దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గలవాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. (1:24-25)

అది మంచిది అని దేవుడు చూశారు కాబట్టి మనము చేస్తున్న సేవను ఆయన గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు. అందుకే మనము మనుషుల కోసము అన్నట్లు కాకుండా దేవుని కోసము, ఆయన చూస్తున్నారు అనే భయము, గౌరవముతో చేయాలి. మన అందరి పనికి తగ్గ జీతము ఆయన దగ్గర ఉన్నది. అది ఆయన మనకు అందజేస్తారు అని కూడా వాగ్ధానము చేయబడినది. జీతము తీసుకుంటున్నాము కాబట్టి ఏదో త్యాగము చేస్తున్నట్లు, ఎక్కువ కస్టపడి చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకోకూడదు. తీసుకునే జీతమునకు అవసరమైన పని చేయటము మన భాద్యత. అయినా సరే నీవు ప్రయాస అనుభవించినపుడు దేవుడు గుర్తిస్తున్నాడు, నీకు పనిలో అవసరమైన సహకారము అంతా అందిస్తున్నాడు అని మరిచిపోకు. ఇలాంటి యజమాని మనకు ఎక్కడా దొరకడు. పశువులు ఎప్పుకూ వాటి మద్యలో అవి సన్మాన సభ పెట్టుకోవు. మనము సాటి సేవకుల, సంఘ సభ్యుల నుంచి పొగడ్తలు, ఘనత ఆశించకూడదు. మన ఘనత ప్రభువు నుంచే ఆశించాలి. మనకు చెందవలసిన గౌరవము ఆయన మాత్రమే న్యాయముగా, సరిగా ఇవ్వగలరు. మానవులకు అలా తూచటము చేతకాదు. బెల్షస్సరు మనుష్యుల తూకములో గొప్పగా తూగి దేవుని త్రాసులో తేలిపోయాడు. కాబట్టి దేవుని మెప్పు పొందినవారే మంచి సేవకులు. అదే మనకు మంచిది. మనము సేవకులుగా తగ్గింపు కలిగి ఉంటే ఆయన సంతోషించి మనలను హెచ్చిస్తారు. ఆయన మంద మీద నాయకులుగా నియమిస్తారు. ఆయన ఆశీర్వాదములు ఎప్పుడూ పరసంబంధమైనవి గానే ఉంటాయి. భూసంబంధమైనవి చాలా తక్కువ.

ప్రభువైన యేసుక్రీస్తు యెరుషలేమునకు గాడిద మీద ఎక్కి ప్రయాణము చేసి వెళ్లారు. ఆయన గాడిదతో పాటు దాని పిల్లను కూడా తీసికొనిరమ్మని తన శిష్యులకు చెప్పటాము మనము లేఖనములో చూడగలము. ఆ గాడిద మనమే. మనము ప్రభువును మోసుకుంటూ పరలోకము చేరుకోవాలి. గాడిద, దాని పిల్ల అంతకుముందు బంధకములలో కట్టబడి ఉన్నట్లు మనకు అర్ధము అవుతుంది. ఆ కట్లను విప్పటానికి తన శిష్యులను పంపినట్లుగా ఆయన ఈ దినములలో తన శిష్యులను/సేవకులమైన మనలను దేవుడు పంపిస్తున్నాడు. ఆ కట్లను విప్పి వాటిని ప్రభువు దగ్గరకు తోలుకుని వచ్చినట్లు, మనము కూడా సువార్త ప్రకటించుట ద్వారా పాప బంధకముల నుండి విడిపింపబడిన వారిని ప్రభువు దగ్గరకు నడిపించాలి. దానిమీద ప్రభువు కూర్చుని వెల్లునట్లు వారు ఆయనకు శిష్యులుగా, సేవకులుగా మారేలా చేయాలి. అంతేకానీ మనము వారిమీద ఎక్కకూడదు. మనకు సేవకులునుగా, శిష్యులుగా చేసికొనకూడదు. ఇది అంతయూ మన సంతానమునకు మాదిరిగా చూపించాలి అని ప్రభువు యొక్క ఉద్దేశ్యము. మనము బంధకములలో ఉంటే మన సంతానము కూడా అవే బంధకములలో కట్టబడి ఉంటారు. మనము విడుదల పొంది మన కుటుంబము కూడా విడుదల పొందేలా చేయాలి.

