ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను (1:1).

శరీరము కన్నాకూడా ఆత్మకు ఆయన అధిక ప్రాధాన్యత ఇచ్చారు

సృష్టి చేయబడిన విధానము మనము గమనించినప్పుడు దేవుడు శరీరము కన్నాకూడా ఆత్మకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది. భూమిమీద మనిషి శరీరంతో జీవించడానికి అవసరమైన పరిస్థితులు, శరీరము యొక్క ఆకృతి మనము గమనించినప్పుడు, అవి పరలోకములో నివసించుటకు చేయబడిన పద్ధతుల కన్నా తక్కువస్థాయిలో ఉన్నట్లు గమనించగలము. ఉదాహరణకు భూమిమీద మామూలు నేలమీద నడిచిన మనము పరలోకములో బంగారంతో చేయబడిన నేలమీద నడుస్తాము. దేవుడు శరీరము, దాని అభివృద్ధి కన్నాఆత్మయొక్క అభివృద్ధికి దాని పరిపూర్ణత కొరకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా పరిశుద్ద గ్రంధములోని లేఖనములను పరిశీలించినప్పుడు అర్థము అవుతూ ఉంది. శరీరము వర్ధిల్లటము జరిగితే ఆత్మ వర్ధిల్లుతుంది అని బైబిల్లో చెప్పబడలేదు కానీ ఆత్మ వర్ధిల్లితే శరీరము కూడా వర్ధిల్లుతుంది అని చెప్పబడినది. దీనిని బట్టి ఒక విషయము మనకు సృష్టంగా అర్థం అవుతుంది. మనము శరీరపరమైన ఎదుగుదల కన్నా ఆత్మీయ ఎదుగుదల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. శరీరము మనలను దేవునికి దూరంగా జరపవచ్చునేమో కానీ ఆత్మ మాత్రము దేవునికి ఎల్లప్పుడు దగ్గరగా జరుపుతుంది

దేవుడు శూన్యమునుంచి సమస్త సృష్టిని చేయటము జరిగినది

ఈ వాక్యము ప్రకారము దేవుడు శూన్యములోనుంచి సమస్త సృష్టిని చేయడము జరిగినది. మానవులకు ఏదైనా ఉన్న పదార్థంనుంచి వేరొకటి తయారుచేయడం తెలుసుకాని, లేనిచోట చేయడము అనేది దేవునికి మాత్రమే సాధ్యము. ఆయన శక్తిసామర్ధ్యములు ఊహకు అందనివి. మన జీవితములో మనము ఊహించనివి, సాధ్యము కాదు అనుకున్నవి ఆయన చేయగలరు. మన దృష్టితో చూసినప్పుడు అవి అసాధ్యములుగా కనిపించవచ్చు కానీ దేవునికి అది చిటికెలో పని. ఏమీలేని శూన్యమునుంచి ఇంత అందమైన సృష్టిని కేవలము నోటిమాట ద్వారా చేయగలిగిన దేవుడు చీకటి, అంధకారము, మురికితో నిండిపోయిన మన జీవితములను కూడా అందముగా తీర్చిదిద్దిగలరు. కేవలము ఆయనయందు విశ్వాసము ఉంచడమే మనము చేయవలసిన పని. నిన్ను ఆమూలాగ్రము మార్చివేసి నూతనసృష్టిగా చేయగలరు. ఎవడైతే క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అని లేఖనము కూడా సెలవిస్తుంది. దేవునికి నీ జీవితములో ఏదైనా కార్యము చేయడానికి ముందే అవసరమైన, కావలసిన షరతులు పరిస్థితులు ఏమీ కూడా లేవు. నిన్ను ఉన్నపాటున ఆయన మార్చగలరు. ఇంత గొప్ప సంక్లిష్టతతో కూడిన విశ్వము చిన్న పొరపాటు జరగకుండా నిర్వహిస్తున్న దేవునికి మన సమస్యలు లెక్కలోనివి కావు అని అర్థం చేసుకోవాలి. ఆయన హస్తము మనందరి భారములు సునాయాసముగా ఒక్కసారే మోయగలదు.

దేవుడు మనలను సంరక్షిస్తున్నారు

ఈ విశ్వము పనిచేయు విధానము మనము గమనించినప్పుడు భారీ ఆకారములో ఉన్నటువంటి నక్షత్రములు, గ్రహములు, గెలాక్సీలు మన ఊహకు అందనటువంటి వేగముతో గమనము చేస్తూ ఉంటాయి. వాటిలో అవి ఒక్కోసారి గుద్దుకుని ప్రమాదములుగా మారి విస్పోటనం చెందటము, క్రొత్తవాటికి జన్మ ఇవ్వటము జరుగుతుంది. మనము చాలాసార్లు శాస్త్రవేత్తలు ఏదో భూమిని గుద్దే అవకాశము ఉన్నది అని చేసే హెచ్చరికలు వింటూ ఉంటాము. ఈ విశ్వములో ఏ చిన్న ఆస్ట్రాయిడ్ కానీ, ఉల్క గాని వచ్చి గుద్దుకున్న యెడల జరిగే పరిణామాలు ఊహించడానికే భయంకరంగా ఉంటాయి. కానీ ఇన్నివేల సంవత్సరములనుంచి మనము వాటిని అన్నింటి నుంచి కాపాడుకోవడానికి ఏమీ చేయలేని అశక్తులవలె ఉన్నాకూడా, దేవుడు మన గ్రహమును కంటికి రెప్పలా కాపాడుతున్నారు. దానికి ఏ ఆపదా సంభవించకుండా సంరక్షిస్తున్నారు. మనము ఆయనమీద ఎంత తిరుగుబాటు చేసినాకూడా సహనముతో, దీర్ఘశాంతముతో ఓర్చుకొని మనలను మన ఉనికిని రక్షించే బాధ్యత ఆయన తన భుజాలమీద వేసుకున్నారు. ఇశ్రాయేలు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. తల్లితన బిడ్డలను మరచినా నేను నిన్ను మరువను అని లేఖనములలో ఆయన సెలవిచ్చిన మాటలు ఇందుకు తార్కాణములు