దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను; అవి మీకాహారమగును. భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. (1:29-30)

దేవుడు ఇచ్చిన ఆహారము ద్వారా మన శరీరమునకు శక్తి మాత్రమే కాక స్వస్థత కూడా లభిస్తుంది. మన శరీరములో ఉన్న రుగ్మతలను బాగుచేయటానికి ఇవి దోహదం చేస్తాయి. అలానే దేవుని వాక్యము మన ఆత్మకు శక్తిని, దైవ జ్ఞానమును అందజేయడమే కాకుండా, మాలిన్యము, బంధకముల నుంచి విడుదల పొందటానికి సహాయము చేస్తుంది. మనలో చాలామందికి మనకున్న బంధకముల నుంచి బయటపడిన తరువాత దేవుని వాక్యము శ్రద్ధగా ధ్యానించటానికి సమయము దొరుకుతుంది అనే ఆలోచనలో ఉంటాము. కాని ఇది సరైన ఆలోచన కాదు. మన మనస్సుకు ఉన్న రుగ్మతలు, రోగములు తగ్గాలి అంటే దేవుని వాక్యము అనే మందు ద్వారానే అది సాధ్యము. మందు వాడకుండా రోగము తగ్గటము అసాద్యము కదా. అందుకనే దేవుడు అటు శరీర ఆరోగ్యానికి, ఇటు ఆత్మ యొక్క ఆరోగ్యానికి అవసరమైనవి మసుష్యునికి దయచేయటము జరిగినది.

ఈ రోజుల్లో మనము Seedless ఆహారమునకు అలవాటు పడి అలాంటి ఫలములను కృత్రిమముగా పెంచుతున్నాము. అయితే దేవుని వాక్యము ఆ ప్రకారము Seed ఉన్న ఫలములనే మనకు ఆహారముగా దయచేసారు కాబట్టి , మనము seedless పండ్లకు దూరముగా ఉంటే మంచిది. ఆత్మీయముగా దీనిని ఆలోచన చేసినట్లయితే అంత్యదినములలో ఆ దుర్బోదలు వచ్చి, మనుష్యులను దేవుని వైపునకు కాకుండా, తమ వైపునకు, తప్పుడు సిద్ధాంతముల వైపునకు తిప్పుకునే బోదకుల విషయములో మనము జాగ్రత్తగా ఉండాలి. వీరి బోధలు వినటానికి బాగుంటాయి తప్ప, అవి క్రీస్తు శిలువనొద్దకు, ఆయన సంపూర్ణత అయిన స్వరూపము, పోలికె దగ్గరకు మనలను నడిపించవు. నీవు ఎలాంటి బోధను అనుసరించి ఆత్మీయ ఆహారమును సంగ్రహిస్తున్నావు అనే దానిమీద ఆత్మీయ ఆరోగ్యము అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము శరీర ఆహారము విషయములో జాగ్రత్త తీసుకున్నట్లే, ఆత్మీయ ఆహారము విషయములో కూడా శ్రద్ద, జాగ్రత్త వహించాలి.

ఫలము అనేది చెట్టునకు అంటుకట్టుబడి ఉన్నప్పుడు అది పెరిగి, పక్వానికి వస్తుంది. ఆ సమయములో మనము దానిని తినినపుడు రుచికరముగా ఉండి మనస్సునకు తృప్తినిస్తుంది. పరిపక్వము కాని ఫలము తినటానికి ప్రయత్నము చేసినపుడు అది రుచిగా లేకపోవుట చేత పారవేయబడుతుంది. మనస్సునకు ఆనందము, తృప్తి అందివ్వలేదు. పరిపక్వత చెందిన తరువాత కోయబడకుండా ఉంటే కొద్దికాలమునకు రాలిపోయి కుళ్లిపోతుంది లేదా వృధా చేయబడుతుంది. అలానే మన జీవితములో కూడా మనము దేవునికి అంటుకట్టుబడి, ఎదిగి, పరిపక్వతకు రావాలి. అలా వచ్చిన తరువాత మన జీవితములోని రుచిని ఇతరులతో పంచుకోవాలి. అపుడు లోకములోని అంధకారము చేత నిరాశ, నిసృహలో ఉన్నవారి జీవితములకు తృప్తి లభిస్తుంది. దానిని బట్టి వారు దేవుని మహిమపరచటము జరుగుతుంది. మనము పరిపక్వత చెందకుండా ఇతరులకు మిడిమిడి జ్ఞానమును అందిస్తే వారు ఆ రుచిని చూడలేకపోవుట వలన దేవుని విసర్జించే అవకాశము ఉంటుంది. మనము ఎవరితోను దేవుని గురించి పంచుకోకపోతే చివరికి మరణము ద్వారా జీవితము వృధా అవుతుంది. మనలను మనము రక్షించుకుంటాము కాని ఇతరులకు ఏ విధమైన ఉపయోగము ఉండదు. దేవుడు మనకు ఏదైనా ఉపయోగకరమైనది ఇచ్చినపుడు అది అందరికొరకు అని మనము గుర్తించాలి. భూమిలో పాతిపెట్టబడిన నాణెములాగా అది వృథాకాకూడదు. మిగిలిన నాణెములవలె మరి కొన్ని సంపాదించినపుడే ప్రభువు యొక్క మెప్పును పొందుకొనగలము. సువార్త అనేది మన జీవితముల ద్వారానే చూపించాలి తప్ప కేవలము దేవుని గురించిన మాటలు, జ్ఞానము ద్వారా కాదు. నీ జీవితములో నీవు దేవుని ద్వారా పరిపక్వత దశగా ఎదుగుతున్నావా? నీ జీవితం ద్వారా ఇతరులకు దేవుని యొక్క రుచిని, ఆ సువాసనను అందించగలుగుతున్నావా?