మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను (1:6-8).

ఈ లోకములో మనము ఒకరిక్రింద పనిచేస్తూ ఉన్నప్పుడు మనము అడిగినవి ఇవ్వకపోతే strike చేస్తాము. సహాయమును, సంపూర్ణముగా నిలిపివేస్తాము. వారు మనమాట వినేదాకా లేదా ఏదైనా రాజీ కుదిరేదాకా అలానే చేస్తాము. అయితే దేవుడు ఆశించినవి, కోరుకున్నవి, చెప్పినవి మనము ఏమీ చేయకపోయినా కూడా ఆయన మనలను అడగలేదు. ఎప్పుడు strike ప్రకటించి ఆయన సేవలను, ఆకాశమునుండి మనకు అందుతున్నవాటిని ఎప్పుడూ కూడా బంధించి ఉంచలేదు. ఒకసారి మనకు అవసరమైనది ఆగిపోతే దానికోసము మనము ఎంత ఎదురుచూస్తామో. దాని విలువ ఎంతో గ్రహిస్తామో. దేవుడు ఆలా strike చేసి మనము మాట వినేదాకా ఆకాశము మూసి ఉంచితే ఏమి జరుగుతుందో ఊహించటానికే కష్టముగా ఉంది. కానీ దేవుడు మనుష్యులు ఉపయోగించినట్లు బెదిరింపు పద్ధతులు ఎప్పుడూ ఉపయోగించలేదు. మనకు దేనినీ దూరము చేయలేదు. ఇబ్బంది అనేది కలిగించలేదు. నాకు అవసరము అయినది ఇవ్వలేదు అని ఆయనమీద ఎన్నిసార్లు అలిగామో, strike చేసామో. ఇకనుంచి అయినా ఆయన మనకు అనుదినము అందిస్తున్న మేలును, సేవలను గుర్తిద్దాము. ఆయనలో మంచి యజమాని లక్షణములను అర్థము చేసుకుని సహకరిద్దాము. ఆయన మనలను బానిసలుగా కాక కుమారులుగాను, స్నేహితులుగాను చూస్తున్నారు అన్న విషయము ఎప్పుడూ మర్చిపోవద్దు

ఇదే ఆకాశము భవిష్యత్తులో గొప్ప incidentకు వేదిక కాబోతోంది. తనవారిని తీసుకువెళ్ళటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశమునకు రాబోతున్నారు. మనము ఆయనను ఎదుర్కొనుటకు మేఘములమీద అక్కడకు కొనిపోబడతాము. ఎవరైనా మన ఇంటికి వస్తున్నప్పుడు వారియొక్క హోదాను అనుసరించే వారికి తగిన స్వాగత సత్కారములు చేస్తాము. వారు మనకు బాగా ఆత్మీయులు అయితేనే ఎదురువెళ్ళి మన కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్వానిస్తాము. దేవుని యొక్క స్థాయితో పోల్చుకుంటే మనము ఏపాటివారము అనేది నేను ప్రత్యేకముగా చెప్పవలసిన అవసరము లేదు. అలాంటిది మనలను ఎదుర్కోవటానికి తన ఇంటికి తీసుకువెళ్ళటానికి ఆయన తన పరివారముతో ఆర్భాటముగా రావటము గమనిస్తే, మనకు ఆయన ఇచ్చిన విలువను, గౌరవమును ఏమని వర్ణించాలో తెలియటము లేదు. మనము కూడా అనుదినము మన పరివారముతో కలసి అదే విధముగా దేవుని ఆరాధిస్తున్నామా, ఆయనను ఎదుర్కొని సాదరముగా, గౌరవముగా ఆహ్వానిస్తున్నామా? కేవలము మన ప్రార్ధనకు జవాబు ఇచ్చినంతవరకు ఒకలా ఉండి, వాటికి సమాధానము ఇవ్వకపోతే వేరేలా ప్రవర్తిస్తున్నామా? మనము ఆయన మాటను గౌరవించకపోయినా కూడా ఆయన మనపట్ల ఒకేరీతిగా ఉంటున్నాడు అనే విషయము మరచిపోకూడదు. ఇప్పుడే ఆయనకు ఎదురువెళ్లి నీ గృహములోనికి ఆహ్వానించు.

ఇదే ఆకాశములో దురాత్మ అంధకార శక్తులు కూడా నివాసము చేస్తూ దేవుని దగ్గరనుంచి మనకు సందేశములు రాకుండా అడ్డుపడిన సందర్భములు మనము దానియేలు గ్రంథములో చూడగలము. అయితే దేవుడే తన దూతను పంపి యుద్ధము చేసి ఆ సమాచారము దానియేలునకు అందేలా చేయటము జరిగినది. మనము చేసే ప్రార్థనలకు ఏ విధమైన ఆటంకము కలుగకుండా, అవి దేవుని దగ్గరకు సరాసరి చేరేవిధముగా ఏర్పాటులు చేసిన దేవునికి ఎంతైనా వందనములు. వాటిని జయించి మనకు విజయము అనుగ్రహించిన ప్రభువైన యేసుక్రీస్తువారికి కృతజ్ఞతలు. ఒక పిచ్చికుక్క మనమీదకు దాడిచేయటానికి వస్తే తండ్రి మన తరుపున దానితో పోరాడి, దానిని లొంగదీసి, దాని మెడకు గొలుసువేసి దానిని మన చేతికి ఇవ్వటము జరిగినది. అయినా కానీ ఆ కుక్క ఇంకా మనమీద దాడి చేస్తుంది అని భయపడటము, దానికి లొంగిపోవటము మన అవివేకము. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన విజయమును గుర్తిద్దాము. దానితో వాటియొక్క దుర్గములను పడద్రోసి మన తండ్రి ఇంటిని అనుదినము దర్శిద్దాము. ఆయన మన పక్షమున ఉండగా ఏదీకూడా మనలను ఆపలేదు. దీనినిబట్టి సాతాను మనము పరలోకము చేరకుండా అడ్డుపడతాడు అనే విషయము గుర్తించాలి. మెళకువతో, వివేచనతో నడుచుకోవాలి. మన తండ్రి పేరు నిలబెట్టాలి.