దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను (1:14-19).

ఆకాశమునందలి నక్షత్రములను లేఖనము నీతిమంతులతో పోల్చటము మనము గమనించగలము. వాటికి దేవుడు పేర్లు పెట్టారు అనికూడా, వాటిద్వారా ఆయన పిలుస్తారు అనికూడా లేఖనము సెలవిస్తుంది. దీనినిబట్టి ఆయన ఎప్పుడూ కూడా నీతిమంతుని మరిచిపోరు అని మనము గ్రహించాలి. మనుష్యులకు మాత్రమే ప్రతి ఒక్కరికి గుర్తింపు కింద పేరు ఇవ్వటము జరిగినది. మనకు సాదృశ్యమైన నక్షత్రములకు మాత్రమే మరల ఆ విధముగా ప్రతిదానికి గుర్తింపు ఇవ్వబడినది. ఆ విధముగా ఎలాగైతే ఆవి ఆకాశమును అందముగా వెలిగించాయో భూలోకములో కూడా నీతిమంతులు అందరికీ వెలుగుగా ఉండాలి అనేది దేవుని చిత్తము. దీపము వెలిగించిన తరువాత దానిని మంచము క్రింద కాకుండా దీపస్తంభముమీద అందరికీ వెలుగిచ్చే ఎలా పెట్టాలి అని లేఖనములో చెప్పబడిన రీతిగా ఈ వెలుగు సంబంధమైన జ్యోతులను కూడా దేవుడు పైన ఆకాశములో ఉంచటము జరిగినది. భూమిమీద చీకటిలో వెలిగించిన రీతిగా చీకటి అనే పాపములో మగ్గిపోతున్న వారికి, భూమిని మరలా గాఢాంధకారము కమ్మకుండా నీతిమంతులు తమవంతు పాత్ర పోషించవలసి ఉన్నది. ఆ నీతిమంతులము, ప్రభువు రక్తములో కనబడిన నీవు, నేను అనే విషయము మనము మర్చిపోకూడదు. మరి నీ జీవితములో నీవు ఇతరులకు వెలుగుగా ఉన్నావా?

సూర్యుడు స్వయంగా ప్రకాశించే శక్తి కలిగినవాడు. తన వెలుగుతో విశ్వంలో ఎన్నో ప్రదేశములను వెలిగించ గలిగినవాడు. అనుదినము క్రమము తప్పకుండా తన వెలుగును భూమిమీద ప్రసరింపచేస్తూనే ఉన్నాడు. సమస్త జీవరాసులకు ప్రాణాధారముగా ఉన్నాడు. ఈ సూర్యుని మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోల్చి ఆయనను నీతిసూర్యునిగా లేఖనము అభివర్ణిస్తుంది. ఆయన తన కృపను అనుదినము భూమిమీద విస్తరింపజేయుచున్నాడు. ప్రతి చీకటి రాత్రి గడచిన తరువాత తన వెచ్చటి కిరణముల ద్వారా మనలను స్ప్రుశించి తన ప్రేమను వెల్లడిపరుచుచు’న్నాడు. దినమెల్ల తన చేతులు మనవైపు చాచి మనకొరుకు ఎదురుచూస్తున్నాడు. నీ మీద తన మహిమ, వెలుగు అంతకంతకూ విస్తరింపజేయుచున్నాడు. ఆయన వెలుగులోనే మనము మన క్రియలను నెరవేర్చగలము అని అనుదినము సందేశము ఇస్తున్నాడు. ఈ కృప ఎల్ల కాలము ఉండదు. త్వరగా నిర్ణయము తీసుకొనమని తన అస్తమయము ద్వారా అనుదినము మనకు హెచ్చరిక దయచేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారియొక్క నీతి ద్వారా మాత్రమే మనము నీతిమంతులముగా తీర్చబడతాము అని పరిశుద్ధ గ్రంథము స్పష్టము చేస్తుంది. ఆయన వెలుగు ఎప్పటికీ వాడబారనిది. ఆయన వెలుగు మాత్రమే మనకు అన్నింటినీ స్పష్టముగా కంటికి కనిపించేలా చేస్తుంది. ఆ వెలుగు తీసివేయబడక ముందే, ఆయన దొరుకు కాలమునే, నేడు అను దినము మనకు ఉండగానే మేల్కొందాము. ఆయన వెలుగును వెంబడించి నీతిమంతులుగా మారదాము

చంద్రునికి స్వయముగా ప్రకాశించే శక్తిలేదు సూర్యునియొక్క వెలుగు తనమీద ప్రసరించటము ద్వారా మాత్రమే తన కాంతిని ఇవ్వగలుగుతాడు. సూర్యుడు లేని దినమున చంద్రుడు తన కాంతిని కోల్పోతాడు. ఈ చంద్రుడు సంఘమునకు సాదృశ్యముగా ఉన్నాడు. చీకటిలో మగ్గిపోతున్న లోకమునకు, మరణఛాయలలోను, బంధకములలోను ఉన్నవారికి దేవుని యొక్క వెలుగును గురించి మాదిరి అనేది చూపించుటకు, ఆయన యొక్క గుణగణములను ప్రచురము చేయుటకును దేవుడు సంఘమును లోకములో ఉంచటము జరిగినది. ఈ సంఘము ప్రభువైన యేసుక్రీస్తువారు తనకు ఇచ్చిన వెలుగును ప్రతిబింబించటము తప్ప తనకంటూ ఏ విధమైన మహిమ, వెలుగు లేనిది. ఆయన (ప్రభువైన యేసుక్రీస్తువారు) లేనిరోజున సంఘమునకు వెలుగు, గుర్తింపు లేదు. అది ఉన్నా లేకపోయినా ఒకటే. లోకమును చీకటి మరలా జయించకుండా దేవుడు సంఘమును రాత్రిని ఏలుటకు నియమించారు. ఆ నిశీధిలో ప్రతి ఒక్కరి హృదయములోను సువార్త (ప్రభువైన యేసుక్రీస్తువారి గురించి) ద్వారా అందరి హృదయములలో నిరీక్షణ, భద్రతాభావం కలిగించాలి. వారికి దారి చూపించే దిక్సూచిగా ఉండాలి. ఆ చీకటిలో వారు తొట్రిల్లకుండా వాక్యమును వారి పాదములకు దీపముగా ఎలా మలుచుకోవాలో నేర్పించాలి. మరుసటి ఉదయము రాబోయే వెలుగు గురించి భరోసా కలిగించాలి. మరి మన సంఘములు అన్నీ ఇదే విధముగా ఉన్నాయా? ఒకవేళ లేకపోతే నీ సంఘము గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టు.