. ఈ యొక్క వెలుగునకు ఆకర్షింపబడినవారి హృదయములో ప్రభువు తెల్లవారి వేకువ చుక్కవలె ఉదయిస్తారు. మనలోపల హృదయములో ఆయన వెలుగు నివాసము చేయగలిగినప్పుడే మనలోనుంచి ఇతరులకు వెలుగు చూపించగలము. మనలో వెలుగు లేనియెడల గణగణ మోగు కంచువెలె మాటలతోనే ప్రభువు గురించి చెప్పగలుగుతాము తప్ప ఆయన వాక్యమును అనుసరించిన జీవితము మనద్వారా లోకమునకు చూపించలేము. మనము కలిగి ఉన్నదే లోకమునకు పంచగలము. మనలో ఉన్న ఆయన వాక్యము యొక్క శక్తి, జీవము మాత్రమే ఎదుటివారి జీవితములమీద ప్రభావము చూపించగలుగుతుంది. మన ఆలోచనలద్వారా పుట్టుకు వచ్చిన మాటలు ఎన్ని అయినా వాటి వలన ప్రయోజనము శూన్యము. మనమాట, జీవితము వేరుగా ఉన్న యెడల ఎదుటివారు ప్రభువునకు దూరమయ్యే ప్రమాదము ఉన్నది. కాబట్టి సంఘము ఆ తెల్లవారి వేకువచుక్క అయిన ప్రభువు మన హృదయములో పుట్టులాగున శ్రమించాలి. చీకటి ముగిసి ఉదయకాలము వచ్చేసరికి రక్షణద్వారా వారిని ప్రభువు హస్తములకు అప్పగించాలి. ఉదయమున ఆయనకు అప్పగించిన తరువాత సంఘము ఆయన చాటున మరుగై ఉండాలి తప్ప దేవునికి అతనికి మధ్యలో రాకూడదు.
ఈ విధముగా రక్షణ జ్ఞానముద్వారా వెలుగులోనికి ప్రవేశించిన మనము ఆయన ద్వారా బోధించబడాలి. ప్రభువు యొక్క వెలుగులో ఆయన చిత్తమును మార్గములను తెలుసుకుంటూ సంపూర్ణతలోనికి మనము నడిచి నీతిమంతులుగా మారాలి. చిన్న వేకువ చుక్క తో మొదలుపెట్టిన మన ప్రయాణము మధ్యాహ్నపు వెలుగుగా మారాలి. ఈ యొక్క క్రమములో సంఘము mentor గా పని చేయాలి తప్ప ప్రతిదీ తన ద్వారానే జరగాలి అన్నట్లు ప్రభువునకు, విశ్వాసికి మధ్య అడ్డుబండగా రాకూడదు. విశ్వాసులను ప్రభువు యొక్క శిష్యులుగా తీర్చిదిద్దిన తరువాత వారిని ప్రభువు చిత్తమునకు అప్పగించాలి. విశ్వాసులు నీతిమంతులుగా దేవుని ద్వారా తీర్చిదిద్దబడిన తరువాత సంఘమునకు వేరుగా కాకుండా సంఘముతో కలిసి collaboration గా పనిచేయాలి. ఆకాశములో చంద్రుని చుట్టూ నక్షత్రములు నిలబడినట్లు నీతిమంతులు సంఘము యొక్క పరిచర్యలో కుడి, ఎడమ భుజములుగా నిలబడి అందరమూ ఒకటే కుటుంబముగా లోకమునకు కనబడాలి. ఆకాశములో నక్షత్రములు వివిధ ప్రదేశాలలో దూరముగా ఉన్నను అవి అన్నీఒకే team లాగా ఉంటాయి. సంఘము విశ్వాసులు కూడా దేవుని పరిచర్య నిమిత్తము వివిధ ప్రాంతములలో ఉన్నను ఒకే ఉద్దేశ్యము కలిగి team లాగా ఉండాలి. సంఘము, విశ్వాసులు hand in hand కలిసి ఆయన సంపూర్ణతలోనికి నడవాలి. మరి నీ సంఘము నీకు మధ్య సంబంధము ఎలాగ ఉన్నది? ఆయన సంపూర్ణ లోనికి నీవు నడుస్తున్నావా?