మన ప్రభువు భారమును మోయుట వారికి ప్రాక్టికల్ గా చూపించాలి. అపుడు వారు దానిని అవలంబిస్తారు. ప్రభువును మోయుట ఆయన సేవ చేయుట మనము భారముగా భావించకూడదు. ఆలాగున అయితే మనము ప్రలోక అరణములో ప్రవేశించలేము. మన కుటుంబము కూడా మన ద్వారా ప్రవేశిస్తుంది అని ఈ సందర్భమును బట్టి మనకు అర్ధము అవుతుంది. అది యెరుషలేము చేరకుండా కట్టబడి ఉన్నది, ప్రభువు కల్పించుకుంటే తప్ప దానికి విడుదల లభించలేదు అని మనము మర్చిపోకూడదు. ప్రభువును కాకుండా వేరొక వ్యక్తులను మోసుకుంటూ అనేక గాడిదలు ఆ మార్గములో వెళ్లినను వేటికీ దక్కని గౌరవము, సత్కార్యము, స్వాగతము ప్రభువును మోసిన గాడిదకు దక్కాయి. అలానే మనము ప్రభువును మోయటానికి ఇష్టపడితే అదే విధమైన గౌరవము మనకు, మన పిల్లలకు కూడా లభిస్తుంది. దాని పాదములు కండగుండా దారి పొడుగునా బట్టలు పరచినట్లు మనకు ఏ విధమైన బాధ కలుగకుండా ఆయన జాగ్రత్త తీసుకుంటారు. మనము ఒక వ్యక్తిని ప్రేమించి పనులు చేయటము అనేది ఎప్పుడూ బానిసత్వముగాను, బంధకముగాను బావించము. అలానే ప్రభువునకు కూడా మనము ప్రేమ కలిగిన హృదయముతో సేవ చేయాలి. అది మనకు మరింత ఆనందమును కలిగిస్తుంది. ప్రభువు ప్రయాణము ముగిసే వరకూ గాడిద ఎక్కడా కూడా అభ్యంతరము చెప్పలేదు. మరి నీవు ప్రభువును మోయుటకు ఇష్టపడుతున్నావా? ఆయనకు ఏదైనా అభ్యంతరము చెప్తున్నావా? ఆయన నీ మీద ఎక్కటానికి ముందు నీ బంధకములు/కట్లు విప్పదీసి నీకు విడుదల కలిగించిన విషయము మర్చిపోవద్దు. ఆయనకు కృతజ్ణత కలిగి జీవించు. నీ పిల్లలకు మాదిరిని చూపించు.

దేవుడు సహజసిద్ధమైన మాట్లాడగలిగే స్వరము జంతువులకు ఇవ్వలేదు. ప్రత్యేకమైన సందర్భములలో మాత్రమే అది జరిగినది. దీనిని బట్టి మనము ఒక సత్యము నేర్చుకోవాలి. సేవకులుగా మనము స్వంత స్వరము ఉపయోగించకూడదు. దేవుని యొక్క స్వరమును మాత్రమే మనము వినిపించాలి. మోషే ఎలాగైతే దేవుని యొక్క మాటలను తన స్వరము ద్వారా ప్రజలకు అందించాడో, అలానే మనము కూడా దేవుని మాటలను మన నోటి ద్వారా ప్రజలకు అందించాలి. మనము వాటికి ఏదీ కూడా చేర్చకూడదు. దేవుని యొక్క మాటకు మాత్రమే హృదయములను బద్దలు చేసి మార్చగలిగే శక్తి ఉన్నది. మన స్వంత మాటలకు అలాంటి శక్తి లేదు. పైగా దేవుని వాక్యము జీవము కలిగినది. ఖడ్గమువలె ఎదుటి మనిషి హృదయమును దైవ చిత్తానుసరమైన దుఃఖము కొరకు వారిని కోసి రక్షణలోనికి నడిపించగలదు. అందుకే మనము ఎక్కడా కూడా మన తెలివి తేటలు, జ్ణానము, మాటలు ఉపయోగించరాదు. మరి నీవు ప్రభువునకు చేస్తున్న సేవలో ఆయన నోటికి బూరగా ఉంటున్నావా? లేక నీవే బూరగా మారుతున్నావా? నీ మాటలు చెప్తున్నావా? ప్రభువు యొక్క మాటలు చెప్తున్నావా? ఆయనకు శిష్యులుగా చేస్తున్నావా? నీకు శిష్యులుగా మార్చుకుంటున్నావా?