దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చలించువాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను (1:20-23).
మొట్టమొదటిసారిగా భూమిమీద ఈ యొక్క వచనములద్వారా జీవము కలిగనవి చేయబడ్డాయి. మూడవ దినమున, నాలుగవ దినమున ఈ జీవము కలిగిఉండుటకు అవసరమైన పునాదులు వేయబడ్డాయి. నాలుగవ దినమున మనము చూసినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారియొక్క నీతిమార్గములను అనుసరించి నడుచుకున్నప్పుడు, నిజమైన జీవము మనలో ప్రవేశించి మనము చెల్లించుటకు వీలు కలుగుతుంది. ఈ జీవము మాత్రమే మనలను మరణము తర్వాత కూడా బ్రతికి ఉంచే శక్తికలిగి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథము ప్రకారము నీతిమంతునిమీద మరణమునకు అధికారము లేదు. ఆరోజు ఈ లోకము విడిచి పరలోకము చేరుకొని అక్కడ నివసించటము మొదలుపెడతారు. పరిశుద్ధ గ్రంథము ప్రకారము ఒక మనుష్యుడు తన ఆత్మను కోల్పోయి నరకములో పడటమే నిజమైన మరణము. శరీరంలో ఉన్న ఊపిరి కోల్పోవటము అనేది మన దృష్టిలో మరణము క్రింద భావిస్తాము కానీ లేఖనముల దృష్టిలో అది వేరు. నీలో జీవము అనేది లేకపోతే మనము బ్రతికి ఉన్న మృతునితో సమానము అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కాబట్టి దేవుని దృష్టిలో మనము బ్రతికి ఉన్న వారి లెక్కలో చేరాలి అంటే ఈ జీవమును కలిగి ఉండటము తప్ప వేరే మార్గము ఏది కూడా అందుబాటులో లేదు. మరి నీవు ఈ జీవమును, నిత్యము నిలిచిఉండే దానిని కలిగి ఉన్నావా లేక కేవలము ఊపిరిని మాత్రమే కలిగి ఉన్నావా? పరీక్షించుకో.
ఈ యొక్క జీవము అనేది science చెప్పినట్లుగా దానంతట అదే ఉనికిలోనికి రాలేదు కానీ దేవుని మాటను అనుసరించి రావటము జరిగినది అని ఈ వచనముల వలన మనకు అర్థము అవుతుంది. ఈ దేవుని మాట ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము రూపములో మన చేతులకు ఇవ్వబడినది. అందుకే లేఖనములలో నిత్యజీవము కలదు అని వాటిని మనము పరిశోధించాలి అని తెలియజేయబడినది. లేఖనమును అనుసరించకుండా కేవలము దేవుని నామమును ధరించి ఆయన వారము అని చెప్పుకుంటే ఈ జీవము మనలోకి ప్రవేశించదు. ఈ జీవనము కలిగినవారి జీవనశైలి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ సృజింపబడిన జీవరాసులను అధ్యయనము చేయుట ద్వారా మనము గ్రహించగలము. ఈ యొక్క జీవము కలిగినవి సముద్ర జలములలో నిండిఉండాలి అని ఆయన అభీష్టమై ఉన్నది. ఈ జీవముతో నిండుకున్న ప్రజలు లోకములో సమృద్ధిగా ఉండాలి అని దాని అర్థము. జనులు భూమిమీద నిండియుండటము (సంఖ్యాపరముగా) దేవునికి సంతోషము కలిగించదు. ఆ ప్రజలు దేవుడిచ్చు నిత్యజీవము కలిగి ఉండడమే ఆయనకు ఆనందమును ఇస్తుంది. మరి ఈ వచనములో తెలియజేసినట్లు లేఖనములలో ఉన్న నిత్యజీవమును నీవు పరిశోధించి తెలుసుకొని పాటిస్తున్నావా? లేక దానిని కేవలము మతపరమైన గ్రంథముగానే భావిస్తున్నావా? నీ దృక్పధము మార్చుకోవలసిన సమయము ఆసన్నమైనది.
ఈ విధముగా నిత్యజీవము కలిగిన ప్రజలు లోకములో సమృద్ధిగా ఉన్నప్పుడు ఆయన చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకములో కూడా నెరవేరుతుంది. సమాజములోని జీవన ప్రమాణములు అద్భుతముగా ఉంటాయి. అందరూ సంతోషముగా జీవిస్తారు తప్ప త్వరగా తనువు అనేది చాలించి ఈ లోకము విడిచిపెట్టాలని అనే బాధలో ఉండరు. వీరిద్వారా బంధకములలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు, యుగసంబంధమైన దేవత మాయలో బ్రతుకుతున్న వారికి నిజమైన జీవితము అంటే ఏమిటి? అది ఎలా ఉండాలి అనేటటువంటి అవగాహన వస్తుంది. దీనివలన వారు తమ నడతలను, ప్రవర్తనను గురించి ఆలోచించి పునర్విమర్శ చేసుకుని, దేవుని వైపు ఆకర్షింపబడి మారుమనస్సు పొందే అవకాశము ఉన్నది. మన జీవితములలో దేవుని యొక్క శక్తిని, ఆయన ప్రేమను కనబరచకుండా మనము నిత్యజీవము, రక్షణ గురించి ఎంతమందికి సువార్త ప్రకటించినా అది దాని ఫలములను/ఫలితమును ఇవ్వదు. అందుకే దేవుడు లోకములో ఆయన ప్రతినిధులుగాను, సజీవమైన పత్రికలుగాను, వెలుగుగాను, ఉప్పుగాను ఉండాలి అని కోరుకున్నారు. మరి నీ జీవితము ఇతరులమీద ఎలాంటి ప్రభావము చూపిస్తున్నది. అది సరిగా లేకపోతే ఎలా మార్చుకోవాలి అనేది ఆలోచించు. ప్రభువు నీకు తప్పక సహాయము చేస్తాడు.