దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించువాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను (1:20-23).
చేపలకు అవసరమైన సమస్త ఆహారమును దేవుడు సముద్ర జలములలోనే దయచేయటము జరిగినది. అవి ఆహారము కొరకు ప్రత్యేకించి బయటకి రావలసిన అవసరము లేదు. అయితే వాటిని పట్టుకోవాలి అని మనుష్యులు ప్రయత్నము చేసినపుడు వలలు పెట్టటము లేదా గాలములకు ఏదైనా ఆహారము తగిలించి వాటిని నీటిలో విడిచిపెట్టటము జరుగుతుంది. అది సముద్ర జలముల లోపల ఆహారము కదా అని చేప గుర్తించకుండా దానికోసము ఆతురపడినప్పుడు అది గాలమునకు చిక్కుకుంటుంది. లోతులేని ప్రదేశములోనే అది సంభవిస్తుంది. దీనినిబట్టి మనము గ్రహించవలసినది మనము లోతునకు వెళ్లకపోతే అపవాది యొక్క గాలమునకు చిక్కే అవకాశము ఉంది. మనకు దేవుడు ఇచ్చిన దానితో సంతృప్తిపడకుండా ఏదోకావాలి అని అర్రులు చాచినా కూడా ఇలాంటి ప్రమాదములు జరిగే అవకాశము ఉన్నది. దేవుడు మనకు అవసరమైన సమస్తమును ఆయన వాక్యములో పొందుపరచారు. అదికాకుండా మనకు బయటనుంచి వచ్చే ఏ విధమైన జ్ఞానము కానీ ఆహారము గాని ఆకర్షణ కానీ మనకు అవసరము లేదు. ఇలాంటి ప్రయత్నములు చేసి తమ రక్షణ కోల్పోయి నాశనమునకు గురిఅయిన వారు చాలామంది ఉన్నారు. లేఖనములో కూడా కొన్ని సాక్ష్యములు కలవు. ఇప్పటికైనా మనము మేలుకొని జాగ్రత్తగా మెళుకువ కలిగి ఉందాము. ఆ ఆపదలో మనము పడకుండా ఇన్నిదినములు కాపాడిన దేవునికి కృతజ్ఞతా స్తుతులు.
విధేయత విషయములో కూడా చేపలు మనకు మాదిరిగా ఉన్నాయి. దేవుని యొక్క మాటను అనుసరించి ఆ సమయమునకు పెద్ద చేప యోనా ఉన్న ఓడ దగ్గరకు చేరుకున్నది. ఆ సమయములో సముద్రములో గొప్ప తుఫాను చెలరేగి అలజడి అల్లకల్లోలముగా ఉన్న తనకు కలిగే ఇబ్బందిని, ప్రాణపాయమును లెక్కచేయకుండా, ఏ విధమైన సాకులు చెప్పకుండా సమయమునకు అక్కడ అందుబాటులో ఉన్నది. యోనాను మింగిన తరువాత అతని ప్రాణము నిమిత్తము ఉపవాసము ఉన్నది. ఆ మూడు దినములలో దాని జీర్ణ ప్రక్రియ అదే ఆపివేసుకున్నదో లేక దేవుడు ఆపేసారో మనకు తెలియదు కానీ ఉపవాసము చేసి యోనా ప్రాణముతో ఉండటానికి సహకరించింది. కొన్ని వందల కిలోమీటర్ల దూరము ప్రయాణము చేసి దేవుడు నిర్ణయించిన స్థలములో యోనాను కక్కివేసి silent గా తన నిర్దేశిత ప్రదేశమునకు వెళ్ళిపోయినది. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటను అనుసరించి రెండు సందర్భములలోను, తమ ప్రాణాలను సైతము లెక్కచేయకుండా వలలోనికి వచ్చి చేరాయి. మరి మనయొక్క విధేయత ఎలా ఉన్నది అనేది కూడా మనము సరిచూసుకోవాలి. మన ప్రాణములకు నష్టము అయినా, ఒకవేళ వాటిని కోల్పోవలసి వచ్చినా కూడా అందుకు సిద్ధముగా ఉన్నామా లేక కేవలము లాభము సంపాదించుకునేంత వరకే దేవునికి విధేయత కలిగి ఉన్నామా? సైజులో చిన్నవి అయినా కూడా మనకు ఎన్నో పాటములను నేర్పిస్తున్నాయి. ఐప్పటికైనా మన ప్రవర్తన సరిచేసుకుందాము.
ఆకాశ విశాలములో ఎగురునట్లుగా సృజింపబడిన పక్షులు మనలోని ప్రార్ధనా జీవితమునకు సాదృశ్యముగా ఉన్నాయి. అవి భూమిమీద నివసించే ఏ ప్రాణితో పోల్చుకున్నా కూడా దేవుని నివాస స్థలమునకు సమీపముగా చేరగలుగుతాయి. పక్షులు అనుదినము ఆకాశములో విహారించునట్లు మనము కూడా ప్రార్థనద్వారా దేవుని సమీపమునకు చేరాలి. ఒకేరోజున వీటిని సృష్టించటము ద్వారా వాక్యము అనుసరించి జీవించటానికి, ప్రార్థనకు మధ్యన గల సంబంధమును దేవుడు మనకు వివరిస్తున్నారు. కేవలము ఏదో ఒకటి ఉంటే మనకు సరిపోదు రెండూ రెండు కళ్ళులాగా ఉండాలి. మనము వాక్యము ద్వారా గ్రహించిన సంగతులు మన జీవితములో నెరవేరాలి లేదా చేయాలి అంటే మనకు దేవుని సహాయము తప్పనిసరి. ఆ సహాయము మనకు అన్ని విధములుగా ప్రార్ధనద్వారా లభిస్తుంది. ప్రార్ధన యొక్క ఆవశ్యకతను నేను ప్రత్యేకించి వివరించి చెప్పవలసిన అవసరము లేదు. దేవుని ఎరిగిన ప్రతి వ్యక్తి కూడా దానియొక్క విలువ, అవసరము తెలుస్తాయి. తాను దేవుని వెంబడిస్తున్నాను అని చెప్పి, ప్రార్థన చేయని వ్యక్తి అబద్ధకునితో సమానము. జీవము కలిగిన ప్రతి జీవి కలిగి ఉండిన గొప్ప ఆశీర్వాదము అదృష్టము ఈ ప్రార్థన. దీనిద్వారా మనము సృష్టికర్త అయిన దేవునితో నేరుగా one to one basis మీద మాట్లాడగలుగుతున్నాము అనే ఆలోచన చాలా exciting గా థ్రిల్లింగ్ గా ఉంటుంది. నీవు ప్రార్థనద్వారా ఆయనతో మాట్లాడే అనుభవము కలిగి ఉన్నావా?