దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించువాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను (1:20-23).
పక్షిరాజు ముసలితనము అనేది వచ్చి ఎగరలేనప్పుడు అది ఎంతో బాధను అనుభవిస్తూ, నొప్పిని భరించి తనలో పనికిరాని ఈకలను పీకివేసి తన యవ్వనము నూతన పరచుకుంటుందో, అలానే మనము కూడా ప్రార్థనలో మనకు కలిగే ఆటంకములను అడ్డంకులను తీసివేసుకోవాలి. అవి మనకు నొప్పిని, బాధను కలిగించినా భరించాలి. దానివలన మన ప్రార్ధన జీవితము ఎల్లప్పుడూ నిత్యనూతనముగా ఉంటుంది.
పక్షులు విషయములో నిష్కపటము గురించి మనకు వ్రాయబడినది. పావురము దీనికి సాద్రుశ్యముగా వినియోగించబడినది. మనలో కపటము లేకుండా ప్రార్ధన నిస్వార్ధముగా ఉండాలి. అప్పుడే అది chaos లో ఉన్న లోకమునకు ఒలీవ ఆకులాంటి శుభ వర్తమానము తీసుకురాగలుగుతుంది. మనము కేవలము మనగురించి మాత్రమే కాకుండా ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయాలి అని లేఖనము సెలవిస్తుంది. ప్రార్ధన అనేది ఆయన చిత్తమును అనుసరించి ఉండాలి తప్ప మన స్వంత చిత్తమును అనుసరించి ఉండకూడదు.
పక్షులు ఏదైనా ప్రమాదము సంభవించినప్పుడు చుట్టుప్రక్కల ఉన్నవాటిని హెచ్చరిస్తాయి. ఆ ప్రాంతమునుంచి వేరొక చోటికి ఎగిరిపోతాయి. అలానే ప్రార్థించే వ్యక్తులు ప్రమాదములను ముందుగా పసిగట్ట గలుగుతారు. ఇతరులను హెచ్చరిస్తారు.
పక్షి చూస్తూ ఉండగా ఎవరైనా ఉరియొడ్డితే అవి ఎప్పటికీ అందులో ఇరుక్కోవు. చాలా జాగ్రత్తగా ఉంటాయి. కానీ మనుషులు లోకములో సాతాను పెట్టిన ఉరులు తెలిసి ఉండికూడా వాటిలోనికి నడుచుకుంటూ వెళ్లటము దురదృష్టకరము. ఒకవేళ అవి ఉరిలో చిక్కుకుంటే కలిసికట్టుగా వలతోసహా ఎగిరిపోయాయి అని మనకు నీతికథలలో చెప్పబడిన విధముగా ఏదైనా సమస్యలో, శోధనలో మనము చిక్కుబడినపుడు కలిసికట్టుగా ప్రార్థన చేయటము ద్వారా దానిని జయించగలము, తప్పించుకొనగలము.
పక్షులు పగటి సమయములో తమపని చేసుకుని రాత్రి సమయములో విశ్రాంతి తీసుకుంటాయి. అలానే ప్రార్ధించే మనుషులు కూడా వెలుగు కార్యములనే చేస్తారు తప్ప చీకటి కార్యములు చేయరు.
పక్షులు కూడా ఆక్సిజన్ పీల్చుకుని బ్రతుకుతాయి. అవి వాతావరణములోని పై పొరలలో ఎగరటము ద్వారా కాలుష్యము లేని స్వచ్ఛమైన గాలిని పీల్చుకోగలుగుతాయి. అలానే ప్రార్థించే వ్యక్తికూడా లోకములోని మాలిన్యము తనకు అంటుకొనకుండా తన జీవమును స్వచ్ఛముగా కాపాడుకుంటాడు. ప్రార్థన మనలను పాపము చేయకుండా నిలువరిస్తుంది.
పక్షులు ఆకాశములో ఎగిరేజీవులు అయినప్పటికీ అవి ఎగరని సమయములో తమ కాళ్ళను ఉపయోగించి భూమిమీద నడవగలుగుతాయి. చెట్ల కొమ్మలమీద విశ్రాంతి తీసుకుంటాయి. అలానే ప్రార్థించే వ్యక్తికూడా ప్రార్థన ముగిశాక భూమిమీద తన కార్యకలాపములను నిర్వర్తించాలి. కుటుంబ బాధ్యతలు నెరవేర్చాలి. నేను కేవలము ప్రార్దనే చేస్తాను మిగతా పనులు చేయను అనకూడదు. అది తగ్గింపు జీవితమునకు కూడా సాదృశ్యముగా ఉన్నది. మనము ఎంత ప్రార్థనాపరులము అయినా కూడా గర్వించకుండా మన పాదములు నేలమీద ఉంచుకోవాలి. లోకములోని మిగతావారితో కలిసి బ్రతకాలని దాని సంకేతము.
అది మంచిది అని దేవుడు చెప్పటముద్వారా జీవము కలిగి వాక్యమును అనుసరించి నడిచేవారు, ప్రార్థన చేసేవారు లోకములో సమృద్ధిగా ఉండాలి అని దేవుని చిత్తమై ఉన్నది. మరి ఆ చిత్తమును మనము ఎంతవరకు నెరవేరుస్తున్నాము. దానిని పరిపూర్ణము చేయుటకు ఏమి చేయాలి అనేది ఆలోచించాలి.
పక్షులు ఆహారమును సమానముగా పంచుకుంటాయి. వాటిలో అవి పోట్లాడుకోవు. అలానే సాటిపక్షి ఆపదలో ఉన్నప్పుడు వాటిని రక్షించటానికి అన్నీ కలిసికట్టుగా చేతనైన సహాయము చేస్తాయి. ఏదైనా పక్షి మరణించినప్పుడు అన్నీ కలిసి దాని విషయమై రోదన చేస్తాయి. మనము కూడా వీటిని చూసి సమాజములో ఎలా ఉండాలి. ప్రార్థన చేసే వ్యక్తుల మధ్య ఉండవలసిన లక్షణములు ఏమిటి అనేది స్పష్టముగా అర్థము అవుతుంది. మనము ఒకరి భారములను మరొకరము పంచుకోవాలి. ఆత్మీయముగా మరణకరమైన స్థితిలో ఉన్నవారిని రక్షించాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగిఉండాలి. ప్రార్థనలో మనము తెలుసుకున్న ప్రత్యక్షతలు ఇతరులతో పంచుకోవాలి. లేనియెడల మనలో గర్వము పెరిగిపోయే అవకాశము ఉన్నది.