దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. (1:11-13).

ఆయన దగ్గ రకు వస్తే ఎందుకు ఇలా అన్నీ వేరగువుతున్నాయి అని భావించి భయపడకూడదు. వాటివలననే నీ జీవితము నిరుపయోగము అయినది అని గుర్తించాలి. డాక్టర్ మనకు వైద్యము చేస్తున్నప్పుడు ఆ రోగముతో మనము జీవితాంతము తట్టుకోలేని బాధ పడకూడదు అని ముందుగా మనము తట్టుకోగలిగిన అంత బాధ ద్వారానే వైద్యము చేయటము జరుగుతుంది. ఆ బాధ సమసిపోవటానికి చేసే ప్రయత్నములు మనకు అవసరమైన dose ఇచ్చినట్లుగానే, దేవుడు కూడా మన హృదయమునకు అవసరమైన dose ఇచ్చి స్వాంతన కలిగించి, దున్నబడిన ప్రక్రియ ద్వారా వచ్చిన బాధ సమసిపోయేలా చేస్తారు. ఆయన ఉపదేశము అంగీకరిస్తేనే మనము సిద్దపరచబడతాము. ప్రతి వాక్యపు గద్దింపు వెనక ఈలాగున ఆయన ఆదరణ ఉంటుంది అని గ్రహిద్దాము, హృదయమును సిద్ధము చేద్దాము

ఆలాగున తడిపి సిద్ధము చేసిన భూమిలో మనము పంట యొక్క విత్తనమును వేసినట్లు, దేవుడు కూడా ఆయన ప్రణాళికకు సంబంధించిన విత్తనము వేయటము జరుగుతుంది. ఆయన ఈ యొక్క వచనములో వాటి వాటి జాతి ప్రకారము అని చెప్పినట్లుగా, ఆయన మనలో ప్రతి ఒక్కరి మీద దృష్టిపెట్టి ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నారు కాబట్టి ఆ విధముగా మనలను తయారుచేయటము జరుగుతుంది. ఇక్కడ వేయబడిన విత్తనము ఆయన చిత్తానుసారము ఉంటుంది తప్ప, అది మన చిత్తమును అనుసరించి ఉండదు అని గ్రహించాలి. ఆయన మనకు ఎల్లప్పుడు ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడు కాబట్టి, ఆ విధముగా పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు అనేకుల జీవితముల ద్వారా మనము కనుగొన్నాము కాబట్టి మనము భయపడవలసిన పనిలేదు. బిడ్డ తల్లిదండ్రుల చేతుల్లో నిశ్చింతగా నిద్రించినట్లు మనము ఆయన చేతులలో నిశ్చింతగా ఉండాలి. ఇలాగు వేయబడిన విత్తనము ఫలించి మొలకెత్తటానికి, మనకు దానియొక్క ఎదుగుదల, ఫలితము కనిపించటానికి సమయము పడుతుంది. కాబట్టి మనము అప్పటివరకు సహనముతో కనిపెట్టాలి. దేవుని విశ్వాస్యతను, ఆయన వాక్యము అనే విత్తనమును మనము శంకించకూడదు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు, దానిని చేపట్టటానికి మనకు ఓరిమి అవసరము అని పౌలు భక్తుడు చెప్పినట్లుగా సహనముతో, విశ్వాసముతో కనిపెడుతూ ఎదురుచూడాలి.

ఆ విధముగా విత్తనము వేసిన తరువాత అది మొలకెత్తి, చెట్టుగా మారి, దేవుని యొక్క చిత్తమును అనుసరించి విత్తనములిచ్చు చెట్టుగానో లేదా తనలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షముగానో దేవుడు రూపించటము జరుగుతుంది. వాక్యమును సాధారణముగా చూసినా కూడా ఇక్కడ దేవుడు వీటిని అన్నింటినీ తనకోసమో దేవదూతల కోసమో చేసుకోలేదు కాని అన్ని రకాల va­riety కూడా మనిషి కోసమే చేయటము జరిగినది. భవిష్యత్తులో తాను చేయబోయే జీవరాసులకు అవసరమైన సమస్త ఆహారమును వాటికి తగిన మోతాదులో సృజించటము జరిగినది. దేవుడు మనలను రూపించుటకు ముందే మనకొరకు అవసరమైన ఇన్ని రకముల ఆహారమును సిద్ధము చేయటము బట్టి మనకు అవసరమైన వాటి విషయమై ఆయన ఎలాంటి దృక్పధము, మనస్తత్వము కలిగి ఉన్నారు అనేది అర్థము అవుతుంది. జంతువులకు కూడా ఆయన ఆహారము సిద్దము చేయటను బట్టి సమస్త సృష్టి విషయమై ఆయన జాగ్రత్త కలిగి ఉన్నాడు అని అర్థము అవుతుంది. ఇలాఎదిగిన వృక్షములు తమ జాతిని మరలా తయారుచేయటానికి ప్రతిసారి కొత్తగా సృష్టించవలసిన అవసరము లేకుండా వాటిలోనే తమకు సంబంధించిన విత్తనములను కలిగి ఉన్నాయి. అలానే దేవుడు కూడా మనలో తన ఆత్మ అనే విత్తనము, పోలికే, స్వరూపమును పెట్టియున్నారు. మనము కూడా ఆయన మొదటి సృష్టి ప్రకారము సంతానము, వారసులను తయారుచేయాలి. ఆ వృక్షములు ఎలా అయితే మొదటినుంచి క్రమము తప్పలేదో మనము కూడా అలానే ఉందాము