వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను (1:4).

వెలుగును చీకటిని వేరుపరచుటను బట్టి దేవుని వెంబడించు మనము చీకటి సంబంధమైన కార్యములకు దూరముగా ఉండమని కానీ చీకటిలో నివసిస్తున్న ప్రజలను ద్వేషించమని కాదు. అలాగైతే అది దేవుని స్వభావమునకు విరుద్ధము. మనము వారి క్రియలను ఆలోచనలను ద్వేషించాలి తప్ప వారిని కాదు. అందుకే దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు తప్ప పాపమును కాదు. మనము అందరముకూడా చీకటినుండి వెలుగులోనికి నడిపించబడ్డాము అని మర్చిపోకూడదు. మన రక్షణదినము ముందుగా వచ్చినది. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆకర్షించినప్పుడు, ప్రతిస్పందించాము కాబట్టి మనము ముందుగా వెలుగులోనికి వచ్చాము. వారికి మరుసటి దినమున రక్షణ దొరకవచ్చు. ఇద్దరము దేవునికి పిల్లలమే. ఆయనకు రెండు కన్నులవంటి వారము. మనము వెలుగులో నివసించి ఆ జీవితము ఎంత అందముగా ఉంటుందో వారు కోల్పోతున్నది ఏమిటో చూపించినపుడు వారు కూడా ప్రతిస్పందించే అవకాశము ఉంటుంది. కేవలము మనము మాటలు మాత్రమే చెప్పి అది జీవితంలో చూపించటములో విఫలము చెందితే వారికి మనము అడ్డుబండగా మారే అవకాశము ఉన్నది. అందుకే మన క్రియలు లోకమునకు వెలుగుగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. కేవలము మాటలు మాత్రము చెప్పేవారుగా మాత్రము కాదు. ఆ వెలుగు భూదిగంతములవరకు ప్రయాణముచేసి చీకటిని పారద్రోలాలి అనేది ఆయన కోరిక. అందుకే ఇకనుంచి ఆయనకు సజీవమైన ప్రతికలుగా మారదాము. మన సహోదరులను రక్షించుకుందాము

ప్రభువైన యేసుక్రీస్తువారు లోకములో ఉన్నప్పుడు వెలుగు ఉన్నంతవరకే మనము పనిచేయగలము. చీకటి వచ్చుచున్నది అప్పుడు ఎవరుకూడా పనిచేయలేరు అని తెలియజేశారు. వెలుగులో ఒక వ్యక్తి పనిచేస్తే అది అందరికీ కనిపిస్తుంది. ఒకరు చేస్తున్న క్రియలు మంచివా చెడ్డవా వారి హృదయము ఎలాంటిది అనేదికూడా ఈ యెడబాటు నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి వెలుగు దగ్గరకు/లేదా దేవుని దగ్గరకు వచ్చి పనిచేయడానికి ఇష్టపడితే అతని హృదయము యదార్ధమైనది, అతని క్రియలు మంచివి అని అర్థము. ఒక వ్యక్తి చీకటిలో మాత్రమే పని చేయడానికి ఇష్టపడితే అతని హృదయము యదార్థమైనది కాదు. అతని క్రియలు చెడ్డవి. దీనినిబట్టే మనము ఎక్కడ ఉన్నాము అనే విషయము మనకు తేటతెల్లమవుతుంది. ఒకని హృదయము సరిగా లేకపోతే అతను వెలుగు దగ్గరకు రాడు అని ప్రభువైన యేసుక్రీస్తువారే స్వయముగా సెలవిచ్చారు. కాబట్టి వెలుగులో ఉండాలి అని నీవు నిర్ణయము తీసుకుంటే నీ క్రియలు అందరికీ కనిపించేలా ఉండడానికి నీవు ఇష్టపడాలి. రహస్యము అనే పదమునకు ఇక్కడ స్థానము లేదు. మనలో ఉన్న పాపమంతా విడిచిపెట్టి ఆయన దగ్గరకు రావాలి. లేకపోతే మనము సిగ్గుపడవలసిన పరిస్థితి తలెత్తుతుంది. మనము ఇకనుంచి ఆయన ఎదుట, లోకము ఎదుట పారదర్శకముగా (transparent) నివాసము చేద్దాము

స్తుతి

  1. మనకు ఇచ్చిన ప్రతిదీ శ్రద్ధగా పరిశీలన చేసినందుకు
  2. మంచికి, చెడుకు ప్రమాణము నిర్ణయించినందుకు
  3. చీకటి మనలను మరలా బాధించకుండా వేరుపరిచినందుకు
  4. మన పనులను మనము పరిశీలించి మంచిగా ఉండేలా చూసుకోవాలి అని నేర్పించిన పాఠము కొరకు

ఆరాధన

  1. అంధకార క్రియలలో పాలుపంపులు పొందకుండా వాటికి వేరుగా ఉండి దేవుని ఆరాధించాలి
  2. మన క్రియలు లోకమునకు వెలుగుగా ఉండేలా జీవించి కొందరిని రక్షించి ఆయనను ఆరాధించాలి

హెచ్చరిక

  1. మనము వెలుగులోనికి వచ్చిన తరువాత చీకటిలో పడిపోకుండా జాగ్రత్తపడాలి. అది వెలుగు వెనకాలే ఎప్పుడూ కాచుకుని ఉంటుంది.

సత్యము

  1. అంధకారము మనమీద పెత్తనము చెలాయించడానికి దేవుడు అంగీకరించరు. ఎంతటి శక్తివంతమైన చీకటిని అయినా వెలుగు పారద్రోలుతుంది
  2. వెలుగు అనేది దేవుడు మనకు దయచేసిన రక్షణ కవచము. చీకటి దానిని దాటి రాలేదు
  3. మనము వెలుగు సంబంధులుగా ఉండాలి అనేది దేవుని చిత్తమై ఉన్నది