దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను (1:11-13).

ఏవైనా రెండు చెట్లు ఒకదానికి ఒకటి రాసుకుని ఎక్కువ ఒత్తిడి కలిగించినప్పుడు వాటి మధ్యన అగ్ని అనేటటువంటిది పుట్టి ఆ ప్రదేశము అంతటినీ కూడా దహించివేస్తుంది. అలానే మనుషుల మధ్యన ఐక్యత అనేది లేకుండా మనలో మనము గొడవలు పడితే అది మన ఉనికినే దహించివేసి చివరకు బూడిదనే మిగుల్చుతుంది. చిన్న నాలుక జీవితములను పాడుచేయు అగ్ని పుట్టిస్తుంది అని యాకోబు పత్రికలో వ్రాసిన ప్రకారము, మనము కూడా ఎదిగేకొద్దీ మన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. సహనము, క్షమాగుణము అనేవి పెంచుకోవాలి. అందుకనే దేవుడు ఐలాంటి పరిస్థితులు సంభవించి వినాశనము అనేది జరగకూడదు అని నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనే ప్రధానమైన ఆజ్ఞ ఇవ్వటము జరిగినది. మనలో ఐక్యత కలిగి ఉండుట అపవాదికి ఇష్టములేదు కనుకనే మనలో మనకు అనేక కలహములు కలిగిస్తూ ఉంటాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అని పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చినట్లుగా మనము కూడా అపవాది తంత్రములకు చోటివ్వకుండా ప్రభువు మనలను ప్రేమించి, ఓర్చుకున్నలాగున మనము కూడా ఇతరులను ప్రేమించి ఓర్చుకుందాము. దానిద్వారా మనము దేవుని పిల్లలము అని అందరికీ చాటి చెప్ధాము. నీలో ఎదుటివారిని క్షమించలేని గుణము ఉంటే ఈ రోజే ప్రభువు సహాయము అడుగు. ఐక్యతకు భంగము కలిగించే ప్రతి అడ్డుతీగెను తీసి బయట పారవేయుము

చెట్లు అనేవి లోకములో ఒక ప్రాంతమునకు మాత్రమే పరిమితము కాకుండా భూమి అంతటా వ్యాపించి ఉంటాయి. ఒకే రకమైన వాతావరణ పరిస్థితులను కాకుండా అన్ని రకముల వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడి పెరుగుతాయి. భయంకరమైన వేడి కలిగిన ఎడారి ప్రాంతములోను ఉంటాయి, బాగా శీతల ప్రదేశములలోను, మంచు ప్రాంతములో కూడా పెరుగుతాయి. అలానే దేవుని యొక్క పిల్లలుకూడా ప్రతి వాతావరణ పరిస్థితి తట్టుకొని నిలబడాలి. ఎక్కడ అయినా ఎదగాలి. అంతేకాని కేవలము ఒక ప్రాంతమునకు, పరిస్థితికి మనము పరిమితము కాకూడదు. భూమి అంతటా మనము విస్తరించాలి, భూదిగంతముల వరకు ఆయన కుమారుని గూర్చిన సువార్త చేరాలి అనేది దేవుని యొక్క అభీష్టము. అందుకే మనము ఆయా ప్రాంతములలో నివసించే ప్రజలకు అందుబాటులో ఉండాలి. extreme conditions లో ఉండి బాధపడే ప్రజలకు motivation గాను, మార్గదర్శకముగాను ఉండాలి. అప్పుడే అందరి యొక్క ఆత్మీయ అవసరతలు తీర్చటానికి సాధ్యము ఆవుతుంది. మన ఫలము ప్రజలకు అందకపోతే అది మగ్గిపోయి రాలిపోయి పనికిరాకుండా పోతుంది అని జ్ఞాపకము చేసుకుని, మన జీవితము ఎదుటివారికి మంచి సాక్ష్యముగా మారే విధముగా జీవించాలి. మనతోపాటు మన పొరుగువారిని కూడా రక్షించుకోవాలి. అందరమూ ఒకే తండ్రి బిడ్డలము, ఒకే కుటుంబము, రక్తసంబంధీకులము, సహోదర సహోదరీలము అనే పరమ సత్యము ఎప్పుడూ మర్చిపోకూడదు.

ఒక ఫలభరితమైన జీవితము ఎలా వుండాలి అనేది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితము ద్వారా మనకు గొప్ప మాదిరిని చూపించారు. ఆయన ఏదో sample కోసము అనో, demo కోసము అనో ఒకటి, రెండు రోజులు లేదా వారము రోజులు జీవించటము కాకుండా ఏకముగా 33.5 సంవత్సరములు జీవించి చూపించారు. పరిశుద్ధ గ్రంథములో వ్రాయించబడిన అనేకుల జీవితములు ద్వారా మనకు ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయి, వాటిని ఎలాఎదుర్కోవాలి అనే విషయములు మనకు స్పష్టముగా వ్రాయించి పెట్టారు. కీర్తనలు 1వ అధ్యాయములో చెప్పబడిన విధముగా మనము ఆకు వాడక ఫలించే వారముగా వుండాలి అంటే దివారాత్రము వాక్యమును ధ్యానించాలి. అది కాకుండా వేరే short cut methods ఏమీకూడా లేవు అనే విషయము గుర్తించాలి. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్నది అనే మాటలో హెచ్చరికతో పాటు సత్యము కూడా దాగియున్నది. అది ఏమిటి అంటే మనము ఫలించకపోతే దానికి మూలకారణమైన వేరును మనలోనుంచి నరికివేయాలి అని. దేవునితో సహవాసము చేసినప్పుడు ఆయన వెలుగులోనికి వచ్చినప్పుడే ఆ తీగలు, వేరులు అనేవి మనకు సృష్టముగా కనిపిస్తాయి. మన అంతట మనము వాటిని గుర్తించలేము. కాబట్టి పరిశుద్ధ గ్రంధము యొక్క ఆవశ్యకతను మన ఎదుగుదల విషయములో గుర్తించి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మనలోని పనికిరాని వేరులను తీసేసుకుందాము. ప్రభువు చూపిన మాదిరి వెంబడిద్దాము