దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను (1:9-10).
ఇక్కడ ఆరిన నేలకు, జలరాశికి ఆయన పేరు పెట్టటము జరిగినది. నీటిలో ఉన్న నేలకు కాకుండా, ఆరిన నేలకు ఆయన పేరు పెట్టటమును బట్టి మనము ఎప్పుడు ఆయన దగ్గర గుర్తింపు పొందుతాము అనేది కూడా అర్థము అవుతుంది. మనము దేవుని గుర్తించటము మాత్రమే కాకుండా ఆయన మనలను గుర్తించేలాగున లోకమునకు వేరుపడాలి. ఆయన ద్వారా గుర్తింపు, పేరు పొందటము అనేది మన జీవితములో నిజమైన అదృష్టము. లోకములో మనపైన అధికారి గుర్తిస్తేనే ఉప్పొంగిపోయే మనము, దానికోసము ఎంతో కష్టపడి పనిచేసే మనము, దేవుని గుర్తింపుకొరకు ప్రాకులాడకపోవుట శోచనీయము. జలములకు ఆయన పెట్టిన పేరును బట్టి అవి ఒకటికన్నా ఎక్కువ అని మనకు తెలుస్తుంది. అందుకే సముద్రములు అని బహువచనము ఉపయోగించటము జరిగినది. ఇలా వేరగుట దేవుడు మంచిది అని పలుకటము జరిగినది. దీనిని బట్టి మూడవ దినమున కూడా దేవుడు మెరుగుపరచటములో నిమగ్నము అవుట గమనిస్తే మనము ఎంతలా మలినపడకుండా జీవించాలి అనేది అర్థము అవుతూ ఉంది. వేరుపరచకుండా ఆయన కార్యములు మన జీవితములో మొదలుకావు అని కూడా గ్రహించాలి. ఇవి అన్నీ చేసిన తరువాతనే భూమిమీద జీవము అనేది ప్రారంభము అగుట మనము చూడగలము. మన జీవితములో కూడా నిజమైన జీవము ప్రారంభము కావాలి అంటే ముందు వేరుపడటం జరగాలి. ఈ రోజునుంచే ఈ ప్రక్రియలో దేవునికి సంపూర్ణముగా సహకరిద్దాము.
ఈలాగున ముందుగా వేరుపరచిన దేవుడు తరువాతి దినములలో ఎక్కడా వేరుపరచటము మనము గమనించము. వేరుపరచిన వాటిని దేవుడు ఏమి చేశారు, వాటిని ఎలా ఉపయోగించారు అనేది మిగిలిన దినములలో చేసిన సృష్టి ద్వారా మనకు వివరించబడినది. overall గా మొదటి దినములలో వేరుపరచిన వాటిని ఆయన చివరి మూడు దినములలో నింపినట్లుగా మనకు అర్థము అవుతూ ఉంది. కాబట్టి వేరుపరచి ఖాళీ చేశాకనే దేవుడు తన క్రొత్తదనముతో నింపటము ప్రారంభిస్తారు అని అర్థము అవుతుంది. కాని మనలో చాలామందిమి దేవుడు ఆశీర్వదించి నింపిన తరువాతనే వేరుపడదాము. దేవునికి ఇష్టములేనివి వదిలివేద్దాము అనుకుంటారు. కానీ లేఖనము దీనిని సమర్థించటము లేదు అని మనకు స్పష్టముగా దేవుని యొక్క కార్యముల ద్వారా అర్థము అవుతుంది. మనము ముందుగా ఇష్టములేనివి వదులుకోవటానికి ఇష్టపడితేనే అసలైన జీవితమును పొందుకుంటాము. మనము దేవుని పద్ధతిని అనుసరించే ప్రవర్తించాలి, నడుచుకోవాలని తప్ప దేవుడిని మన పద్ధతుల్లో పనిచేయమని అడగకూడదు. మనము ఆయన పద్ధతిలోనికి వెళ్లేంతవరకు ఆయన ఎదురుచూస్తారు తప్ప, ఆయన రాజీపడి మన పద్ధతిలోనికి రారు అని మనము గ్రహించాలి. అది గ్రహించి మనమే ఈరోజు నుంచి దేవుని దగ్గరకు వెళదాము. మన జీవితమును అందముగా తీర్చిదిద్దుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయును గాక ఆమెన్.
స్తుతి
- లోక జ్ఞానమును, దాని ఇబ్బందులను మననుంచి దూరము చేసినందుకు
- నిరుపయోగ దశనుండి ఉపయోగపడే విధముగా మన హృదయములను మలచినందుకు
- సముద్ర ప్రమాణముల ద్వారా దేశములు, ప్రజల మధ్యన సంబంధములు ఏర్పాటుచేసి జీవన ప్రమాణములు పెంచి, సువార్త వ్యాప్తికి కూడా సహకరిస్తున్నందుకు.
ఆరాధన
- లోకము మన హృదయములలో నుండి పూర్తిగా ఇంకిపోయేలా చేసి ఆయన వాక్యమును అనుసరించి జీవించుట ద్వారా దేవుని ఆరాధించాలి.
- మన హృదయమును సంపూర్ణముగా ఆయనకు అప్పగించుట ద్వారా ఆయనను ఆరాధించాలి.
హెచ్చరిక
- లోకమును మన హృదయములో నుంచి వేరుచేయకపోతే మంచిది కాదు. తీర్పునుకు, శిక్షకు, నాశనమునకు గురికావలసి వస్తుంది.
సత్యము
- ఎంతటి నిరుపయోగమైన దానిని అయినా దేవుని చేతులకు అప్పగిస్తే ఆయన దానిని ఉపయోగకరమైన దానిగా చేస్తారు.
- దేవుడు అవసరమైన దానిని వేరు చేశాకే మన జీవితములో నింపుదల మొదలుపెడతారు