దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను (1:14-19).

ఈ విధముగా సంఘము తన ప్రయాసను. ఉద్దేశ్యమును కొనసాగిస్తూ ఉండేటప్పుడు, సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు గ్రహణము సంభవించినట్లు, దేవునికి సంఘమునకు మధ్యలో లోకము అడ్డుగా వస్తుంది. దానిద్వారా సంఘము ఎన్నోఆటుపోటులకు, శ్రమలకు గురికావలసి వస్తుంది. అవి అన్నీ కూడా తాత్కాలికమే. మరల దాని పూర్వ వైభవము అది సంతరించుకుంటుంది. సంఘము మహిమలోనికి ప్రవేశించునంతవరకూ ఈ విధమైన హింసగుండా ప్రయాణము చేయవలసి ఉన్నది. సంఘమునకు హింస కలిగినప్పుడు అది సంపూర్ణముగా నాశనము చేయబడలేదు, త్రోసివేయబడలేదు. చంద్రుడు ఎన్నో గ్రహణములను తట్టుకున్న రీతిగా సంఘముకూడా వాటిని అన్నింటినీ ఎదుర్కొని సమర్ధవంతముగా నిలబడగలిగినది. అలానే మనము నీతిమంతులుగా మారే క్రమములో ఎన్ని ఇబ్బందులు ఎదురు అయినను, అవి మనలను బాధించగలవే గాని మన స్థానములోనుండి దేవుడు మనకు ఏర్పరచిన బాధ్యతనుండి అవి మనలను తప్పించలేవు అని అర్థము అవుతుంది. చంద్రుడు ఆయినా తన కాంతిని అమావాస్యరోజు కోల్పోయి ఆకాశములో కనిపించడేమో కానీ నక్షత్రములు ఎల్లవేళలా కనిపిస్తాయి. అందుకే మన అందరము ఎదగటము అనేది చాలా ముఖ్యము. ఎవరో కొందరి ఎదుగుట వలన అది సాధ్యము కాదు. నీ జీవితములో నీవు ఎదుర్కొన్న శ్రమలు, శోధనలు నిన్ను ప్రభువు మార్గ నుండి తపిస్తున్నాయో చూసుకో. ఆకాశము తట్టు చూసి ధైర్యము తెచ్చుకో.

సూర్యునిలో ఎక్కడా కూడా మనకు మచ్చ అనేది కనిపించదు. దేవునిలో గమనాగమనములు వలన కలుగు ఛాయకూడా ఉండదు అని పరిశుద్ధ గ్రంధము మనకు సెలవిస్తుంది. చంద్రునిలో మనకు మచ్చలు కనిపిస్తాయి. సంఘములో ఏదీ కూడా perfect అనేది ఉండదు. సంఘము శరీరదారులుగా ఉన్న విశ్వాసుల సమూహము. మనము శరీరములో ఉన్నంతవరకు ఎక్కడో ఒకచోట బలహీనత కలిగి ఉంటాము, ఐక్యముగా ఉండము కాబట్టి కొన్నిసమస్యలు ఉంటాయి. అంతమాత్రముచేత మనము సంఘమును తృణీకరించకూడదు. దేవుడు ఎలా అయితే సంఘమును ఉదకస్నానము చేయించి దానిలో వున్న మచ్చ, డాగు అనేది తీసివేస్తాను అని చెప్పారో అలాంటి వైఖరినే, క్షమాపణతో కూడిన ప్రేమతో సంఘమును ప్రేమించాలి. దాని విషయమై దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. బండసందులలో ఎగురుచున్న పావురము అని లేఖనములో చెప్పబడిన విధముగా పరిశుద్ధాత్మడు సంఘములో ఉన్న చీలికల మధ్య పనిచేస్తూ ఉన్నాడు. మనము సంపూర్ణముగా ఆయనకు సహకారము అందించాలి. ఆత్మ కలిగించు ఐక్యతకు భంగము వాటిల్లకుండా చూడాలి. ప్రభువే తన సంఘమును విడిచిపెట్టనపుడు మనము దానిని విడిచిపెట్టటము సబబుకాదు. వాక్యము ద్వారా మరలా కట్టటానికి ప్రయత్నము చేయాలి. మనము అనుదినము అంతరంగములో నూతనపరచబడితేనే సంఘము కూడా నూతనపరచబడుతుంది. మనము సంఘము వేరు కాదు. సంఘము ప్రభువు యొక్క శరీరము.

సూర్యుని యొక్క వెలుగు అనేది దినదినమునకు మార్పు చెందటము అనేది ఉండదు. ఏరోజైనా అది ఒకేలా ఉంటుంది. దాని పరిమాణము, వెలుగులో మార్పులు ఉండవు. దేవుడు మార్పులేనివాడు అని పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది. చంద్రునిలో దినదినమునకు ఆకారములోను, వెలుగులోను మార్పులు అనేవి చోటుచేసుకుంటాయి. సంఘము లోకమునుండి శోధనలు, శ్రమలు, హింస ఎదుర్కోవటమే దీనికి సాదృశ్యము. హింస ఎదురైనప్పుడు సంఘము వాడబారిపోయినది అనిపించినా కూడా మరల తిరిగి తన వెలుగును సంతరించుకోవటము అనేది మనకు ప్రోత్సాహకరమైన విషయము. ఎన్ని శ్రమలు, శోధనలు వచ్చినా ఒక point వరకు తగ్గి మరల అక్కడనుండి తేరుకుని దేదీప్యమానముగా అంతకంతకు వెలుగును సంతరించుకుంటుంది. కాబట్టి ఏ విధమైన పరిస్థితిలోనూ తన వెలుగును సంఘమునుండి దూరము చేయని దేవునికి కృతజ్ఞతా స్తుతులు. భూమి దేవుని కోసము చేయబడినది కాబట్టి అది ఆయన చుట్టూ పరిభ్రమిస్తుంది. సంఘము లోకము కొరకు, భూమి కొరకు చేయబడినది కాబట్టి అది భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. ఎన్ని పోరాటాలు వచ్చినా సంఘమ తన పరిపాలనా స్థితినుండి తొలగిపోకుండా చేసిన దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు. ఆయన మన వెన్నంటే ఉన్నాడు లేకపోతే లోకము ఎప్పుడో మనలను మ్రింగివేసి యుండేడిది. సంఘములు ఉన్నా ఇంకా ఎందుకు ఈ శ్రమలు అని దిగులు చెందకు. దేవుని మార్గ ములు అర్థము చేసుకొని ధైర్యముగా ఉండు.