భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను (1:2).

ఇది దేవుడు సృష్టి చేయటము ప్రారంభించినప్పుడు భూమి ఉన్న ప్రాథమిక స్థితిని మనకు తెలియజేస్తుంది. చూడదగిన అందము అనేది అందులో ఏదీకూడా లేదు. ఒక క్రమపద్ధతిలో అమర్చబడలేదు. అలాంటి స్థితినుంచి ఆరవ దినము ముగిసేలోగా దేవుడు ఈ విశ్వంలో మరి ఏ ఇతర గ్రహమునకు లేనటువంటి అందముతో పొందికగా తీర్చిదిద్దడము జరిగినది. మన వర్ణణకు అందనటువంటి ఎంతో అందమైన ప్రకృతి దృశ్యాలు ఈ రోజున మన కనులముందు నిలిచి ఉన్నాయి. మిగతా గ్రహములు ఇంకను ఇలానే నిరాకారముగాను, శూన్యముగాను ఉండడము మనము గమనించగలము. ఈ అందము అంతా దేవుడు తన స్వహహస్తములతో తీర్చిదిద్దినదే తప్ప, ఇందులో మానవ హస్త, మేధో ప్రమేయము ఎంతమాత్రమును లేదు. ఈ రోజుల్లో మనము ఎంత తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసినా అవి అన్నీకూడా ఆయన చేసిన వాటి యొక్క నకలును పోలినవే తప్ప కొత్తరకం ఏదీకూడా లేదు అని గుర్తించాలి

ఈ ఆకారంలేని భూమిని జలము కమ్మియున్నది. దానిమీద చీకటి ఆవరించబడియున్నది. ఈ చీకటి సాతాను లేదా చెడునకు సంబంధించిన చీకటి కాదుగాని వెలుగు లేనటువంటి పరిస్థితుల్లో ఆవరించిన చీకటిగా మనము అర్థంచేసుకోవాలి.

ఈ పరిస్థితుల్లో ఉన్న భూమిపైన దేవుని ఆత్మ అల్లాడుతున్నట్లుగా మనము చూడగలము. దానిని ఏలాగు అందంగా తీర్చిదిద్దాలి అనే ప్రయత్నంలో ఆయన నిమగ్నమైనట్లు మనకు అర్థం అవుతుంది. ఈ ఆత్మయే ఇప్పుడు మనలో నివాసము చేయుచున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే నిరాకారమైన ఈ భూమిని అందరూ చూడాలి అనిపించే విధముగా రమ్యముగా తయారుచేయడం జరిగినది.

ఇక్కడ భూమి ఉన్న పరిస్థితి మనము గమనించినప్పుడు గర్భములో మనము పిండముగా ఉన్న స్థితికి మాదిరిగా ఉన్నది. అప్పుడు కూడా దానికి ఒక ఆకారము లేదు. కానీ దినములు గడిచేకొద్దీ ఆయన స్వహస్తములతో మనలను రూపించి ఒక అందమైన ఆకృతి, సంక్లిష్ట శరీర నిర్మాణము మనకు దయచేసి ఈ లోకములోనికి తీసుకుని వచ్చారు. మనలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ద్వారా ప్రత్యేకమైన శ్రద్ధతో చేయబడినవారము. అందుకే అందరి పోలికలు ఒకేలా ఉండవు. ఆయన చేతులే కానీ మెషిన్లు మనలను తయారుచేసి రూపించలేదు.

గర్భంలో ఉన్నప్పుడు కూడా మనము చీకటిలోనే గడుపుతాము అయితే ఆ అంధకార పరిస్థితిలో మనలను విడిచిపెట్టకుండా మనతో ఉండి మనలను రూపించిన పరిశుద్ధాత్మ దేవునికి ఎంతైనా మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన ఎక్కడో పరలోకములో ఉండి తన దూతల ద్వారా ఆజ్ఞ ఇచ్చి ఈ కార్యక్రము జరిగించలేదు కానీ మనతోపాటే ఉండి, ఆ అంధకారములో పనిచేసారు అనే విషయం మర్చిపోకూడదు. ఇలాగ ఆదరించే దేవుని మనము ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. ఆయన హృదయములో మనము ఎప్పుడూ ఉన్నతమైన స్థానంలోనే ఉంటాము. మరి నీ హృదయములో ఆయన స్థానం ఎక్కడ?

ఈ అంధకార పరిస్థితి అనేది మన జీవితములో వెలుగును కోల్పోయినప్పుడు కూడా సంభవిస్తుంది. అప్పుడు కూడా మన జీవితము నిరాకారముగాను, శూన్యముగాను ఉండిపోతుంది. అంధకారము మన మనస్సును ఆవరిస్తుంది. దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టాడు అనే సాతాను అబద్ధాలు మన చెవులలో మారుమ్రోగుతూ ఉంటాయి. కానీ ఆయన నీ జీవితమును రూపించే పనిలో ఆ అంధకారంలో నీతోపాటు నిమగ్నమై ఉన్నాడు అనే విషయం మర్చిపోవద్దు. ఆయన వెలుగు ప్రసరింప చేసినప్పుడు అది మన కనులకు సాక్షాత్కరిస్తుంది. ఆయన ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడు.

ఆయన భూమిని రూపించినప్పుడు అనుదినము కొంచెము, కొంచెము పని చేసినట్లుగా మన జీవితంలో కూడా step by step పని చేస్తారు. మార్పు అనేది తెల్లవారేసరికి రావడము లేదు అని విచారము చెందకు. ఆయన పనిచేస్తున్నారు అని విశ్వాసముంచు. ఆయన నేర్పరితనము, శక్తిమీద భరోసా ఉంచు. భూమిని విశ్వమును తీర్చిదిద్దటముతో పోల్చుకుంటే నీ సమస్య అంత పెద్దది సంక్లిష్టమైనది ఏమీ కాదు. ఆయన నిర్ణీత కాలమున సమస్తమును చక్కబెట్టి సంపూర్తి చేయగలడు

నశించిన దానిని వెదకి రక్షించడానికే ఆయన వచ్చాడు. కాబట్టి నిన్నుకూడా ఆయన రక్షిస్తాడు. నీవు సహకరించు చాలు ఒక అందమైన, రమ్యమైన జీవితము నీ సొంతము అవుతుంది